Lahari Mahendhar Goud

Romance

4.0  

Lahari Mahendhar Goud

Romance

నీ చూపులే... నా ఊపిరే చెలి

నీ చూపులే... నా ఊపిరే చెలి

7 mins
308


 తొమ్మిదింటికి కాలేజీ అయితే ఎనిమిదిన్నరకు నిద్రలేచి ఆదరాబాదరాగా కాలేజీ కి రెడీ అయింది అమూల్య...అమ్మో ఇప్పుడు కానీ అమ్మ చూస్తే టిఫిన్ చేసి వెళ్లమని గోల చేస్తుంది ఎలాగైనా అమ్మ కంటపడకుండా తొందరగా బయటికి వెళ్లి పోవాలి అని అమూల్య అనుకుంటుండగానే వాళ్ళ అమ్మ ఒక కవర్ తో అమూల్య గదిలోకి వచ్చింది

అమ్మూ నిన్ను ఈ రోజు కాలేజీకి వెల్లోద్దు అని చెప్పమన్నారు మీ నాన్నగారు....

పదిన్నరకు రాహుకాలం వెళ్ళిపోగానే అబ్బాయి వాళ్ళు వస్తారట పెళ్లిచూపులకు

ఇదిగో ఈ చీర కట్టుకొని రెడీగా ఉండు...

ఏంటమ్మా ఇది నాకు ఒక్క మాటయినా చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏంటి....

ఈ ఒక్క ఇయర్ అయితే నా డిగ్రీ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పాను కదా...

ఇలాంటివి ఏమైనా చెప్పేది ఉంటే మీ నాన్నగారికి చెప్పుకోవే మీ తండ్రి కూతుర్ల మధ్య నేను చచ్చి పోతున్నాను...

చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పటం అలవాటు లేని అమూల్య మారు మాట్లాడకుండా రెడీ అయింది...

అబ్బాయి వాళ్ళు రావడం...

పెళ్లిచూపులు జరగటం...

అబ్బాయి【సురేష్】కి అమూల్య నచ్చటంతో వెంటనే తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు...

కానీ అమూల్య మనసు చాలా బాధగా ఉంది

కనీసం నా అభిప్రాయం కూడా అడగకుండా నాన్నగారు ఇలా చేస్తారు అనుకోలేదు...

ఇష్టం లేని పెళ్లి చూపులు కాబట్టి అమూల్య అసలు అబ్బాయి మొహం కూడా చూడలేదు...

కానీ ఏదో ఒక సందర్భం కల్పించుకుని అబ్బాయితో మాట్లాడి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాలి అనుకుంది...

ఇంతలో అబ్బాయి వాళ్ళు కబురు పంపారు అమూల్యతో మాట్లాడాలి అని...

హమ్మయ్య వాళ్లే మాట్లాడాలి అని అడిగారు కాబట్టి ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేయాలి అనుకుంది...

కానీ సురేష్ తో పాటు వాళ్ళ అక్క కూడా వచ్చింది...

వాళ్ళ అక్కని చూడగానే అమూల్య వేసుకున్న ప్లాన్స్ అన్ని పూర్తిగా ఫ్లాపయ్యాయి...

సురేష్ వాళ్ళ అక్కతో తడిపొడిగా మాట్లాడి ఇంటికి వచ్చేసింది అమూల్య...

వాడిపోయిన మొహంతో బెడ్ పైన వాలిన అమూల్య మొహం పై కట్ చేస్తే...

పెళ్లి మండపం లో ఎవరి హడావిడిలో వాళ్లు ఉన్నారు

అంగరంగ వైభవంగా అమూల్య సురేష్ ల పెళ్లి జరిపించారు అమూల్య వాళ్ళ నాన్నగారు....

బంధువులందరి దీవెనలు అయిపోయాక ఫోటోగ్రాఫర్ వీళ్లిద్దరు చేత కొన్ని స్టిల్స్ పెట్టించి ఫోటో షూట్ చేస్తున్నాడు....

