gowthami ch

Drama

4.6  

gowthami ch

Drama

ఎదురు చూపు

ఎదురు చూపు

3 mins
610


"ఒసేయ్ కనకం నోరు ఎండిపోతుంది గుక్కెడు మంచినీళ్లు ఇవ్వవే. ఎంతసేపటి నుంచి అరుస్తున్నా పట్టించుకోకుండా ఏం చేస్తున్నావ్ లోపల..." అంటూ అరిచాడు సుబ్బారావు. "అబ్బబ్బబ్బా అరవకపోతే మీరే వచ్చి తాగొచ్చుకదా పనిలో ఉన్నాను" అంటూ వంట గదిలో నుంచి సమాధానం ఇచ్చింది కనకమహాలక్ష్మి . " ఇంతకీ ఏం చేస్తున్నావ్ ఏంటి? వాసనలు తెగ గుబాళిస్తున్నాయి , "అంటూ మంచినీళ్లు తెచ్చుకోవడానికి వంట గదిలోకి వెళ్లిన సుబ్బారావు , "ఇప్పుడు ఎవరికోసం ఇవన్నీ చేస్తున్నావ్? ఉన్న పనంతా పక్కనపెట్టి వీటి ముందు కూర్చున్నావు." అన్నాడు. "ఏంటండీ అలా అంటారు! పిల్లలు వస్తున్నారు కదా పట్నం నుంచి. "


"అయ్యో పిచ్చిదానా.. వాళ్ళు రావడానికి ఇంకా చాలా రోజులు ఉంది కదా! మరి ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏముంది."


" అదేంటి అలా అంటారు , ఇంకా ఎన్ని పిండివంటలు చేయాలో ఇప్పటికే ఆలస్యంగా మొదలు పెట్టానని నేను బాధపడుతుంటే , పెద్దోడికి ఇష్టమైన అరిసెలు చేయాలి , అమ్మాయికి ఇష్టమైన మురుకులు చేయాలి , చిన్నమ్మాయి కోసం రవలడ్డు చేయాలి , సున్నుండలు , కజ్జికాయలు ఇంకా ఎన్నో చేయాలి ఈ పది రోజులు ఎక్కడ సరిపోతాయండీ. అదీకాక చాలా సంవత్సరాల తర్వాత మనవళ్లు మనవరాళ్లతో వస్తున్నారు , వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి అందరూ కలిసి రావడం. ఈ మాత్రమైనా చేయకపోతే ఎలా!!


"సరేగాని చిట్టి గాడి కొట్టుకెళ్ళి తాటిబెల్లం తీసుకురండి. అదంటే చిన్నోడికి చాలా ఇష్టం. చిన్నప్పుడు అదే పనిగా వచ్చి అమ్మ తాటి బెల్లం పెట్టు అని అడుగుతుండేవాడు , ఒకసారి ఇంట్లో తాటి బెల్లం అయిపోయిందని వేరే ఇస్తే నాకు వద్దు తాటి బెల్లమే కావాలని చాలా గొడవ చేశాడు గుర్తుందా!! చేసేది లేక మీరు అప్పటికప్పుడు వెళ్లి తాటిబెల్లం తెస్తే గాని ఏడుపు ఆపలేదు. అంటూ తన చిన్న కొడుకుని గుర్తు చేసుకొని నవ్వుకుంది."


"ఇప్పుడేమైనా తక్కువా నిన్న వస్తున్నామని ఫోన్ చేసినప్పుడు కూడా అడిగాడు. నాన్న తాటిబెల్లం తెప్పించు అని. " అంటూ బయటకి వెళ్ళిపోయాడు సుబ్బారావు.


ఈ పది రోజులు తన పిల్లలకు ఇష్టమైనవన్నీ చేయాలని రాత్రి , పగలు కూర్చొని సిద్ధం చేసింది. ఇంక ఈరోజు రాత్రికి బయలుదేరుతారు రేపు ఉదయానికి ఇక్కడికి వచ్చేస్తారు అనగా , వాళ్ల ఆనందానికి అవధులు లేవు. మరలా మొదలు పెట్టింది రేపు వాళ్ళు వచ్చేసరికి ఏం చేసి పెట్టాలని ఆలోచించడం. వాళ్ల నాన్న అయితే తాటి ముంజలు, పనసకాయలు, రేగిపళ్ళు , ఈత పళ్ళు ఇలా పళ్ళన్నీ సేకరించి పెట్టాడు. ఇంటినంతా శుభ్రం చేయించాడు. ఆ రోజు రాత్రంతా వాళ్ళిద్దరూ నిద్ర పోలేదు. గంటకు ఒకసారి లేచి గడియారం వైపు చూసుకుంటూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ కూర్చున్నారు.


