శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

ముందుచూపు

ముందుచూపు

5 mins
214


 

            

 

   నాకు ‘జీఆర్‌యీ, టోఫెల్‌’లో మంచి స్కోరు రావడంతో యూఎస్‌లో నేను అప్లయ్‌ చేసిన రెండుమూడు టాప్‌ యూనివర్సిటీల నుంచీ ఆఫర్‌ లెటర్స్‌ వచ్చాయి. ఎంఎస్‌ చేయాలని మనసు పీకుతున్నా, నా కాళ్ళకు బంధాలు అడ్డొస్తున్నాయి. అమెరికా ప్రయాణానికి అవకాశం చేతికి రాగానే నా మనసెందుకో గందరగోళంగా తయారైంది. బుర్ర వేడెక్కిపోతోంది. అప్పటికే యూఎస్‌లో ఎంఎస్‌ చేస్తున్న తమ్ముడితో చెప్పాను- నేను కూడా ఎంఎస్‌ చేయడానికి వస్తున్నానని. అలా చెప్పినప్పుడు వాడు నాకు కంగ్రాట్స్‌ చెప్పడం కాదు కదా... కనీసం సంతోషించనూ లేదు. ఇప్పుడు నాకొచ్చిన ఇంట్రస్ట్‌ మూడేళ్ళక్రితం వచ్చివుంటే బావుండేదన్నాడు. వాడు చెప్పింది నిజమే అయినా, వాడి మాట నన్ను రావద్దన్నట్లుగా ఉంది. నా మనసులో ముల్లు గుచ్చుకున్నట్లు అయింది. నిజానికి నేను అమెరికా వెళ్ళాలనుకున్నది డబ్బు సంపాదనకే కాదు- అక్కడ తమ్ముణ్ణి అప్పుడప్పుడూ కలుసుకుంటూవుంటే... మా అన్నదమ్ముల బంధం బలపడుతుందనీ చిన్నప్పటిలాగే కలిసుంటామని. వాడు నన్నక్కడకు రమ్మని స్వాగతం పలికి ఉంటే... ఎగిరిపోవడానికి సిద్ధమయ్యేవాడినేమో..! నేను రావడం తమ్ముడికి ఇష్టంలేదని నాలో నేనే రెండురోజులు కుమిలిపోయాను. ఇంకోవైపు అమ్మానాన్నలు గుర్తుకొస్తున్నారు. మూడు నాలుగేళ్ళలో నాన్న ఉద్యోగం నుంచి రిటైర్‌ అవబోతున్నారు. అంటే అమ్మకూ నాన్నకూ పెద్ద వయసు వచ్చేసినట్టే. ఆ వయసులో వారినొదిలి అమెరికాలో ప్రశాంతంగా ఉండగలనా..? కష్టమొస్తే వారిని ఆదుకునేదెవరు? అక్కడ చదువైపోయిన వెంటనే తిరిగి రావడానికి కుదరదు. ఆ చదువు కోసం చేసిన బ్యాంకు లోను తీర్చాలి. ఆపై కొన్నాళ్ళు సంపాదించుకోవాలి. తిరిగి రావాలంటే... కనీసం అయిదారేళ్ళయినా పడుతుంది. ఈ అయిదారేళ్ళలో నాకు పెళ్ళవకుండా ఉంటుందా, పిల్లల్ని కనకుండా ఉండగలనా? నా భార్యా పిల్లలు అక్కడి వాతావరణానికి అలవాటుపడిపోయి ఇండియా రానంటారేమో. పోనీ, అమ్మానాన్నలను అక్కడికే తీసుకుపోదామంటే - వూహూ... వీళ్ళు కచ్చితంగా ఇల్లు కదిలిరారు. వయసు మీరిన తల్లిదండ్రులిక్కడా మేము అక్కడా ఉంటే... నా మనసు కుదురుగా ఉంటుందా? మా పిల్లల ముద్దూ మురిపాలకు అమ్మా నాన్నా దూరం అయిపోరూ! అందరిలాగా వారికీ మనవళ్లతో ఆడుకోవాలనీ జోల పాడాలనీ సరదా ఉంటుంది కదా. ఎవరికైనా తమ పిల్లల మీదకంటే పిల్లల పిల్లల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. నానమ్మ- నన్నూ తమ్ముణ్ణీ ఎంత ముద్దు చేసేది? ఇప్పటికీ నానమ్మకి నేనంటే ముద్దే. నాకు పెళ్ళి చేసేస్తే, నాకు పుట్టబోయే మునిమనుమడి నోట్లో బంగారు ఉగ్గు గిన్నెతో పాలు పోయాలని కోరిగ్గా ఉందట. చిన్నాన్నలిద్దరూ అమెరికాలో సెటిలైపోవడంతో... మాతో గడిపినట్టుగా వారి పిల్లలతో ఏనాడూ గడపలేదు. వారికి తెలుగు రాకా, నానమ్మకి ఇంగ్లీషు రాక... వెళ్ళిన రెండు నెలలకే తిరిగి వచ్చేసేది అక్కడ ఉండలేక. ఇక్కడ పెద్దకొడుకుగా నాన్నా, పెద్ద కోడలుగా అమ్మా ఉండబట్టే నానమ్మ కాళ్ళు చచ్చుబడిపోయినా ఆమెకు మూడవ కాలుగా నిలబడ్డారిద్దరూ. ఇలాంటి కుటుంబంలో పెరిగినవాడిని కాబట్టే... అనుబంధాలను వదులుకోలేక, ముందుచూపుగా నాలో ఇన్ని ఆలోచనలు భయపెడుతున్నాయి. అందుకే, నాకొచ్చిన స్టడీ ఆఫర్‌ లెటర్స్‌ని పక్కకు పెట్టి, నేను పనిచేసే ఆఫీసులో రేపు ఇద్దామనుకుంటున్న రిజిగ్నేషన్‌ లెటర్‌ని చింపి పారేశాను. 

