Radha Oduri

Comedy

4  

Radha Oduri

Comedy

నీకై వేచే.. నీ లవ్ కుమార్😍

నీకై వేచే.. నీ లవ్ కుమార్😍

5 mins
557



నీకై వేచే.. నీ లవ్ కుమార్😍


రచన: # రాధ ఓడూరి #


"కొత్తా  దేవుడండీ… . కొంగొత్తా దేవుడండే...…" , అంటూ బిగ్గరగా పాట పాడుతున్నాడు లవ్ కుమార్. 


"ఏయ్ లవ్ ! నీ లాగే నీ పాటలూ వెరైటీనేరా పాట పాడటం ఆపి త్వరగా రా రా! మన ఆఫీస్ టైం అవుతోంది. గంట నుంచి రెడీ అవుతూనే ఉన్నావు!అసలే నువ్వు తెల్లని తెలుపు నీ మొహానికి అన్ని రకాల క్రీంలు రాసి రాసి ఉన్న తోలు ఊడుతుందేమో రా!" అంటూ కౌశిక్ లవ్ కుమార్ ని తొందర పెట్ట సాగాడు చికాకుగా. 


"ఓరేయ్ కౌశికూ! నీకు నా మీద చాలా కుళ్ళుందని ఇన్ని సంవత్సరాలకి తెలిసింది రా! సరే పదా నీకు సగం కుళ్ళు తగ్గటానికైనా నా అలంకారాన్ని తగ్గిస్తున్నాను ", అంటూ రూం కి తాళం వేసి కౌశిక్ బైక్ పై వెనక కూర్చున్నాడు లవ్ కుమార్. 



ఆఫీస్ టైం మించి పోవడంతో కౌశిక్ తన బైక్ ని వేగంగా పోనిస్తున్నాడు. లవ్ కుమార్ తనదైన స్టైల్లో విజిల్ వేస్తున్నాడు. లవ్ కుమార్ పాటలను పాడటం కంటే విజిల్ స్టైల్లో వేయడం లో చాలా దిట్ట. లవ్ నుంచి ముక్కు అదిరి పోయి సెంట్ వాసన వచ్చినా తను వేసే పాటల విజిల్ కౌశిక్ కి చాలా ఇష్టం. అందుకే బండి నడుపుతున్నంసేపూ లవ్ ని ఏమి అనడు. 



ఇంతలో వెళ్ళే దారిలో రెడ్ సిగ్నల్ పడేసరికి బండి కి బ్రేక్ పడింది. 


"ఓరేయ్ లవ్! ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ లేక పోతే ఎంతో మంది చనిపోతారు కదా! "


__________


ఏంట్రా పలకవు!? 

… 

.. 

ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడటంతో కౌశిక్ బండిని ముందుకు నడిపాడు. బైక్  వేగంగా పోతోంది… కానీ లవ్ నోటి నుండి ఎలాంటి విజిల్ రావడం లేదు. 


"ఒరేయ్ లవ్వూ! ఏంటి ఏ రోజు లేని పరధ్యానం!"


నేను ప్రేమ లో పడ్డారా!


అంతే కౌశిక్ బండిని పక్కకి అపి.. ఎప్పుడూ! ఎక్కడ రా ? కుతూహలంగా అడిగాడు. 


లవ్ తల ని గుండ్రంగా తిప్పుతూ పళ్ళు ఇకిలిస్తూ.. సిగ్గు పడుతూ.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర. 


"ఎలా ఉంటుంది రా! నీ లాగా తెల్లగా? సన్నగా నా? లావుగా నా? ", ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగాడు కౌశిక్. 


అమ్మాయిని చూడలేదురా ! 


మరి లవ్ లో ఎలా పడ్డావురా!? 


మరే.. మరే.. 


ఎహె చెప్పు.. 


మరే.. మరే


ఇంకోసారి మరే అన్నావంటే నీ మీద నుండి బైక్ పోనిస్తారా వెధవ! 


మరే మరే ఇందాక సిగ్నల్స్ దగ్గర ఒక ఆటోలో.. 

