M.V. SWAMY

Drama

2.3  

M.V. SWAMY

Drama

మట్టిలో మాణిక్యాలు

మట్టిలో మాణిక్యాలు

3 mins
546           


సుబ్రహ్మణ్యంగారు గిరిజన ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. అతడు బాగా చదువుకున్నవాడు, గిరిజన సమాజాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చెయ్యాలనే దృక్పథం వున్నవాడు,యువకుడు కావున గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయుడుగా అతడు బాగా రాణించగలడని అధికారులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు అనుకునేవారు. అందరూ అనుకున్నట్లే, గిరిజన మారుమూల గ్రామంలోనే నివాసముంటూ గిరిజనులుతో కలిసిపోయేవాడు సుబ్రహ్మణ్యం. అతని పాఠశాలలో గంగులు అనే విద్యార్థి ఉండేవాడు. అతను తరగతికి సరిపడా వయస్సు కన్నా చాలా ఎక్కువ వయస్సుతో వుండేవాడు. అతనికి బడి ఈడు వచ్చినా బడిలో చేర్చకుండా పొలం పనుల్లోనూ, గిరిజన వృత్తుల్లోనూ ఉంచేసారు అతని తలితండ్రులు.

సుబ్రహ్మణ్యం సార్ వచ్చిన తరువాత బడిలో చదువులు బాగున్నాయని ఎవరో చెబితే విని గంగులు తలితండ్రులు అతన్ని బడిలో చేర్చారు. అప్పటికే గంగులుకి పదేళ్లు దాటిపోయాయి. గంగులుకి అక్షరాలు నేర్పడానికి సుబ్రహ్మణ్యం సర్వవిధాలుగా ప్రయత్నం చేసాడు అయినా గంగులుకి అక్షరాలు వచ్చేవి కాదు, ఈతచెట్టు, తాటి చెట్టు, కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు, పండ్లు తెమ్మంటే ఇట్టే తెచ్చేసేవాడు, నాటుపడవ నడిపి గెడ్డదాటి వెళ్లి పొరుగూరు నుండి సామానులు తెమ్మంటే ఒక్కడే వెళ్లి ఎంత రాత్రి అయినా భయం లేకుండా వచ్చేవాడు, అడివి మొత్తం తిరిగి రకరకాల పండ్లు, కాయలు, ఆకులు, కూరగాయలు, దుంపలు తెమ్మంటే చాలా చురుకుగా కదిలేవాడు, చెవుల పిల్లులు, పావురాలు, అడవిపందులు వేట గంగులుకి కొట్టిన పిండి, చింతపండు, పనస పండు సేకరణ అతనికి ఇష్టమైన పని, బురద పనసను చక్కగా వొలిచి తేగల సమర్ధుడు అతడు, ఇంట్లో పొలంలో పనులు చాలా చాకచక్యంగా చేయగలడు.ఆట పాటల్లో పిల్లలందరికన్నా చాలా మెరుగ్గా వుండేవాడు ఒక్క అక్షరాలు చదవడం, రాయడం తప్ప అతనికి అన్ని పనులూ వచ్చు. సుబ్రహ్మణ్యంకి గంగులు తీరు నచ్చేది కాదు, చదువు ఎగ్గొట్టడానికే అడ్డమైన పనులు మీద శ్రద్ధ చూపుతున్నాడు అని గంగులు మీద కారాలూ మిరియాలూ నూరేవాడు అతను. పిల్లలందరి ముందూ నోటికొచ్చిన తిట్లుతో గంగులుని తిట్టి మందలించేవాడు. సుబ్రహ్మణ్యం మాస్టారు తన కన్నా చిన్న పిల్లలు ముందు అవమాన పరిచి మందలించినా బాధ పడేవాడు తప్ప మాష్టారికి ఎదురు చెప్పేవాడు కాదు గంగులు. అయినా మాస్టారు గంగుల్ని అసహ్యించుకునేవాడు తప్ప ఆదరించేవాడు కాదు.