ఉదయబాబు కొత్తపల్లి

Romance

4  

ఉదయబాబు కొత్తపల్లి

Romance

నేను పతివ్రతను కాను.(కధ)

నేను పతివ్రతను కాను.(కధ)

5 mins
677


అందంగా అలంకరింప బడిన ఆ గదిలో పందిరి మంచం చుట్టూ పందిరిమల్లెమొగ్గల మాలలు దోమతెర మాదిరిగా దట్టం గా కట్టబడి గదిలోకి ప్రవేశించే మాష్టారికోసం ఎదురు చూసే అల్లరిపిల్లల్లా గాలికి అటూ ఇటూ ఊగుతూ ఊసులాడుకుంటున్నాయి. పక్కనే టీపాయ్ మీద ఒక పళ్లెం నిండా తాజా ఫలాలు, మరొక పళ్ళెంలో తేనెలొలుకుతున్నట్లున్న రకరకాల స్వీట్లు మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్ పోటీలకు ఒకే స్టేజి మీద 'ప్రదర్శన'కు నిలబడిన యువతీయువకుల్లా ఉన్నాయి.

'పెళ్లిసందడి'అగరబత్తీ ల సువాసన గదంతా వ్యాపించగా, తాంబూల సేవనం కోసం అన్నట్టుగా యాలకులు,లవంగ, దాల్చినచెక్క, కవిరి,తములపాకులు,సున్నం,వక్కపొడి,జాజికాయ,జాపత్రి, కుంకుమపువ్వు మొదలైన సుగంధ ద్రవ్యాలన్నీ ఒక 'మహా'కార్యానికి సంధానకర్తలుగా మరో పళ్ళెంలో నిరీక్షిస్తున్నాయి.

అద్భుతం అనిపించే రీతిలో అమర్చబడిన ' లవ్ సింబల్ 'లోని పూలతోపాటు, ఆ పాతకాలపు పండిరిమంచంపై కొత్తపరుపు తనపై కలగబోయే ఒత్తిళ్లను ఎలా తట్టుకోవాలా అన్న ఆత్రుతతో రెండు దిళ్ళనూ కళ్లుగా చేసుకుని చూస్తున్నట్టుంది.

తలుపు కిర్రుమని శబ్దం చేసేసరికి అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న వస్తువులన్నీ లోపలకి రాబోయే అడుగుల సవ్వడికోసం గుమ్మంవైపే ఉత్సాహంగా చూస్తున్నంతలోనే ఆ గదిలోకి అడుగు పెట్టాడు నూతన వరుడు 'ప్రణీత్'.వెనుకనే అతని బట్టలకంటిన ఖరీదైన మైల్డ్ సెంటెడ్ స్మెల్ మంద్రంగా తిరుగుతున్న ఫ్యాన్ గాలికి గదంతా వ్యాపిస్తూ అక్కడి వాతావరణానికి ఒక విధమైన 'మత్తు'ను కలుగ చేస్తోంది.

అతడు తలుపులు దగ్గరగా వేసి ఫ్యాన్ వేగం పెంచాడు.మొదటిరాత్రి మనసు పెడుతున్న కలవరం అతని నుదుట, అరచేతులలోనూ,మెడ దగ్గర సన్నటి చిరుచెమట గా మారి ఉండటం వల్ల కాబోలు ఫ్యాన్ గాలి రివ్వున తగలడంతో శరీరం ఒక్కసారిగా చల్లబడినట్టు ప్రకంపించి ఒక్కక్షణం ఉక్కిరిబిక్కిరి అయ్యాడతను.

మేకప్ అవసరం లేని ఎవర్ గ్రీన్ హీరోలా ఉన్న అతను తన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ విద్యార్హత ను పక్కనబెట్టి,మనసులో మొదటిసారి కంప్యూటర్ ముందు కూర్చున్నవాడిలా ఉద్వేగంతో ఉన్నాడు.మెదడు లోని బేసిక్ ఫండమెంటల్స్ ను మనసులోకి రివైండ్ చేసుకుంటున్నాడు.