_________


"ఆ ఆటోలో!  " చెప్పరా నన్ను టెన్షన్ పెట్టకు. 


"ఆటోలో ఒకామె!?"

… 

"ఆ …..ఒకామె

 ఎడమ పాదము కనిపించింది రా… "


ఆ కనిపించి? 


అయితే పాదం అంతా చూడలేదు రా! కానీ ఆ పాదా కున్న వేళ్ళు ఎంత అందంగా ఉన్నాయనుకున్నావు? 


అంటే అంటే నువ్వు మొహం చూడలేదా? 


లేదు రా!కానీ ఆ పాదాన్ని గుర్తు పడతానురా! . 


లవ్ కుమార్ మాటలు వింటున్న కౌశిక్ కి ఒక వైపు నీరసంగా , ఇంకోవైపు ఆశ్చర్యంగా మొహం పెట్టి తల పట్టుకొని కింద కూర్చుండి పోయాడు కౌశిక్.



ఏంట్రా అలా కూర్చుండి పోయావు. దీనికి కూడా కుళ్ళేనా! 


___________


కౌశిక్ తల గోక్కుంటూ" ఒరేయ్ !నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. పాదం చూసి ప్రేమించడం ఏంట్రా!? "


"ఓహో! వేలు తగిలి పూర్వ జన్మ గుర్తుకు రావడం, మొహం చూడకుండా చేతికి రంగు రంగుల బ్యాండ్లు వేసుకున్న అమ్మాయి ని ప్రేమించడం, బొడ్డు సుందరని వెంటబడటం ఇవన్నీ సినిమా లో చూపిస్తే అబ్బా!  ఓ యబ్బో! అంటూ సినిమాలని హిట్ చేస్తారు. అదే నిజ జీవితంలో జరిగితే ఇలా అంటావారా కౌశిక్? ", నీ పేరులోనే ఉంది రా కొవ్వు. 


"ఒరేయ్ లవ్వూ!  ఇక ఆపరా! ఆఫీస్ టైం అవుతోంది."


ఏం మాట్లాడకుండా బండిపై కూర్చున్నాడు లవ్. 


"ఒరేయ్ లవ్! విజిల్ వేయడం లేదు!"


"నేను నా పాద సుందరిని పెళ్ళి చేసుకునేంత వరకూ విజిల్ వేయనురా!"


కౌశిక్ తన మనస్సులో నవ్వుకున్నాడు… పిచ్చి పిచ్చిగా. 

'వీడిని ఇక్కడే రోడ్డు మీద ఆపి చింత బరిక తో చీల్చి చెండాడితే! ఎందుకులే వాడికే ఆ పిల్ల జాడ తెలియక తిరిగి తిరిగి కాళ్ళు అరుగిపోతాయి' అనుకుని తన ఆలోచనలకి స్వస్తి చెప్పాడు. 


కానీ లవ్ మనసంతా, ఒళ్ళంతా చింత బరికెతో కొట్టినట్లు ప్రేమా ప్రేమా అని మూలగసాగింది. ఆమె పాదం కళ్ళ ముందు నర్తించసాగింది. 



సాయంత్రం నాలుగు గంటలు. 


ఆఫీస్ లో ఆడ దోమ కుట్టినట్లు తొలి ప్రేమ తో  గజిబిజి  అయిపోతున్నాడు  లవ్. 


 ఇంతలోఅమ్మ నుంచి ఫోన్. విసుక్కుంటూనే ఫోన్ ఎత్తాడు కానీ కళ్ళ ముందు ఆమె పాదం కదలాడుతోంది. 


హలో.. 


" ఒరేయ్ లవ్వూ! నేను మీ నాన్న మీ ఆఫీస్ దగ్గరే ఉన్నాము రా! "


"అయితే ఏంటి!? "


"అంత విసుగేంటి రా!" 


ఇంకో గంటైతై ఆఫీస్ అయిపోతుంది. 