ఒంటిపూట బడులు రోజుల్లో ఒకరోజు మాస్టారు మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయాడు, పిల్లలందరూ మాస్టారు గదిలోనే ఆడుకుంటున్నారు, అంతలో ఒక నాగుపాము వచ్చి సరిగ్గా మాస్టారు నిద్రపోతున్న పరుపు మీద పడగ ఎత్తి మఠం వేసింది, పిల్లలు భయంతో అరవగా మాస్టారు నిద్రనుండి లేచి భయంతో అరిచారు, అప్పుడు గంగులు మాస్టార్ని భయపడకండి ,కదలకండి అని చెప్పి, పాముతోక పట్టుకొని ఒడుపుగా బయటకు తీసుకుపోయి అడవిలోకి వదిలిపెట్టేసాడు, మాష్టారికి గంగులు మీద కొంచెం అభిమానం పెరిగింది, మరోరోజు అత్యవసర పరిస్థితుల్లో మాస్టారు గెడ్డదాటి తనవూరు పోవలసి వచ్చింది, గంగులు మాష్టారికి ధైర్యం చెప్పి తెడ్డు పడవ మీద గెడ్డ దాటించాడు.ఇంకోసారి మాష్టారికి విషజ్వరం వస్తే... పొరుగూరు వెళ్లి మందులు తెచ్చి ఇవ్వడం, మాష్టారికి అవసరమైన వంటచేసి పెట్టడం గంగులే చేసాడు. గంగులు మీద మాష్టారికి ఉన్న అభిప్రాయం మారింది. చదువు రాకపోయినంత మాత్రాన మనిషి పనికిరాడు అన్నది తప్పుడు అభిప్రాయం, గంగులుకి చదువు బుర్రకు ఎక్కక పోయినా వాడికి లోకజ్ఞానం,శారీరక బలం, ఆరోగ్యం ఎక్కువ కాబట్టి ఆతనికి బ్రతుకు మెరుగుకు సూచనలు ఇచ్చి ప్రోత్సాహకాలు అందిస్తే మట్టి నుండి వచ్చిన మాణిక్యం అవుతాడు అని, అడవిలో వ్యాపార పంటలు, కూరగాయలు, పండ్లు తోటలు పెంచడం, వాటిని మార్కెట్ చేసుకోవడం చెప్పి, మూఢనమ్మకాలు, గిరిజన దురాచారాలు, వ్యసనాలు,మూఢత్వం నుండి దూరంగా ఉంచడానికి మంచి నైతికత నేర్పి తనకు ప్రియ శిష్యుడుగా చేసుకున్నాడు. మాస్టారు బదిలీపై వేరేవూరు వెళ్లినా వాళ్ళ మధ్య అనుబందం చెడిపోలేదు. ఈలోగా గంగులుకి కాస్తా అక్షరజ్ఞానం కూడా వచ్చింది. కాలం గిర్రున తిరిగింది. గంగులు ఆదర్శరైతు, తరువాత గ్రామ ప్రెసిడెంట్, తరువాత మండల ప్రెసిడెంట్ తరువాత ఇప్పుడు ఎం. ఎల్. ఏ అయ్యాడు, కొన్ని సంవత్సరాలు తరువాత మినిస్టర్ అవుతాడానే సూచనలు వచ్చాయి.మాస్టారు రిటైర్ అయిపోయారు, అతని సన్మాన సభ ఘనంగా జరిగింది. అప్పుడు మాస్టారు మాట్లాడుతూ నేను మట్టి నుండి మహా ప్రయోజకుడ్ని వెలికి తీసాను, అయితే మాణిక్యం నాకు ఎంతో లోకజ్ఞానాన్ని నేర్పి నా అజ్ఞానాన్ని తొలగించింది, ఆ మాణిక్యం మన గంగులు అని అన్నారు. గంగులు మాస్టారు పాదాలకు నమస్కరించి, ఈ మార్గదర్శి లేకపోతే ఈ ముతక రాయి మాణిక్యం అయ్యేది కాదు ఎప్పుడో మట్టిలో కూరుకు పోయి ఉండేది అని తన కృతజ్ఞతలు తెలిపాడు, ఆ గురుశిష్యులు బంధాన్ని అందరూ మెచ్చుకున్నారు.Rate this content
Log in

Similar telugu story from Drama