'శోభనం రాత్రి'అనే ఫైల్ ని ఓపెన్ చేయడానికి ఏ సింటెక్స్ ఉపయోగించాలో, అందుకోసం ఏ బటన్ ఎక్కడ ప్రెస్ చేస్తే ఏ విధమైన ఔట్ ఫుట్ వస్తుందో అని కళ్లముందున్న అదృశ్య స్క్రీన్ మీద రకరకాల దృశ్యాలు ఊహించుకుంటున్న అతని ఆలోచనలకు అంతరాయం కలుగచేస్తూ 'శకుంతల'లోపలికి అడుగు పెట్టింది.

అడవి పనస తొనలా, దబ్బపండు వర్ణంతో,మిసమిసలాడిపోతూ అచ్చమైన 'ముని'కన్య 'శకుంతల' లా నిండైన ఆమె విగ్రహం చూస్తూనే అతని నిగ్రహం పటాపంచలైపోయింది.

ఆడది అంత అందంగా, సుకుమారంగా, సౌమ్యంగా నడవగలదు అని అతడు ఆ క్షణమే చూస్తున్నాడు.పూవులు నలిగిపోతాయేమో అన్నట్టుగా , అరవిరిసిన మల్లెలు మళ్ళీ ముడుచుకుపోతాఎమో అన్నంత సుతిమెత్తగా నడచి వచ్చి అతనికి రెండడుగుల దూరంలో నిలబడిన ఆమె అచ్చంగా " శకుంతల " వేషంలో ఉంది.

అందమైన మొదటి రాత్రి ఇదేమి వింత వేషం? ఇదేమైనా నాటకమా? లేక పెద్దలు కావాలని చేసి పంపిన అలంకారమా? గదిలోకి రాబోయే ముందు గర్భాదాన పూజ దంపతులుగా తామిద్దరం పూజ చేసినప్పుడు కాటన్ చీరలో పుత్తడి బొమ్మలా తన పక్కన కూర్చుని స్పర్స చేతనే తనని రోమాంచితం చేసింది ఈమేనా? అతని మనసును ఆలోచనలు హోరెత్తిస్తుండగా ఆమె తలుపు గడియ వేసింది.అనాచ్చాదితమైన కుడి భుజం జబ్బ మీద పావలాకాసంత రెండు టీకా మచ్చలు తెనేరంగులో స్పష్టం గా కనిపిస్తున్నాయి.

కోరిక మనసును తేనేటీగలా గుచ్చుతుంటే ఆటను ఆమెను సమీపించాడు. ఆమె చేతిలోని వెండి పాలగ్లాసును అందుకుని టీపాయ్ మీద పెట్ట్టాడు.

ఆమె తన చేతి వేళ్ళు అతనికి తగలకుండా జాగ్రత్త పడింది. ఆమె కట్టుకున్న నార చీర కొంగు పట్టుకుని ఆమెను తనపైకి లాక్కుందామనుకున్న అతని ఆశ అడియాస అయింది.

ఆమె రెండుచేతులూ జోడించి రెండడుగులు వెనక్కు వేసి తలెత్తింది.తెల్లని కలువ రేకుల్లాంటి ఆమె నయనాలు నిండా నీరున్న కన్నీటి కొలనుల్లా ఉన్నాయి.అతను హతాశుడయ్యాడు.

" వద్దండీ...మీరు నన్ను తాకవద్దు."


" ఏం? ఎందుకని?సిగా...?" అతను చిలిపిగా ప్రశ్నించి మరో రెండు అడుగులు ఆమె వైపు వేసాడు.

"కాదండీ...నేను...నేను..."ఆమె భీత హరిణిలా రెప్పలు అల్లల్లార్చింది.

"ఊ...నువ్వు?" కొంటేదనంతో అతని కళ్ళు మెరుస్తున్నాయి.

"మీకు...మీకు...ఎలా చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు.నేను...నేను...పతివ్రతను కాను."

అతను సర్పద్రష్ట లా ఆగిపోయాడు.

"శకుంతలా" అగాధం లోంచి వచ్చినట్టు కీచుగా ఉంది అతని స్వరం.