    

   ఆ మర్నాడు- అమ్మ దగ్గర నుంచి ఫోన్‌... ‘‘ఆఫర్‌ లెటర్స్‌ వచ్చాయన్నావు. ఐట్వంటీ రాగానే వీసాకి అప్లయి చేస్తానన్నావుగా. ఇంతకీ ఏ యూనివర్సిటీలో జాయినవ్వాలనుకుంటున్నావు? ప్రయాణం ఎప్పుడు ఉంటుంది?’’ అమ్మ అలా అడుగుతుంటే ‘నన్నెప్పుడు అమెరికాకు తోలేద్దామా’ అని ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. 

    

   నాకెందుకు వీళ్ళమీద ఇంత ప్రేమ? ఇది ఎక్కువైతేనే మనసు నలుగులాటకు గురయ్యేది అనిపించింది. ఎందుకో ఒక్కసారిగా అమ్మమీద అరిచాను. ‘‘అక్కడ తమ్ముడు రావద్దంటాడు, ఇక్కడ మీరు పొమ్మంటారు. నేను కూడా మీ దగ్గర ఉండటం మీకిష్టం లేనట్టు ఉంది’’ మనసులోని బాధను వెళ్ళగక్కి ఫోన్‌ కట్‌ చేశాను. 

    

   మర్నాడు...కంప్యూటర్‌ ఆన్‌ చేసి జీమెయిల్‌ ఓపెన్‌ చేశాను. ఇన్‌బాక్స్‌లో అమ్మ పంపిన మెయిల్‌ కూడా ఉంది. తమ్ముడు అమెరికా వెళ్ళినప్పటి నుంచీ కొద్దోగొప్పో కంప్యూటర్‌ వాడకం వచ్చింది అమ్మకి. తెలుగు మాటల్నే ఇంగ్లిషులో టైప్‌ చేస్తూ, చాటింగ్‌ చేసి మాట్లాడేస్తూ ఉంటుంది వాడితో. ఇప్పుడు నాకొచ్చిన మెయిల్లో- కథ లాంటి పెద్ద ఉత్తరమే రాసేసింది. కాస్త ఇబ్బంది పడుతూనే చదవడం మొదలుపెట్టాను. 

