gowthami ch

Drama

4.8  

gowthami ch

Drama

అమ్మ కోరిక

అమ్మ కోరిక

6 mins
11.3K


"అమ్మా.....నన్ను క్షమించు!! నీ విషయంలో చేయరాని తప్పులు ఎన్నో చేశాను, నా పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు" అని తల్లి శవం ముందు భోరున ఏడుస్తున్నాడు హేమంత్. అతనిని ఓదార్చడం అక్కడ ఎవరికీ సాధ్యం కాలేదు. హిమజ కూడా తను చేసిన పనికి సిగ్గు పడుతూ భోరున విలపిస్తూ "నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను, బాధ పెట్టాను, అయినా మీరు నన్ను ఎప్పుడూ ఒక్కమాట కూడా అనలేదు." అంటూ ఆమె పాదాల మీద పడి కన్నీటితో క్షమాపణ చెప్పుకుంది...


10 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు హేమంత్, హిమజ. పెళ్ళైన కొత్తలో అందరిలాగానే ఇంట్లో పనులన్నీ కలిసి చేసుకోవడం, బయటకి వెళ్ళడం, వారాంతంలో సినిమాలకి వెళ్ళడం ఇలా చాలా ఆనందంగా గడిచింది. అలా చూస్తుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది.తండ్రి చనిపోవడంతో తల్లిని ఒంటరిగా వదలడం ఇష్టంలేక తనతో తీసుకెళ్లాడు హేమంత్, అలా కొంతకాలం ఆనందంగా గడిచింది. గత కొద్దిరోజులుగా కళ్ళుతిరుగుతూ, నీరసంగా అనిపించడం, మరియు వికారంగా ఉండడంతో డాక్టర్ దగ్గరకి వెళ్లారు కొత్తజంట, అప్పుడు తెలిసింది హిమజ తల్లి కాబోతోందని, ఆ విషయం తెలిసి ఎంతో ఆనందించారు. ఈ విషయం తెలిసిన దగ్గరనుండీ అత్తగారు హిమజ వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంది. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఊహలు, అలా చూస్తుండగానే 9 వ నెల వచ్చేసింది. ఒక శుభముహుర్తం చూసి శ్రీమంతం జరిపించారు. నెలలు నిండి ఇవాళ, రేపు అనుకుంటూ ఉండగానే ఒకరోజు రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యి ఇబ్బంది పడింది హిమజ, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నర్స్ వచ్చి హిమజని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తూ "సర్, నేను వెళ్లి ప్రసవానికి అన్నీ సిద్ధంచేసి డాక్టర్ని పిలుస్తాను , ఈలోపల మీరు ఈ దరఖాస్తు నింపండి" అని దరఖాస్తు హేమంత్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుందో అనే ఆదుర్ధాలో చిన్నగా ఎలాగోలా దరఖాస్తు నింపి వెళ్లి తన తల్లి పక్కన కూర్చున్నాడు. తల్లి కొడుకు చేతిలో చెయ్యి వేసి తల నిమురుతూ "భయపడవలసిన పనిలేదు కన్నా!!! కోడలికి ఏమీ కాదు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకో, ఏమైనా అవసరమైతే నేను లేపుతానుగా" అని ప్రేమగా అంది. అమ్మ మాటకై పడుకున్నాడు కానీ అలజడితో నిద్ర పట్టలేదు. లోపల తన భార్య అరుపులు బైటకి స్పష్టంగా వినపడుతున్నాయి. ఇక ఖంగారుగా లేచి చేతులు రెండూ నలుపుకుంటూ అటూ ఇటూ తిరిగాడు . ఇంతలో నర్స్ వచ్చి "వెంటనే ఈ మందులు తీసుకొని రండి" అని ఒక కాగితం చేతిలోపెట్టి వెళ్ళిపోయింది. వెంటనే మందులు తీసుకొచ్చి నర్స్ కి ఇచ్చేసాడు . అడగలేక ,ఉండబట్టలేక ఇక తెగించి "ఇంకా ఎంతసేపు పడుతుంది" అని ఆదుర్దాగా అడిగాడు హేమంత్. 