"మీరు నన్ను మనస్పూర్తిగా క్షమించండి " ఆమె వెనక్కి నడిచి గోడకు అతుక్కుపోయింది.

"ఇంకేం క్షమించండి? నీ వేషంతోనే నాకు సగం మతిపోయింది.మిగిలిన సగం నీ మాతలాతో పోయింది.నాకేమీ అర్ధం కావడం లేదు. ఇదే ఇంకో మగాడైతే లాగి ఒక్కటిచ్చి బయటకుపోయేవాడు." అన్నాడు ప్రనీత్ అయోమయంగా.

ఆమె ప్రాదేయపడుతున్నట్టుగా అంది.

"నిజమేననుకోండి.ఇలాంటి మాట విన్నాక పౌరుషం ఉన్న ఏ మగాడైనా అదే పని చేస్తాడు. కాని చదువు నేర్పిన సంస్కారంతో మీరు మాత్రం అసలు కారణం అడిగి తెలుసుకుంటారని నా నమ్మకం. అందుకే మీరలా మంచం మెడ కూర్చోండి.మీకు నేనొక కధ చెబుతాను.అది విని కూడా మీరు నన్ను ఏలుకుంటానంటే నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచం లోనే ఉండదు.సరేనా? " కళ్ళు తుడుచుకుని ఆమె అన్న మాటలకు అతడు లేని ఓపిక తెచ్చుకుని మంచం మీద కూర్చున్నాడు.

ఆమె మళ్ళీ వచ్చి అతనికి దగ్గరగా నిలబడింది.

"పూర్వం జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి రోజూ వేకువఝామునే నదీతీరానికి వెళ్లి భర్త నామాన్ని జపిస్తూ మనసులో భర్తకు మనస్పూర్తిగా నమస్కరించుకుని అక్కడి ఇసుకతో ఒక బిందెను చేసి దానితో బారత చేసే నిత్య పూజకోసం అభిషేకజలం తెచ్చేదట"

ప్రణీత్ వెర్రిమొహం వేసుకుని వినసాగాడు.

"ఆమె ఇసుకతో బిందెను ఎలా చేయగలిగిందంటారు?" ఆమె ప్రశ్న అతనికి చిరాకుతోపాటు విసుగును కూడా కలిగించింది.

"ఆమె పతివ్రతాశిరోమణి కాబట్టి" కసిగా అన్నాడతను.

" అందుకనే నేను పతివ్రతను కానూ అన్నది" అంది ఆమె బుంగమూతి పెట్టి.

"నువ్ చెప్పే కధకీ, ఈ విషయానికి ఏం సంబంధం ఉందొ నాకు అర్ధం కాలేదు శకుంతలా..." జాలిగా అన్నాడతను.

"పూర్తిగా వినండి మరి...ఒక వేకువ ఝామున నదీతీరానికి అభిషేకజలం తీసుకురావడానికి వెళ్ళిన రేణుకాదేవికి ఆకాశ గమనం చేస్తున్న శివపార్వతులు కనిపించారట. అపురూపమైన ఆ జంటను చూసి 'ఎంత అద్భుతమైన జంట' అనుకుందట రేణుకాదేవి. ఆ ఒక్క క్షణం వివశురాలైనందువలన ఆమె పాతివ్రత్యం నశించి ఆ తర్వాత ఎంత తయారు చేద్దామన్నా ఆమె ఇసుకతో బిందెను చేయ లేకపోయిందట.

పూజా సమయం మించిపోయిన తరుణంలో దివ్యదృష్టి తో ఆమె అవస్థను గమనించిన జమదగ్ని మహర్షి తన పుత్రుడు పరశురాముని పిలిచి తల్లిని తోడ్కొని రమ్మన్నాడట.ఆమే వచ్చాకా పరపురుషుని మెచ్చుకున్నందుకు శిక్షగా ఆమెకు శిరచ్చేదం చేయమని కొడుకుని ఆజ్ఞాపించాడట.

"ఆతరువాత?"

