gowthami ch

Drama

5.0  

gowthami ch

Drama

అతని భయం

అతని భయం

2 mins
635


వంటింట్లో గ్యాస్ సిలెండర్ శబ్దం వినపడి పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్లిన విక్రమ్ "ఎన్ని సార్లు చెప్పాను వనజా నీకు గ్యాస్ సిలెండర్ అయిపోతే నన్ను పిలువు నేను వచ్చి కొత్తది పెడతాను అని, అయినా వినకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు" అంటూ భార్య చేతిలోని గ్యాస్ పైప్ ని తీసుకొని కొత్త సిలెండర్ కి బిగించి ఒకటికి రెండు సార్లు గ్యాస్ లీక్ అవుతుందో లేదో చూసి లోపల పెట్టాడు విక్రమ్.


"ఏంటి విక్రమ్ ఇది ప్రతి చిన్న విషయానికీ ఇంతగా భయపడిపోతే ఎలా? నువ్వేదో పనిలో అన్నావుకదా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను చేసుకుందాం అనుకున్నాను. దానికే ఇంతగా ఖంగారు పడిపోయావు. చూడు చెమటలు కూడా పడుతున్నాయి."


"అదంతా నీకు అనవసరం. నేను ఎంత పనిలో ఉన్నా లేదా ఆఫీస్ లో ఉన్నా సరే నాకు ఫోన్ చేసి చెప్పు నేను వచ్చి మారుస్తాను అంతే" అంటూ కోపంగా వెళ్ళిపోయాడు.


విక్రమ్ ని చూసి "నేనంటే ఎందుకో ఇంత ప్రేమ ఈయనకు" అనుకుంటూ తనలో థానే నవ్వుకుంది వనజ.


"ఏమండీ రేపు సాయంత్రం నా స్నేహితురాలి కొడుకుది మొదటి పుట్టినరోజంట నన్ను రమ్మని చాలా సార్లు కాల్ చేసింది వెళ్లి వస్తాను."


"సరే రేపు సాయంత్రం ఒక గంట పుర్మిషన్ తీసుకొని వచ్చి నిన్ను వదిలి పెడతాను." అన్నాడు విక్రమ్.


"మీకెందుకండి అంత శ్రమ నేను ఏ ఆటోలోనో క్యాబ్లోనో వెళ్తానులేండి."


"అలా ఎలా పంపిస్తాను నిన్ను ఒంటరిగా అంత దూరం. నేను వచ్చి తీసుకెళ్తానులే."


"సరే మీ ఇష్టం అండి."అంది వనజ.


అన్నట్లుగానే సాయంత్రం వచ్చి భార్యని తన స్నేహితురాలి ఇంట్లో వదిలి మరలా ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. రాత్రికి మరలా తన భార్య స్నేహితురాలి ఇంటికి వెళ్లి భార్యని ఇంటికి తీసుకొని వచ్చాడు విక్రమ్.


రాత్రికి భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకున్నాడు విక్రమ్ . వనజ కూడా వంటింట్లో పని ముగించుకొని వచ్చి భర్త పక్కన పడుకుని కొంత సేపటికి భర్త మీద చెయ్యి వేసి "ఎందుకండి నేనంటే మీకింత ప్రేమ?" అని అడిగింది వనజ.


"ఎందుకో తెలియదు వనజ, కానీ నీకేమైన అయితే నేను తట్టుకోలేనని మాత్రం తెలుసు." అన్నాడు వనజ వైపు తిరిగి.


"అయినా నాకేమవుతుందండి. "అంది నవ్వుతూ.


"అది కూడా తెలియదు వనజ. కానీ నేను బ్రతికి ఉన్నంత వరకు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. "అంటూ నిద్రలోకి జారుకున్నారు.


బాగా అలసిపోయిన మూలంగా త్వరగా నిద్ర పట్టేసినట్లుంది అనుకొని వనజ కూడా నిద్ర పోయింది.


కొద్ది సేపటికి భార్య వైపు తిరిగి ప్రశాంతంగా నిద్ర పోతున్న భార్యని చూస్తూ "నువ్వు నా ప్రాణం వనజ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను చిన్నప్పుడు అందరూ అంటుండే వారు మనం ఎక్కువగా దేనిని ఇష్టపడితే అవి అంతే త్వరగా మన నుండి దూరమైపోతాయి అనేవారు.


అందుకే నేమో నేను అందరికన్నా ఎంతగానో ప్రేమించిన మా అమ్మ , నాన్న , నా నుండి దూరమైపోయారు , నేను ఎంతగానో ఇష్టపడ్డ స్నేహితుడు దూమైపోయారు చివరకు నాకంటూ ఈ లోకంలో మిగిలింది నువ్వే వనజ. ఇప్పుడు నువ్వు కూడా నా నుండి ఎక్కడ దూరమైపోతావేమో అని నా భయం , అదే జరిగిన రోజు నీతో పాటే నేను కూడా" అంటూ కంటతడి పెట్టుకొంటు భార్య నుడిటిపై ముద్దు పెట్టాడు. 


Rate this content
Log in

Similar telugu story from Drama