   

    నానీ,

    ఎలా ఉన్నావురా... నామీద అలక తగ్గిందా? అత్త నాకన్ని విషయాలూ చెప్పింది. నీ గురించి ఎంతో గొప్పగా... నీ మనసులోని వేదనంతా అత్తతో చెప్పుకున్నావట. మాకోసం నువ్వింతగా ఆలోచిస్తున్నందుకు చాలా పొంగిపోయాం. నీలాంటి కొడుకును కన్నందుకు కన్నవాళ్ళుగా చాలా గర్వపడ్డాం. కానీ, ఎందుకురా మామీద నీకింత ప్రేమ..? నీ భవిష్యత్తు ప్రణాళిక వేసుకుని, మా గురించి ఆలోచిస్తూ, దాన్ని కాలదన్నుకోవడం నీకు న్యాయం అనిపించిందేమోగానీ మాకు చాలా బాధగా ఉంది. నువ్వు తీసుకున్న నిర్ణయం హర్షించతగ్గదే అయినా... వద్దురా ఈ త్యాగాలు, ఈతరానికి సరిపడేవి కావు. ఎవరిదారి వారు చూసుకోవాలి. నువ్వు పైచదువులకెళ్ళి, ఉన్నత స్థాయికి చేరుకుంటే మాకు మాత్రం ఆనందం కాదూ..? రూపాయికీ డాలర్‌కీ తేడా లేదూ? నీకిక్కడ వచ్చే ఏన్యువల్‌ ఇన్‌కమ్‌ - నీకక్కడ మంత్లీ ఇన్‌కమ్‌గా వస్తుంది. రూపాయలకే పరిమితమైపోవాలనుకుంటే ఇక్కడే ఉండిపో. డాలర్లు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో. ఇలా అన్నందుకు బాధపడ్డావు కదూ! నాకు తెలుసు... నీకు వాటన్నిటికంటే అనుబంధాలే ముఖ్యమని. మా గురించి ఆలోచించి మాత్రం, నువ్వు పొరపాటు నిర్ణయం తీసుకోకు. మేము నీ దగ్గరకు వచ్చి ఉంటామని మాత్రం ఆశపడకు. రేపొద్దుట నీ భార్యా పిల్లలతో స్వేచ్ఛగా గడపాలన్నా, మేము సంతోషంగా జీవించాలన్నా... ఎవరికివాళ్ళు ఉంటూ అప్పుడప్పుడూ కలుసుకోవడమే మంచిది. అలాంటి రోజున మా అత్తాకోడళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలూ రావు. నా మాట కాదని, మీ దగ్గరే మమ్మల్ని ఉంచుకుని ప్రేమగా చూసుకోవాలని ఒక కొడుకుగా నీకనిపించినా... నా కోడలికి ఇష్టంలేకపోవచ్చు. కోడలు అత్తలో - అమ్మనూ చూసుకోలేదు. అత్త కోడలిలో - కూతురినీ చూసుకోలేదు. బంధం అనేది రక్తంలో రావాలి, కలుపుకుంటే వచ్చేది కాదు. నీకు అర్థమవ్వాలంటే... నా జీవిత పుస్తకంలోని కొన్ని పేజీలు నీకు క్లుప్తంగా చెబుతాను...   నాన్నతో నా పెళ్ళయి పాతికేళ్ళు దాటిపోయినా... ఆనాటి నుంచీ ఈనాటి వరకూ నానమ్మతోనే మా జీవనం. ఆవిడతో ఇన్నేళ్ళు గడిపినా... మా అత్తాకోడళ్ళ మధ్య ప్రేమా ఆప్యాయతలూ అంతంత మాత్రమే. ఎక్కడో దూరంగా ఉన్న చిన్నకోడళ్ళంటే ప్రాణం పోసేవారు. నిజమే మరి, దూరంగా ఉన్న వారి మధ్య మనస్పర్ధలెలా వస్తాయి? దగ్గరగా ఉంటేనే మనసుల్లోని కల్మషం బయటపడేది. ఏది ఏమైనా ఇన్నేళ్ళూ అత్తగారితో కలిసి ఉంటున్నందుకు అంతా నన్ను గౌరవంగా చూస్తూ ఉంటారు. అది నా గొప్పతనం కాదు. మా పెద్దల నుంచి నాకొచ్చిన సంస్కారంతో- నాన్నకు నానమ్మ మీదున్న బాధ్యతకు భంగం రాకుండా... అతి కష్టంమీద పెద్ద కోడలిగా నా బాధ్యత నెరవేరుస్తున్నానంతే! ఇదే మార్గాన్ని... నీకొచ్చే భార్య కూడా అనుసరించాలనే స్వభావం కాదు నాది. అందుకే, మనం దూరంగా ఉంటూ అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉందాం. అప్పుడే మనమధ్య బంధాలు గట్టిపడతాయి. అత్తాకోడళ్ళ మధ్య నలిగిపోయే భర్తల్లో నువ్వూ ఒకడివి కాకూడదనే నా తాపత్రయం. కలిసి ఉండటానికి ఇదేనా అడ్డుగోడని నువ్వు అనుకోవచ్చు. రేప్రొద్దున్న మాకూ ఇలాంటి దుస్థితే ఎదురైతే... భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలతో బిజీగా ఉండే ఈ రోజుల్లో మమ్మల్నెలా పట్టించుకుంటారా అని..? ఆరోజు వచ్చేసరికి నానమ్మకి దొరికినట్టుగా - ఇంటికి వచ్చే ఆయా మనుషులు కూడా దొరకరనిపిస్తుంది.