మొదట ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నట్లుగా ఉంది స్టిల్...

ఆ క్షణం సురేష్ కళ్ళల్లో తనపై అంతులేని ప్రేమను చూసిన అమూల్యకు బహుశా ఇదేనేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అనిపించింది

ఆ తర్వాత అమూల్య భుజం మీదుగా చేతులు వేసి అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తున్న సురేష్ ని చూస్తుంటే...

ఇంతకు ముందు ఎవరైనా తనను పొరపాటును తాకినా కూడా ఎంతో కంపరంగా అనిపించేది...

కానీ ఇప్పుడు సురేష్ స్పర్శను ఫీల్ అవుతుంటే ఇదేనేమో పెళ్లి గొప్పతనం అనిపించింది...

ఆ కొన్ని నిమిషాల్లోనే సురేష్ సాన్నిహిత్యంలో ఎంతో సెక్యూర్డ్ గా అనిపించింది అమూల్యకు....

తన మెడలో మూడు ముళ్ళు పడే చివరి క్షణం వరకు కూడా ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోతే బాగుండు అని ఎదురుచూసిన అమూల్య...

ఇప్పుడు రెప్పపాటు కాలం కూడా సురేష్ మీద నుండి చూపు తిప్పుకోలేక పోతుంది....

అబ్బాయి తరపు వాళ్ళకి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ అందరూ కన్నీటి పర్యంతం అవుతూ అప్పగింతలు చేశారు అమూల్య తరపు వాళ్ళు...

పెళ్లికి ముందు సురేష్ తో మాట్లాడాలి అని అమూల్య ఎంత ప్రయత్నించిందో....

ఇప్పుడు ఒక్కసారైనా అమూల్యతో ఏకాంతంగా మాట్లాడాలని సురేష్ చేయని ప్రయత్నం లేదు...

పాపం పంచాంగం కూడా సురేష్ మీద పగ పట్టినట్లుంది... మరో 12 రోజుల వరకు శాంతి ముహూర్తం లేదని చెప్పారు సిద్ధాంతి గారు...

ఆ మాట వినగానే లాక్ డౌన్ వల్ల టూర్ క్యాన్సల్ అయినట్లుగా మొహం పెట్టిన సురేష్ ని చూస్తుంటే నవ్వు ఆగటంలేదు అమూల్యకు....

మూడు రోజులకే ఒక్కొక్కరుగా బంధువులు అందరూ వెళ్ళిపోయారు

ఇంకేముంది సురేష్ ఒంటరిగా అతని రూమ్ లో....

అమూల్య పార్వతమ్మ [సురేష్ అమ్మ] గారి రూమ్ లో...

భోజనం వడ్డిస్తున్నప్పుడు అమూల్య ఏదైనా మాట్లాడుతుంది ఏమో అని ఆశగా ఎదురు చూస్తున్న సురేష్ కు అక్కడ కూడా నిరాశే మిగిలింది...

హ్యాండ్ వాష్ చేసుకోగానే టవల్ తో రెడీగా ఉన్న అమూల్య "పక్కనే అత్తయ్య గారు ఉన్నారు కదండీ ఆవిడ ముందర మాట్లాడితే ఏమైనా అంటుందేమో అని భయం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది"...

అమూల్య మాటలను బట్టి ఆమె కూడా తనతో మాట్లాడటానికి ఎదురు చూస్తుంది అని అర్థమైన సురేష్ కి చిన్నపాటి సంతోషం కలిగింది...

ఉదయాన్నే స్నానం చేస్తూ ఎలాగైనా అమూల్యని తన రూమ్ కి రప్పించాలని ప్లాన్ వేసి...

కావాలనే టవల్ మర్చిపోయినట్లుగా అమూల్యను పిలిచాడు....

కానీ పాపం సురేష్ ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది....