"ఒరేయ్ వెధవా! నువ్వు వస్తావా? మేమే రావాలా?"


ఇక అమ్మ తో వాదులాడటం మంచిది కాదు అనిపించి మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసికొని ఆఫీస్ నుంచి బయటపడ్డాడు లవ్. 


మెట్లు దిగుతున్నాడే కానీ ఆమె పాదం కళ్ళ ముందు కదలాడుతోంది. 


ఇంతలో "ఒరేయ్ గాడిద!" అన్న నాన్న  గొంతు విని ఈ లోకంలోకి వచ్చాడు. 


"మేము నీ ముందే ఉంటే అలా వెళ్ళిపోతున్నావు? సరేలే కారెక్కు" .


లవ్ కారు ఎక్కుతూనే "ఏంటి ఇంత తొందరగా రమ్మన్నారు? ఇంత సడన్ గా ఊరి నుంచి వచ్చారేంటి? "


"నీకు అమ్మాయి ని చూడటానికి రా!"


"నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను నాన్న". 


"ఏడ్చావులే! ముందు పిల్లను చూడు."


"నచ్చక పోతే పెళ్ళి చేసుకోను సరేనా!"


"సరేరా!"


అయిష్టంగానే పెళ్ళి చూపులకి కూర్చున్నాడు లవ్..శాస్త్రి గారి ఇంట్లో.


ఫలహారాలు, కాఫీలు అయ్యాక శాస్త్రి గారు భార్య తో "అన్నపూర్ణా! ఇక మన అమ్మాయి ఉమని తీసుకురా!. "


పెళ్ళి కూతురు ఉమ  లవ్  ముందు కుర్చీ లో  వచ్చి కూర్చుంది. 


అప్రయత్నంగా ఉమ పాదాల వైపు చూశాడు. అంతే ఒక్కసారి గా " హలో గురు ప్రేమ కోసమే జీవితం " పాటకి విజిల్ వేస్తూ  కౌశిక్ కి ఫోన్ చేసి పాట వినిపించాడు. 


కౌశిక్ వెంటనే "ఎలా ఉందిరా అమ్మాయి?. "


"మా అమ్మ కలర్ రా!."


అంటే !నలుపు కదా! 


"ఇష్టానికి కలర్ తో సంబంధం లేదు రా కౌశిక్!." 


కౌశిక్ తిరిగి మాట్లాడే లోపు ఫోన్ పెట్టేశాడు లవ్. 


ఉమకీ నచ్చాడు..లవ్ కుమార్ ని చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు కి లవ్ హృదయంలో పూల వాన కురిసింది. 


అక్కడున్న అందరికీ కాస్త  అర్థమైంది  పెళ్ళి కూతురు నచ్చిందని. కానీ అతను వేప మండలు పట్టుకున్నట్లు ఊగిపోతున్నాడేంటో మాత్రం అర్థం కాలేదు. అందరి మొహాలలోనూ ఒకటే అదే ప్రశ్న?. 


లవ్ కుమార్ కి అక్కడి పరిస్థితి అర్థమై  వెంటనే పక్కనున్న ప్లేట్ లోని మైసూర్ పాక్ తీసికొని ఉమ ముందు మోకాళ్ళ పై వంగి " నీకై వేచే… ఓ నా పాదసుందరీ  నీ లవ్ కుమార్" , అంటూ మైసూరు పాక్ ని ఉమ నోటికి అందించాడు. 


ఉమకి మాత్రం లవ్ మాటల్లోని  రహస్యం అర్థమై లవ్ చేతిలోని మైసూరు పాక్ ని నోటితో అందుకుంది. 


నిజమే ప్రేమికుల హావభావాలు ప్రేమికులకి మాత్రమే తెలుస్తాయి. అంతే కాదు నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు.


శాస్త్రి గారి ఇల్లు ఆనంద నిలమైంది.లవ్ కుమార్ ఉమల  పెళ్ళి తో. 



***శుభం***
















 









       






















 









       





Rate this content
Log in

Similar telugu story from Comedy