"ఇప్పుడే పెద్ద నొప్పులు మొదలయ్యాయి ,ఇక ఎంతోసమయం పట్టకపోవచ్చు" అని చెప్పి నర్స్ వెళ్ళిపోయింది. 


ఒక అరగంటకు "క్యార్ క్యార్ "మని ఏడుపు వినపడడంతో ఆనందంగా వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మ ముఖం చూసాడు. తన తల్లి కళ్ళలో ఆనందం చూసి బహుశా నేను పుట్టినపుడు కూడా అమ్మ ఇలాగె ఆనందించి ఉంటుంది అనే ఆలోచన తన మనసున దొర్లింది "అమ్మా!! నేను తండ్రిని, నువ్వు నానమ్మవి అయ్యావమ్మా" అని ఎగిరి గంతేశాడు. నర్స్ పాపని హేమంత్ చేతికి అందించింది. పాపని చూసిన ఆ క్షణాల్ని అలానే తనకళ్ళతో ఫోటో తీసి తన మెదడు పొరల్లో ముద్రించుకుంటూ పాపని చూస్తూ ఉండిపోయాడు. అమ్మ కూడా చొరవగా పాపని తనచేతికి తీసుకుని ముద్దాడింది. హిమజని థియేటర్ నుండి గదిలోకి తీసుకొని రావడం చూసి వెళ్లి పాపని హిమజ పక్కన పడుకోబెట్టి ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. డాక్టర్ సూచనల మేరకు బయటకి వెళ్ళిపోయారు హేమంత్ మరియు వాళ్ళ అమ్మ.2 రోజుల తరువాత బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు, పాపకి నక్షత్ర అని నామకరణం చేశారు, బాగోగులు ఎంతో చక్కగా చూసారు. హేమంత్ ఇంటికి వచ్చిన దగ్గర నుండి మరలా ఉద్యోగానికి వెళ్లేంత వరకూ పాపతోనే ఎక్కువగా గడిపేవాడు , ఇలా ఆనందోత్సాహాలతో 3 సంవత్సరాలు గడచిపోయాయి. ఒక మంచిరోజు చూసి పాపకి అక్షరాభ్యాసం చేయించి పాఠశాలలో చేర్చారు. కొంతకాలం తరువాత... ఒకరోజు ఆఫీస్ లో ఉండగా హేమంత్ వాళ్ళ అమ్మ కి బాగాలేదని కాల్ రావడంతో వెంటనే హాస్పిటల్ కి వెళ్లాడు. "వయసు మీదపడడం మూలాన ఒంట్లో ఓపికలేక నీరసం వచ్చి పడిపోయింది, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది , అయినా ఈ వయసులో ఇంకా పని చేయాలని అనుకోవడం మంచిదికాదు, వీలైనంతసేపు విశ్రాంతికే సమయం కేటాయించడం మంచిది "అని చెప్పారు డాక్టర్.అప్పటి నుండి హేమంత్ అమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించి కొన్ని నెలలలోనే సన్నబడిపోయి, బలహీనంగా మారిపోయి ,తనపని తాను చేసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది ఆమెకు . ఇంక ఇంటి పని , వంటపని , పాపని చూసుకోవటం అన్నీ హిమజ మీద పడటంతో ఉక్కిరిబిక్కిరయ్యి చీటికీ మాటికీ కోపగించుకోవడం ఎక్కువైంది ,చిన్న దానికీ పెద్ద దానికీ అత్తపై అరవడం మొదలుపెట్టింది . ఒకరోజు హేమంత్ వాళ్ళ అమ్మ మంచినీళ్ల కోసం అని వంటింట్లోకి వెళితే పొరపాటున చెయ్యి తగిలి వేడి కాఫీ గ్లాస్ కోడలి కాళ్ళ మీద పడింది. "అమ్మా...." అంటూ బాధతో అరిచి అత్తగారి వంక చూసి "మీకు ఇక్కడ ఏం పని? ఏం కావాలో చెప్తే నేను ఇస్తాను కదా?" అంటూ అరిచింది, తిరిగి ఏం మాట్లాడలేక మౌనంగా వెనుతిరిగింది వాళ్ళ అత్త .