"తండ్రి ఆజ్ఞను శిరసావహించి తండ్రికి నమస్కరించి పరసురాముడు తన తల్లి తలను గండ్రగొడ్డలితో నరికాడట.తన ఆజ్ఞను అక్షరాలా పాటించిన పుత్రుని పితృభక్తికి మెచ్చి, జమదగ్ని ఏదైనా వరం కోరుకోమన్నాడట.

అతడు వెంటనే తనతల్లిని తిరిగి పునరుజ్జీవింప జేయాలని కోరాడట.ఒకసారి శిరచ్చేదమై తిరిగి పునర్జన్మ పొందిన ఆమె దోషరహిత యై పతివ్రతాశిరోమణి అయిందట.ఈ కధనుంచి మీరు గ్రహించిది ఏమిటి?"

"భర్తనే ప్రత్యక్ష దైవంగా భావించే ఏ స్త్రీ అయినా పతివ్రతా శిరోమణిగా పూజింపబడుతుంది.పరపురుషుని పోరాపాతునైనా కన్నెత్తి చూస్తె ఆమె పాతివ్రత్యం నశిస్తుంది అని. ఇంతకూ ఈ కధలో బలాత్కారాలు, తను కామించిన స్త్రీ కోసం మారువేషంతో పచ్చిమోసం చేసిన మాయా ప్రవరుని వృత్తాంతం లాంటివి ఏమీ లేవే?" అనుమానంగా అడిగాడు ప్రణీత్.

"అందుకే నా బాధంతా..."

" అర్ధం కాలేదు శకుంతలా..."

"అవునండీ. నా భర్త హీరో సుమన్ అంట హైట్, సల్మాన్ ఖాన్ లాంటి బాడీ, అర్జున్ లాంటి చురుకుదనం, నవీన్లాంటి సిన్సియారిటీ, మహేష్ బాబులాంటి అప్పియరెన్స్...ఇలా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుని వాళ్ళందరూ కలబోసినా వ్యక్తిలా నా భర్త ఉండాలని నేను కన్నె గౌరీవ్రతం చేసి మరీ కోరుకున్నాను.ఒక్కక్షణం భర్తమీదనుంచి ఏకాగ్రతను మరల్చిన రేణుకాదేవే పాతివ్రత్యం కోల్పోతే, నేను పతివ్రతను ఎలా అవుతాను చెప్పండి.?"బేర్ మంది శకుంతల.

"నీమొహం.మనిషిని కేవలం తలుచుకుంటేనే పతివ్రతా కాకుండా పోతారా ఎవరైనా? పెళ్ళికి ముందు నేను బోలెడుమంది అమ్మాయిల్ని చూసాను.నా శీలం పోయినట్టేనా? అయినా ఈ విషయాలన్నీ ఎక్కడ ఔపోశన పట్టావ్?"

ఆమె ముక్కు చీదింది.

"చూడండి.నాకదంతా అనవసరం. నామీద ఒట్టేసి చెప్పండి మీకేంతమందితో సంబంధం ఉంది?"


"నిజం శకుంతలా...నీమీద ఒట్టు.నాకు ఇప్పటివరకు ఆ'అనుభవం' లేదు."అతను తనకుడి చేతిని ఆమె తలమీద పెట్టబోయాడు.

""ఆగండి.ఆ'అనుభవం' అంటే ఏమిటి మీ ఉద్దేశం? అంటే...అంటే...మీరు నా దగ్గర అబద్దాలాడుతున్నారు. అసలు మీకేం తెలియకపోతే ఆ 'అనుభవం' అన్న పదం ఎందుకు వాడారో చెప్పండి?"

"ఖర్మరా దేవుడా...మరింకేమని చెప్పాలి?మొదటిరాత్రి ఏ భార్యాభార్తలైనా మనలా మాట్లాడుకుంటారా ఎక్కడైనా?"

"చూసారా..నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎలా మాట దాట వేస్తున్నారో?నేను అన్యాయం అయిపోయానురా దేవుడో? నేనే పతివ్రతను కాదు మొర్రో అంటుంటే శీలం కోల్పోయిన మొగుడిని కూడా అంట గట్టావా దేవుడో?"