అమ్మాయి అసలే కొత్త కదరా నీ వస్తువులు ఏవి ఎక్కడ ఉంటాయో తనకేం తెలుసు...అందుకే నేనే టవల్ తీసుకోవచ్చా ఇంద తీసుకో నాకు అవతల చాలా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది పార్వతమ్మ....

అమ్మ ఇంట్లో ఉండగా మమ్మల్నిద్దరిని కలవనివ్వదు...

కలవటం పక్కన పెడితే కనీసం ఏకాంతంగా మాట్లాడుకొనివ్వదు....

అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుని అమూల్యని బయటకు తీసుకెళ్ళాలి.... అనుకొని బయటకు వచ్చిన సురేష్ కు అమూల్య డైనింగ్ టేబుల్ పైన టిఫిన్ సర్దుతూ కనిపిస్తుంది....

మెల్లిగా వెనక నుండి వెళ్లి ఆమెను గట్టిగా హగ్ చేసుకోగానే అమూల్యకు ముందర వైపున ఉన్నా వాళ్ల పనమ్మాయి(దేవి) సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది....

ఏంటండీ ఇలా చేశారు ఇప్పుడు దేవి ముందర ఎలా నార్మల్గా తిరగగలను....చిరు కోపంతో అంటుంది అమూల్య....

హమ్మయ్య దేవి గురించా నీ కోపం.....

నేనింకా నీకు ఎక్కడ కోపం వచ్చిందో అని తెగ కంగారు పడిపోయాను...

ఈవినింగ్ రెడీగా ఉండు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుని మూవీకి వెళ్దాం అని చెబుతూ ఉండగా పార్వతమ్మ గారు వచ్చారు....

సురేష్ సాయంత్రం కాస్త తొందరగా రా....

నేను, దేవి గుళ్లో ప్రవచనాలకు వెళ్తున్నాం..

ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంటుంది కదా...

ఇంతలో టిఫిన్ ఎలా ఉంది అన్నట్లుగా అమూల్య కళ్ళతోనే సైగ చేస్తుంది....

సురేష్ కూడా చాలా బాగుంది అన్నట్టు కళ్ళతోనే సమాధానం చెబుతాడు...

వాళ్ళిద్దరి మాటలకు పెదవి గడప దాటాలంటే ఆంక్షలు ఉన్నాయేమో కానీ....

ఇరువురి మనసులు కళ్లతోనే ఎన్నో చిలిపి ఊసులను పంచుకుంటున్నాయి....

ఈ భావం మాటల్లో చెప్పలేనిది....

ఎవరికి వారే స్వయంగా అనుభవంతో చవి చూడాల్సిన తీపి జ్ఞాపకం...

ఏరా ఒకవైపు నేను చెబుతూనే ఉన్నాను ఏమీ సమాధానం చెప్పవా....

నిజం చెప్పాలంటే అసలు పార్వతమ్మ ఏం చెప్పిందో కూడా సురేష్ సరిగ్గా వినలేడు....

అదీ అమ్మ నేనే నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను....

అమూల్యని తీసుకుని సినిమాకి వెళ్దాం అంటూ నసుగుతున్నాడు సురేష్ ....

మేమే ప్రవచనాలకు గుడికి వెళ్తాం అని చెప్తూ ఉంటే...

మీరు సినిమాకి ఎందుకు రా వెధవ...

నోరు మూసుకొని ఇంట్లో ఉండండి....

పార్వతమ్మ చెప్పిన మాటలు అప్పుడు అర్థమైన సురేష్ ఈవినింగ్ గురించి తలుచుకుంటూ ఎంతో హుషారుగా ఆఫీస్ కి వెళ్ళాడు....

సురేష్ ఆఫీస్ లో ఉన్నాడు అన్న మాటేగానీ అతని మనసంతా ఇంట్లో ఉన్న అమూల్య చుట్టూనే తిరుగుతూ ఉంది....

వాళ్ళమ్మ చెప్పినట్టుగానే సాయంత్రం నాలుగు వరకే ఇళ్లు చేరుకున్నాడు...