ఇలా చిన్న విషయాలకి కూడా అత్త గారి మీద అరవడం ,విసుక్కోవడం ఎక్కువైంది. అయినా అన్నీ మౌనంగా భరించింది ఆమె . పైగా ఆమె మీద పితూరీలు ఎప్పటికప్పుడు భర్తకి చెప్తూ ఉండేది హిమజ. కానీ వృత్తిపరమయిన ఒత్తిడి మూలాన సరిగా పట్టించుకొనే వాడు కాదు.ఒకరోజు హేమంత్, హిమజ, పాప గుడికి వెళ్లి వచ్చేసరికి వంటింట్లో సామానులు అన్నీ కిందపడిపోయి ఉన్నాయి. అది చూసి అత్తగారిపై చిర్రెత్తుకొచ్చి హేమంత్ వైపు చూసి "చూసారా హేమంత్ , మీ అమ్మ ఎంతపని చేసిందో ??? ఇంక నా వల్ల కాదు, ఈ ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి లేక ఆమైనా ఉండాలి, ఎవరుకావాలో నువ్వే తేల్చుకో!!!" అంటూ కోపంగా వెళ్ళిపోయింది . హేమంత్ అమ్మ దగ్గర కి వెళ్లి "ఏంటమ్మా ! తనకి కోపం తెప్పించకుండా ఉండొచ్చు కదా!!!" అని చిరాకుగా వెళ్ళిపోయాడు, కానీ కారణం అడగలేదు. వాస్తవానికి వంటింటి కిటికీ వేయకపోవడం వల్ల పిల్లి వచ్చి అన్నీ చెల్లాచెదురు చేసింది. ఇలా ఎన్నో సందర్భాలలో తల్లి ని మందలించాడు. తెలియక చేసిన తప్పులకి కొన్ని సార్లు , పొరపాటున జరిగిన వాటికి కొన్నిసార్లు.రానురానూ హిమజ గోల పెరిగిపోయింది, అత్తని వృధాశ్రమంలో చేర్పించాలి అని పట్టు పట్టడంతో భార్య మాట కాదనలేక తల్లిని అయిష్టంగానే వృధాశ్రమంలో చేర్పించాడు. నెలలో ఒకసారి వీలు చూసుకొని వెళ్లి తల్లిని చూసి వస్తుండేవాడు హేమంత్ .ఒకరోజు హిమజ వంటింట్లో కాఫీ కలుపుతుండగా ఆడుకుంటూ అక్కడికి వచ్చిన నక్షత్ర ,వాళ్ళ అమ్మకు తగలడంతో ఆ కాఫీ హిమజ చేతి మీద పడింది. నొప్పితో " అమ్మా...." అంటూ అరిచింది. కానీ తన బాధని పక్కనపెట్టి "నీమీద ఏమి పడలేదు కదా బంగారం?" అని కూతురిని అడిగింది. "లేదమ్మా" అంది పాప, ఏమీ కాకపోవడంతో హమ్మయ్య అనుకుంది. అప్పుడు గుర్తొచ్చింది అత్తగారివిషయంలో కూడా ఇలాగె పొరపాటు జరిగి ఉంటుందని, కానీ మన్నించమని అడగటానికి అత్తగారు పక్కన లేరాయే...  ఒకరోజు హేమంత్ , హిమజ , నక్షత్రా ముగ్గురూ కార్ లో వెళ్తుండగా వెనక కూర్చున్న నక్షత్ర శ్రావ్యంగా పాట పాడుతూ ఉంది. కూతురి ప్రతిభకు హిమజ, హేమంత్ తెగ మురిసిపోయారు.పాటతోపాటు రకరకాల భంగిమలు కూడా చేయడంతో అది చూస్తున్న హిమజ "చూడు మన పాప ఎంత బాగా డాన్స్ చేస్తుందో!!! "అని హేమంత్ కి చెప్పింది. "అవునా!" అంటూ వెనక్కి తిరిగాడు, అంతలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కార్ ప్రమాదానికి గురయ్యింది. 


హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు .. నర్స్ వచ్చి హేమంత్, నక్షత్రలకు ప్రధమచికిత్స చేసింది . "అమ్మా.. అమ్మా.. "అంటూ ఏడుస్తున్న పాప కన్నీరు తుడుస్తూ "అమ్మకి ఏమీ కాదమ్మా!! నువ్వేమి భయపడకు" అని ఓదార్చాడు హేమంత్ . హేమంత్ మరియు పాప స్వల్ప గాయాలతో బయటపడ్డారు కానీ హిమజకి మాత్రం గాజు ముక్కలు కళ్ళలో గుచ్చుకోవడం మూలంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉందని చెప్పారు డాక్టర్. రెటీనా దెబ్బ తిందని ఎవరైనా కళ్ళు దానం చేస్తే వెంటనే చికిత్స చేసి చూపు వచ్చేలాగా చేయొచ్చు" అని అన్నారు. ఆ మాట విన్న హేమంత్ కుప్పకూలిపోయాడు. "చూడండి మిస్టర్ హేమంత్, నేత్రదాత కోసం అన్నీ హాస్పిటల్స్ కి సమాచారం అందజేసాం, మీరు కూడా తెలిసిన చోట్ల ప్రయత్నించండి. సమయం లేదు మనకి" అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు డాక్టర్. ఇంతలో ఫోన్ మ్రోగిన శబ్ధం వినపడి తీసి హలో అన్నాడు. అటువైపు వాళ్ళ అమ్మ , కొడుకు మాటల్లో ఏదో తేడా గమనించి "ఏరా ఎలా ఉన్నావ్? ఏంటి మాట అదోలా ఉంది!?" అనగానే వెంటనే "అమ్మా..." అని ఏడుస్తూ అంతా వివరించాడు. కొడుకు ఏడుపు విన్న ఆ తల్లి మనసు కన్నీరు కార్చింది. "నువ్వేమి బాధపడకు , అమ్మాయికి ఏమీ కాదు ,అన్నింటికీ దేవుడున్నాడు, ఎవరో ఒకర్ని ఆయనే పంపిస్తాడు , నువ్వేమి అధైర్యపడకు" అని ధైర్యం చెప్పి పెట్టేసింది. ఒకపక్క దాత కోసం ఎవరి పాటికి వాళ్ళు ఫోన్లు చేస్తునే ఉన్నారు, కానీ హేమంత్ కి క్షణ క్షణం కి భయం పెరిగింది, బెంగతో కళ్లనుండి నీరు ఉబికొస్తున్నాయి, దాత దొరికే మార్గం కనపడట్లేదు అని ఎంతో కుమిలిపోయాడు.ఇంతలో నర్సు హేమంత్ దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చి "దాత దొరికారు , డాక్టర్ కళ్ళు సేకరిస్తున్నారు " అని చెప్పడం విని ఎంతో ఆనందపడ్డాడు. తన మనసులోనే ఆ ధాతకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కొన్ని గంటల తరువాత...చికిత్సచేసి బయటకి వచ్చిన డాక్టర్ "ఇప్పుడే చికిత్స పూర్తయింది, మీ భార్యకి ఎటువంటి ఇబ్బందిలేదు ,మీరు వెళ్లి చూడొచ్చు" అన్నారు.