     

    ఈమధ్య నానమ్మ కోసం ఒక ఓల్డేజ్‌ హోమ్‌ని చూశాం. అది ముసలాళ్ళకు కన్నతల్లిగా అనిపించింది. చల్లటి చెట్లమధ్య... అయిదు ఫ్లోర్ల బిల్డింగది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రిసెప్షన్‌ కౌంటర్ని దాటి పెద్ద హాలు. అందులో భోజనాల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్‌ టేబుల్స్‌ ఒక క్రమపద్ధతిలో వేసి ఉంచారు. ఫస్ట్‌ఫ్లోర్‌ ముసలి దంపతుల కోసమైతే, ఒంటరి ఆడవాళ్ళకూ ఒంటరి మగవాళ్ళకూ సెకండ్‌, థర్డ్‌ఫ్లోర్‌లు వేరువేరుగా కేటాయించారు.వారు ఉండే ప్రతీ రూమూ ఎటాచ్డ్‌ బాత్‌రూమ్‌, ఏసీ, టీవీలతో సౌకర్యంగా ఉన్నాయి. ఇక నాల్గవ ఫ్లోరులో నర్సింగ్‌హోమ్‌లో ఉన్నట్టుగా ఎవరికి ఏ అత్యవసరం వచ్చినా, పేషెంట్‌ బెడ్స్‌ కూడా రెడీగా ఉన్నాయి. ప్రతిరోజూ డాక్టర్స్‌ వస్తారు. బీపీ, షుగర్‌ చెకప్‌ చేస్తూ మందులివ్వడానికి నర్సులు తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఫ్లోర్‌లోనూ కొంతమంది ఆయాలు పిలిస్తే పలికేలా తచ్చాడుతూనే ఉన్నారు. అయిదవ ఫ్లోరులో... యోగా, మెడిటేషన్‌ లాంటి ఆరోగ్యవంతమైన అలవాట్లను పరిచయం చేయిస్తున్నారు. మనసుకు ఉల్లాసాన్నిచ్చే సంగీతాన్నీ గీతోపదేశాన్నీ వినిపిస్తూ... మానసిక ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఆ హోమ్‌ ఆవరణలో చల్లగాలుల మధ్య ముసలోళ్ళ చేతులు పట్టుకుని నడిపిస్తున్నారు. నడవలేనివాళ్ళను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి తిప్పుతున్నారు. అన్ని వసతులు కలిగిన ఆ హోమ్‌కి కట్టాల్సిన ఫీజు చాలా ఎక్కువే అయినా... ఆ ముసలాళ్ళకు న్యాయం చేస్తున్నారనిపిస్తుంది. నాన్నకి కూడా నానమ్మని అక్కడ జాయిన్‌ చేయాలని ఒక నిమిషం అనిపించినా... ఆ వయసులో అనాథగా వదిలేశామని ఆవిడ ఎక్కడ ఫీలవుతారో అని భయపడి మానేశారు. ఆ హోమ్‌లోని ముసలాళ్ళ కళ్ళల్లో చూశాను - ఎన్నో దీపపు కాంతుల వెలుతుర్ని. గదిలోనే మగ్గిపోతున్న నానమ్మ కళ్ళల్లో చూశాను - కొడగట్టే దీపానికున్న మసక వెలుతుర్ని. అలాంటి బతుకు బతికేకంటే ముందుముందు మాకు మేముగా ఒంట్లో ఓపిక ఉండగానే ఆ ఓల్డేజ్‌ హోమ్‌లో జాయినైపోవాలని నిర్ణయించుకున్నాం. అప్పుడప్పుడూ హోమ్‌ నుంచి సెలవు తీసుకుంటూ మీ దగ్గరకు వస్తూనే ఉంటాం. ఇందులో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ శ్రేయస్సు కోరి చెపుతున్నా... ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా టైమ్‌ ఉంది కాబట్టి నువ్వు అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకో.  