అమూల్యతో ఏకాంతంగా గడపాలి అనే అతని ఎన్నో రోజుల కల ఈరోజు నెరవేరబోతోంది సురేష్ ఆనందం మాటల్లో చెప్పలేనిది....

కాఫీ తాగాక కొన్ని పండ్లు ఒక వాటర్ బాటిల్ తీసుకొని దేవితో ప్రవచనాలకు బయలుదేరింది పార్వతమ్మ....

అత్తగారిని సాగనంపటానికి గేట్ వరకు వచ్చిన అమూల్యతో....

ఇదిగో పిల్ల మేము గంటలో వచ్చేస్తాము....

ఈ లోపు మా వాడు ఏదైనా వెర్రి వేషాలు వేసిన....

నువ్వు మాత్రం నీ హద్దుల్లోనే ఉండు తెలుసుగా ఇంకా ముహూర్తానికి మూడు రోజులు ఉంది...

ఏదో పెళ్లయిన కొత్త జంట ఏకాంతం కోరుకుంటుంది కదా అని నీ మీద నమ్మకంతో ఒంటరిగా వదిలి వెళ్తున్నాను....

అంటూ అమూల్యను లాక్ చేసేస్తూ జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది...

వాళ్లు వెళ్లగానే గేట్ వేసి వచ్చి డోర్ లాక్ చేస్తున్న అమూల్యను అమాంతం వెనకనుండి గట్టిగా హత్తుకున్నాడు సురేశ్....

అబ్బ వదలండి మీరు ఇలాంటి పనులు చేస్తారనే అత్తయ్య గారు మరీ మరీ మీకు దూరంగా ఉండమని చెప్పి వెళ్లారు....

ఒకే ఇంట్లో ఏకాంతంగా ఉండి ఎవరైనా దూరంగా ఉంటారా....

అయినా దూరంగా ఉండటానికి మనల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది...

అమ్మకి మాత్రం తెలియదా ఏంటి కొత్తగా పెళ్లైన జంట ఏకాంతం కోరుకుంటోందని...

పట్టుకుంది నా భార్యని వేరే ఎవర్నో కాదు...

ఏ నీ మీద నాకు ఇప్పటికీ ఆ మాత్రం హక్కు రాలేదా....

మెల్లిగా వెనుక నుండి ముందు వైపుకు తిరిగి...

అలాగే సురేష్ ని పట్టుకుని చెప్పటం మొదలు పెట్టింది...

మహాసేన హక్కులేదని ఎవరూ అనలేదు....

లీగల్ గా మీకు హక్కు ఉన్న...

దాన్ని అప్రూవ్ చేయడానికి ఇంకా త్రీ డేస్ ఉంది అని గుర్తు చేస్తున్నాను...

అయినా ఒంటరిగా ఉంటే ఎప్పుడు అవే ఆలోచనలా...

మీరు పెళ్లి చూపులకు వచ్చిన దగ్గరనుండి ఎదురుచూస్తున్నాను మీతో మనసు విప్పి మాట్లాడాలని.....

అబ్బా మాట్లాడుకుందాంలే అమ్మూ ముందుగా ఒక ముద్దు ఇవ్వవా ప్లీజ్... ప్లీజ్....

అదేం కుదరదు నేను అత్తయ్య గారికి మాటిచ్చాను...

ఆవిడ నమ్మకం పోయే పనులేవీ నేను చేయను...

ముద్దుకు కూడా ముహూర్తాలు ఏంటే తింగరి పెళ్ళామా...

అయినా నువ్వు ఇచ్చేది ఏంటి నేనే తీసుకుంటాను...

నిన్ను బ్రతిమాలుతూ ఉంటే బెట్టు చేస్తున్నావ్....

అని మీద మీదకు వస్తున్న సురేష్ ని తప్పించుకుంటూ సోఫా చుట్టూ తిరుగుతుంది అమూల్య...