ఆనందబాష్పాలు తుడుచుకుంటూ డాక్టర్ చేతులు పట్టుకొని "మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను, థాంక్ యూ వెరీ మచ్" అన్నాడు."ఇందులో నేను చేసింది ఏముందయ్యా?? ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చింది, చూస్తే ఆవిడ అప్పటికే చనిపోయారు. ఏదో వృధాశ్రమం నుండి అట, ఇక వారి అనుమతితో ఆవిడ కళ్ళు మీ భార్యకి పెట్టాము అంతే. మీరు చూడాలి అనుకొంటే ఆ దాత శరీరం ఇంకా ఇక్కడే ఉంది, వెళ్లి చూడొచ్చు" అని వెళ్ళిపోయాడు. వృద్ధాశ్రమం నుండి అనేసరికి మనసు ఏదో కీడు శంకించినా, అలా అయ్యుండదు అని తనని తాను సముదాయించుకుని సహాయం చేసిన వ్యక్తిని తప్పక చూడాలి అనుకోని వెళ్ళాడు. మార్చురీ లో దుప్పటి కప్పి ఉంది ఆ దాత శరీరం. మెల్లిగా వెళ్లి దుప్పటి తీసాడు, తీస్తుండగానే నెరిసీనెరియని జుట్టు, వయసులో బాగా పెద్దావిడ అనుకున్నాడు. మరికాస్త తీసేసరికి నుదుటి మీద ఎప్పుడో తగిలి మిగిలిపోయిన మచ్చ ఆనవాళ్లు. అది చూడగానే ఈసారి ఎందుకో షాక్ లా అనిపించింది, ఏదో ఘోరం చూడబోతున్నాను అని ఆందోళనగా వణుకుతోంది శరీరం. ఇక తప్పదన్నట్లు భయంగానే పూర్తిగా దుప్పటి తీసాడు. తన శంక నిజం అయ్యింది.  మరుక్షణం "అమ్మా....!!" అనే పెనుకేక. ఆ కేకకు అక్కడకి వచ్చిన ఆశ్రమానికి చెందిన వ్యక్తి హేమంత్ ని చూసి "బాబు!!! మీ అమ్మ నాతో ఒకమాట చెప్పారు. ఒకవేళ నేను చనిపోతే అవసరంలో ఉన్న నా కోడలికి నా కళ్ళు పెట్టండి అని, అలాగే అని ఆమెకు మాటిచ్చాను అంది. 

 

తనకి ఇక ఎంతో సమయం లేదని అర్ధమయ్యి, చివరిసారి కొడుకుని చూడాలని రమ్మని చెప్పడానికి ఫోన్ చేసింది ఆ తల్లి , కానీ కొడుకు బాధ విన్నాక ఆ విషయం చెప్పలేకపోయింది. తన ఆశ చంపుకుని తనబాధతో పాటు కొడుకు బాధని కూడా భరిస్తూ, అందరూ ఉన్నా , ఎవరూ లేని అనాథలా కళ్ళు మూసింది. కానీ దైవం అనేది ఒకటి ఉంటుంది కదా!! తన కోరిక బలమయినది అవ్వడం వల్ల తన కొడుకుని చూసుకోవాలన్న ఆమె చివరి కోరికని ఈరూపంలో తీర్చింది. ఆపరేషన్ పూర్తి అయ్యి స్పృహలోకి వచ్చిన హిమజకి ఈ విషయం తెలిసిన వెంటనే "నన్ను మా అత్తయ్య దగ్గరకి తీసుకెళ్లండి, కళ్ళకి కట్లతో చూడలేకపోవచ్చు, కనీసం పాదాలు స్పృశించి అయినా నా పాపం ప్రక్షాళన చేయమని వేడుకుంటాను అంది హిమజ. నర్స్ సాయంతో అక్కడకి చేరుకొని అత్తయ్య పాదాలు తాకి "మీ బిడ్డ కడగంటి చూపుకి నోచుకోనీయలేదు మిమ్మల్ని, కానీ నాకు మీరు చూపుని ప్రసాదించారు, మీ ఋణం తీర్చుకోలేనిది అత్తయ్యా!!" అంటూ బోరున విలపించింది. 


Rate this content
Log in

Similar telugu story from Drama