ఇంక నిగ్రహం కోల్పోయినవాడిలా అరిచి ' యీ..' అంటూ జుట్టు పీక్కున్నాడు ప్రణీత్.

పరిస్తితి విషమిస్తోంది అని గ్రహించిన శకుంతల ఒక్కసారిగా అతన్ని గాధంగా పెనవేసుకుపోయింది.

ఆమె వెచ్చని స్పర్శతో అతని స్విచెస్ ఆనయ్యాయి.అయినా తెల్లబోతూ అడిగాడు ...తనలో రాజుకుంటున్న మత్తును అనుభవిస్తూనే...

"మళ్ళీ ఇదేమిటీ?"

ఆమె గోముగా అంది.

"ఏం లేదండి.మీరెంత నిఖార్సయిన మగదో తెలుసుకోమని , గదిలోకి రాబోతుంటే బామ్మ ఈ కదా చెప్పింది.నాకు ఇప్పుడు పరిపూర్ణమైన శీలవంతుడు భర్తగా దొరికాడన్న నమ్మకం కలిగింది. మీకోసం దాచుకున్న ఈ పద్దెనిమిదేళ్ళ పరువాలను మీ చేతుల్లో పెడుతున్నాను.ఇక మీ ఇష్టం." అతని చేతుల్లో ఆమె మల్లెచెండులా ఒదిగిపోయింది.

అతడామెను మెల్లగా మంచం దగ్గరగా తీసుకువచ్చి కూర్చోబెట్టి రెండు భుజాలపై చేతులు వేసాడు.

"నా కారెక్టర్ మీద నీకు అంత నమ్మకం లేనప్పుడు పెళ్లిచూపుల్లో మనం సింగిల్ గా మాట్లాడుకున్నప్పుడే అడగవచ్చుగా..."

అతడామే ముక్కుకు తన ముక్కును, ఆమెనుదుటికి తన నుదుటిని ఆనించి అడిగాడు.

"చాల్లెండి.పెళ్ళికి ముందు ఎంత ఇంటర్వ్యు అయితే మాత్రం మీకు ఆ 'అనుభవాలే'మైనా ఉన్నాయా అని

ఏ పెళ్ళికూతురు , పెళ్ళికొడుకుని అడుగుతుంది చెప్పండి?" విల్లంబుల్లాంటి కనుబొమలు చిత్రంగా ఎగరేసి చెప్పిన ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు ప్రణీత్

"ఇంతసేపు నన్ను వెర్రి వెధవను చేసి ఆడించి నందుకు ఇంకా ఏం అడిగినా చెప్పడం ఉండదు.అంటా చేసి చూపించడమే..."

"ఛీ పాడు...చూపించడ మేమిటి?

"అదేనోయ్..అనుభవం రుచి చూపించడం.అయినా ప్రతీ మనవరాలికీ తల్లికంటె మంచి 'గైడ్' గా బామ్మలుంటారు...ఎందుకంటావ్?"

"మీరు ఇలాంటి చవట ప్రశ్నలు వేసి సమయం వృధా చేస్తారని వాళ్లకి ముందే తెలుసు కాబోలు.అలా వృధా చెయ్యకుండా తమ అనుభవాలన్నీ కలబోసి 'టెక్నిక్స్' నేర్పెతందుకే ఈ బామ్మలు గైడ్స్ గా ఉండేది. అర్ధం అయిందా?" అతని నెత్తిమీద చిన్నగా మొట్టింది ఆమె.

ఆటను మాట్లాడలేదు.ఆమెను వివశురాలిని చేసే ప్రయత్నం మొదలెట్టాడు. అతని మైక్రోప్రాసెసర్, అతను ఇస్తున్న ఇన్ పుట్ సంకేతాలు అందుకుంటూనే మస్తిష్కపు స్క్రీన్ మీద అవుట్ పుటని అందించ సాగింది. తన మనసు ప్రింటర్ పై వరుసగా వస్తున్న చిత్రాలను ముద్రించుకునే ప్రయత్నంలో మునిగిపోయాడు ప్రణీత్!!Rate this content
Log in

Similar telugu story from Romance