అమూల్యను పట్టుకోడానికి తన వెనకాలే పరిగెడుతూ ఒక కార్నర్లో అమూల్యని లాక్ చేసి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వెళ్ళగానే....

సిగ్గుతో కళ్ళు మూసుకుని తన అంగీకారాన్ని తెలుపుతుంది అమూల్య....

కరెక్ట్ గా అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ రావటంతో అమూల్య సురేష్ చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది....

అబ్బా ఎవరో బెల్ కొట్టి వాళ్ళే వెళ్ళిపోతారులే....

మనం స్టార్ట్ చేసిన పని ఇలా సగంలో ఆపేయొద్దు అమూల్య

అయ్యో వదలండి వచ్చింది అత్తయ్యగారు అయితే అసలు బాగోదు...

గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు

హాయ్ సిస్టర్ సురేష్ ఉన్నాడా...

అంటూ ఉండగానే సురేష్ బయటకి వచ్చాడు

సోరీ రా బావ పెళ్లి టైంకి నేను ఇండియాలో లేను అందుకే పెళ్లికి రాలేకపోయాను...

ఒక్కసారి నిన్ను సిస్టర్ ని కలిసి విష్ చేసి వెళ్దామని ఇలా వచ్చాను....

సురేష్ ఇంక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతన్ని తోసుకుంటూ లోపలి వచ్చేసాడు సురేష్ ఫ్రెండ్

అమూల్య వాళ్ళకి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్లగానే....

ఒరేయ్ ఎలాగో పెళ్లికి రాలేదు కనీసం ఈ రోజు రాకుండా రేపైనా వచ్చి చస్తే బాగుండేది కదరా...

సురేష్ అతని మెడ పట్టుకొని తిడుతూ ఉండగా అమూల్య కాఫీతో వచ్చింది....

అక్కడ సీన్ ఎక్స్పెక్ట్ చేసిన అమూల్యకు సురేష్ ని చూస్తుంటే అసలు నవ్వు ఆగటంలేదు....

కాఫీ తాగావుగా ఇంకా వెళ్ళు...

అంటూ బలవంతంగా వాళ్ళ ఫ్రెండ్ ని బయటకు తోసేసాడు సురేష్

కిచెన్ లో కాఫీ కప్పులు సర్దుతున్న అమూల్య దగ్గరికి వచ్చి....

అమూల్య మన పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఎప్పుడు నాకు ఫోన్ అయినా చేయాలి అనిపించలేదా....

చాలా దిగులుగా అడుగుతున్న సురేష్ ని చూసి

ఒక్కసారి కాదు అండి మీరు పెళ్లి చూపులకు వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు అనుకున్నాను....

కానీ మీ నెంబర్ నా దగ్గర లేదు....

కనీసం మీరైనా కాల్ చేస్తారేమో అని వెయిట్ చేశాను అదీ లేదు....

అవును ఇంత సడన్గా మీకు ఫోన్ చేయలేదు అని ఎందుకు గుర్తొచ్చింది...

అలా వాళ్లిద్దరూ చాలాసేపు మనసారా మాట్లాడుకుంటుండగా మళ్లీ కాలింగ్ బెల్ సౌండ్ వినబడగానే అమూల్య మొబైల్ నుండి తన మొబైల్ కి రింగ్ చేసి అమూల్య మొబైల్లో కూడా నంబర్ సేవ్ చేసాడు....

ఇక ఆరోజు నుండి మొదలయ్యింది వాళ్ళిద్దరు చాటింగ్....

ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నాకూడా మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను చాటింగ్లో పంచుకునేవారు...

నిజం చెప్పాలి అంటే పెళ్లి అయిన దగ్గర నుండి ఒక లెక్క....

ఈ రెండు రోజులు చాటింగ్ ఒక లెక్క అన్నట్టుగా ఉంది...