                                నీ

                               అమ్మ .

                                

   అమ్మ రాసిన ఉత్తరం ఎంత అర్థవంతంగా  ఉందో..! నాకెప్పుడూ ఏ ఉత్తరమూ రాలేదు, చదివే అవకాశమూ రాలేదు. నా చిన్నప్పుడే ఫోన్లు అందుబాటులోకి రావడంతో, ఉత్తరాల అనుభవం అస్సలు లేదు. అమ్మ ఫోన్లో ఏదో చెప్పబోతుంటే ఫోన్‌ కట్‌ చేసేశాను. చెప్పేది వినడానికీ రాసింది చదవడానికీ... ఎంత తేడా!        

            

            *  *  *   *    *

 

    నానమ్మ కాలం చేశాక, మా బాధ్యతలు కూడా నెరవేర్చి, వారనుకున్నట్టుగానే హోమ్‌లో జాయినైపోయారు- అమ్మా నాన్నా. మొదటిసారిగా వచ్చారు అమెరికా. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి కారులో తీసుకువస్తుంటే... హోమ్‌లో తోటివారితో వారికున్న స్నేహబంధాల గురించి ఎంతో ఆనందంగా చెప్పుకుపోతున్నారు. చుట్టూ పెద్దపెద్ద భవంతులు కనిపిస్తున్నా వారి కళ్ళముందు ఓల్డేజ్‌హోమ్‌ బిల్డింగ్‌ మాత్రమే కదలాడుతోంది. అమ్మా నాన్నా అక్కడ సంతోషంగా ఉన్నందుకు ఆనందంగా అనిపించినా, కొద్దిగా అసహనంగా ఫీలయ్యాను. ఇంటికెళ్ళాక నా పిల్లలను వాళ్ల ఒడిలో కూర్చోపెట్టి, నాక్కావలసినన్ని ఫొటోలు తీశాను. నేనూ, నా భార్యా కూడా తీయించుకున్నాం. 

     

    వారు వచ్చి నెల్లాళ్ళు గడిచిందో లేదో... నా భార్య రుసరుసలు నా మనసుకు కష్టం అనిపించాయి. అమ్మా నాన్నా ఎక్కడ వింటారోనని తలుపు దగ్గరకేసేశాను. ‘‘ఇక మీ అమ్మా నాన్నా మన దగ్గరున్నది చాలుగానీ, మీ తమ్ముడి దగ్గరకు పంపించేయండి. వీళ్ళు వచ్చినప్పటి నుంచీ నా డైలీ యాక్టివిటీస్‌ అన్నీ మిస్సయిపోయాను. టైమ్‌కి వండిపెట్టి వడ్డించడమే సరిపోతోంది’’ అంటున్న నా భార్య మాటలు వినలేకపోయాను. భవిష్యత్తును వూహించి- ఈనాటి కోసం, ఆనాడు అమ్మ తీసుకున్న నిర్ణయం తప్పు కాదని- నా మనసు మూగగా రోదించింది....!!*

         

              * * *  *  *  *

  (7 ఫిబ్రవరి 2016.ఈనాడు ఆదివారం అనుబంధంలో)

               


Rate this content
Log in

Similar telugu story from Drama