"అవునే కనకం పోయిన సారి పండక్కి మన పెద్దోడు నీకోసం ఒక చీర పంపించాడు కదా ఆ చీర కట్టుకోవే రేపు. పెద్దోడు చూస్తే సంతోషిస్తాడు."


"అవునయ్యో ఆ చీర సంగతే మరిచిపోయాను , సమయానికి గుర్తుచేశావ్. నువ్వు కూడా అమ్మాయి పెట్టిన పంచె కట్టుకోవయ్య బాగుంటావు . "


"అలగలగేలేవోయ్..." ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ సమాధానం ఇచ్చాడు సుబ్బారావు.


"అయినా మన పిల్లలు అప్పుడే ఎంత పెద్దోళ్ళు ఐపోయారయ్య..చూస్తుండగానే పెళ్లిళ్లు అయిపోయాయి పిల్లలు కూడా పుట్టేశారు. మొన్న ఆ చిన్నోడైతే అమ్మ నువ్వు , నాన్న ఇంకా ఎన్నేళ్లు కష్టపడతారు ఇంక విశ్రాంతి తీసుకోండి , మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా , నా దగ్గరికి వచ్చేయొచ్చుకదా అన్నాడయ్యా. మన పిల్లలకి మనమంటే ఎంతప్రేమో" అని

వాళ్ళ పిల్లల జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు . ఇంతలో తెల్లవారింది. కనకమహాలక్ష్మి లేచి ఇల్లంతా శుభ్రం చేసి బయట కల్లాపు లాంటివి చేసి రంగురంగుల రంగవల్లులు పెట్టి స్నానం చేసి పూజ చేసి వాళ్ళు వచ్చే సమయానికి తినడానికి అన్నీ సిద్ధం చేసి ఎదురుచూస్తూ కూర్చుంది.


బయలుదేరడానికి ఇంక ఒక్క గంట ఉంది అనగా రావడానికి వీలు పడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు పిల్లలు. ఇలా చెప్పడం వాళ్ళకేం కొత్త కాదు , పిల్లలు పుట్టక ముందు ఎప్పుడో వచ్చారు, పిల్లలు పుట్టి ఇప్పటికే మూడు సంవత్సరాలయింది ప్రతి సంవత్సరం ఇలాగే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాము , బయలుదేరుతున్నాము అంటారు చివరి నిమిషంలో కుదరలేదు అంటారు. కానీ ఆ తల్లి మాత్రం వస్తున్నాము అన్న ప్రతిసారి ఇదే విధంగా ఆనందంతో అన్నీ పిండి వంటలు చేసి పెట్టేది.


కానీ ప్రతీ సారీ వాళ్ళ నుండి వచ్చే సమాధానం ఇదే. ఈసారైనా తప్పకుండా వేస్తారేమో అని కోటి ఆశలతో , ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురుచూశారు ఆ దంపతులు.


" అదేంటండీ ఈ సారి కూడా ఇలానే చేశారు. ఈసారైనా తప్పకుండా వస్తారు అనుకున్నాను." అని బాధపడింది కనకమహాలక్ష్మి. "బాధపడకు కనకం వాళ్ళకి మాత్రం రాకూడదు అని ఉంటుందా! చేసే ఉద్యోగాలు అలాంటివి మరి ఏం చేస్తాం ఇంకొక సంవత్సరం ఎదురు చూడటం తప్ప." అని బయటికి వెళ్లిపోయాడు సుబ్బారావు.


మరుసటి రోజు ఉదయం కనకం నిద్ర లేచి చూసే సరికి ఇల్లంతా సందడిగా ఉండడంతో గదిలోనుండి బయటకి వెళ్లి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన నలుగురి పిల్లలు , మనవళ్లు , మనవరాళ్లు అంతా కళ్ళముందు ప్రత్యక్షమయ్యేసరికి ఆనంద బాష్పాలతో కళ్ళు తడిచి ముద్దయిపోయాయి. ఒక్కక్షణం కళ్ళు నలుపుకొని తిరిగి చూసింది. ఎదురుగా ఉన్న పిల్లల్ని చూసి అవును ఇది నిజమే అనుకొని తనివితీరా పిల్లల్ని దగ్గరకి తీసుకుని ముద్దాడింది.


Rate this content
Log in

Similar telugu story from Drama