పార్వతమ్మ ముందర భోజనం వడ్డించి పక్కన సైలెంట్ గా నిలబడ్డ అమూల్యకు దాని రుచిని వర్ణిస్తూ మెసేజ్ పెట్టేవాడు సురేష్...

అతను ఎలా డ్రెస్ అవ్వాలో డ్రెస్ కలర్స్ అన్ని అమూల్య సురేష్ కి మెసేజ్ పెట్టేది...

సురేష్ రాబోయే రెండు రోజులను ప్రతీ గడియా అతని హృదయ స్పందనతో లెక్కిస్తూ ఉన్నాడు...

సురేష్ ఎంతో ఆత్రంగా ఎదురు చూసే ఆ రోజు రానే వచ్చింది....

ఆఫీస్ లో వన్ వీక్ లీవ్ అప్లై చేసి చాలా సంతోషంగా ఇంటికి బయల్దేరాడు ...

కానీ

సురేష్ ఇంటికి వచ్చి చూడగానే అతను ఊహించనటువంటి పరిస్థితి ఎదురయింది అతనికి.....

అమూల్యకు అమ్మవారు పోసింది...

సురేష్ ఆఫీసు నుంచి రాగానే నేలపై వేపాకుల మీద పడుకున్న అమూల్యని చూస్తూ....

మెల్లిగా అమూల్య దగ్గరికి రాబోయాడు...

ఒరే నాన్న వెళ్లి కాళ్ళు కడుక్కుని రా అలాగే అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు....అని పార్వతమ్మ చెప్పటంతో

సురేష్ కాళ్లు కడుక్కొని వచ్చి అమూల్యకు ఒక పక్కగా కూర్చుని ఆమె నుదుటి మీద చేయి వేయగానే...

భగ భగ మండే నిప్పుల కుంపటిలా ఉంది ఆమె శరీరమంతా....

సోరీ అండి మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసాను...

అని అమూల్య ఒక్కో మాట కూడాదీసుకుని పలుకుతుంది....

ఛా...ఛా...

అవేం మాటలు అమ్ము

నేను నీ నుండి కేవలం సుఖం మాత్రమే కోరుకోవటం లేదు....

ప్రేమించాను అమ్ము నిన్ను 2 సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించాను...

కానీ నువ్వు ఎంత సెన్సిటివో అర్థమయ్యాక నీకు నా ప్రేమ విషయం చెప్పకుండా డైరెక్ట్ గా మా అమ్మను మీ ఇంటికి పెళ్లి సంబంధానికి పంపాను...

నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీ నాన్నకి కూడా తెలుసు....

ఆయన నా ప్రేమకు విలువ ఇచ్చి నీతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా మన పెళ్లి నిశ్చయం చేశారు...

నా ప్రేమ సామ్రాజ్యాన్ని నీకు మన ఫస్ట్ నైట్ రోజు చూయించాలి అనుకున్నాను....

నాకు కేవలం నీ శరీరంతో మాత్రమే పనిలేదు అమ్మూ....

నీ మనసులో స్థానం ఇస్తే చాలు...

జీవితాంతం నిన్ను ఇలా చూస్తూ బ్రతికేస్తాను....

కాపురం చేయడం అంటే ఒకరికొకరు శరీరాలు పంచుకోవటం మాత్రమే కాదు....

ఒకరికొకరు కడదాకా ప్రేమను పంచుకోవడం....

సురేష్ తన లీవ్ వన్ మంత్ కు ఎక్స్టెండ్ చేసి అమూల్యను పగలు,రాత్రి కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు....

అందరూ రొమాన్స్ అనగానే చిలిపి చేష్టలు చిలిపి మాటలు అనుకుంటారు ....

కానీ మాటల్లో చెప్పలేని, చేతల్లో చూపలేని ఎన్నో భావాలను కొంటె చూపులతో పంచుకోవచ్చు తెలుసా అమ్మూ...

నీ కళ్ళలోకి చూస్తూ జీవితం గడిపేస్తానురా...



Rate this content
Log in

Similar telugu story from Romance