మరుజన్మ
మరుజన్మ
అనగనగా ఒక ఊరిలో రాముడు, భీముడు మంచి మిత్రులు, కానీ వారిద్దరి గుణ గుణాలు వేరువేరుగా ఉండేవి, ఇద్దరు తమకున్న ఒక ఎకరం పొలంలో, వరి ,జొన్నలు పండిస్తూ, తమ జీవనాన్ని భార్య బిడ్డల పోషణ కోసం సరిపడేటట్టు కృషి చేస్తూన్నారు.
తనకున్న దానిలో 'రామయ్య ఇతరులకు లేదనకుండా సాయం చేస్తూ, 'అన్నమో రామచంద్ర!
అంటూ తన ఇంటికి ఎవరు వచ్చినా, తను తినడం మానేసి వారికి భోజనం పెట్టి ,ఎంతో సాయం చేసేవాడు.
అలాగే 'భీమయ్య కూడా ఎంత సంపాదించినా,
తన భార్య బిడ్డలకి సైతం పొదుపుగా ఖర్చు పెడుతూ, పరమ పిసినారి అవతారంతో, ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయక, ధనాన్ని కూడ పెడుతూ
ఆ ఊరిలోనే ధనవంతుడిగా పేరు పొందాలని ఆశపడుతూ, ఒక్కొ పైసా కూడా దానధర్మం చేయకుండా, పరమలోభి గా పేరుగాంచాడు.
ఒకరోజు ఆ మారుమూల గ్రామంలో 'ప్రకృతి వైపరీత్యాల 'వలన, అకాల వరదల వలన,
అంటు రోగాలు సోకి, ఆ గ్రామంలో చాలా మంది, 'వైద్య సహాయం 'అందక మృత్యువాత పడ్డారు అందులో మన కథానాయకులు రాముడు, భీముడు కూడా ఒక్క రోజే చనిపోయారు.
ఆ తర్వాత పరలోకం ప్రయాణమై 'యమధర్మరాజు 'గారి దగ్గర హాజరైపోయారు.
రాముడు భీముడు .అందరిలాగే స్వామి!, మేము ఏమి పాపం చేశాము,? మా భార్య బిడ్డలునీ వదిలి,
అకాల మరణం పొందాము, ఎందుకు మమ్మల్ని చంపి తీసుకు వచ్చారు, అంటూ అమాయకంగా ఏడుస్తూ అడిగేసరికి, ఓ అలాగా! సరే మీరు మీకు జరిగిన అన్యాయాన్ని ఆ 'బ్రహ్మదేవుడి 'దగ్గరకు వెళ్లి చెప్పండి, ఆయన అనుగ్రహిస్తే, మళ్లీ మంచి జన్మ ఎత్తుతారు, లేదా ఇక మీకు మరుజన్మ ఉండదు, అంటూ వారిని 'బ్రహ్మ దేవుని' దగ్గరకు పంపించారు యమధర్మరాజు గారు.
ఆ మాట విన్న వెంటనే, అలాగే స్వామి అంటూ నమస్కారం చేసి, భీమయ్య హుటాహుటిన 'బ్రహ్మ లోకం 'వెళ్లి స్వామి! మీరు రాసిన విధి వ్రాతలో
అన్యాయంగా అకాల మరణం పొందాను, దయచేసి నాకు మరుజన్మ ప్రసాదించండి,! అంటూ ఆశగా ఆత్రుతగా బ్రహ్మ దేవుని అడిగాడు భీమయ్య, సరే నేను 'చిత్రగుప్తుడు 'ను సంప్రదించాను ,నీది అకాల మరణం,
, నీకు మరుజన్మ ప్రసాదిస్తున్నాను, ఎలా ఉండాలని అనుకుంటున్నావూ కోరుకో! అంటూ నవ్వుతూ అడిగాడు బ్రహ్మదేవుడు.
భీమయ్య ఎంతో సంతోషించి, స్వామి !నేను మళ్ళీ అదే ఊరిలో అత్యంత ఐశ్వర్యవంతుడిగా పుట్టాలి, నా జీవితమంతా హాయిగా ఉండేటట్టు అన్ని సదుపాయాలు ఉండాలి,,నేను చేయి జాపితే చాలు, ధనం వర్షించాలి, జీవితమంతా రాజభోగం, అనుభవించాలి, కూర్చున్న చోటనే ధనం
సమకూరాలి, అంటూ స్వార్థంగా, ఆశగా అడిగేసరికి, దేవుడు ఒకింత ఆశ్చర్యపోయి,
సరే ,గత జన్మలో రెక్కలు ముక్కలు చేసుకున్నా, కష్టపడి సంపాదించినా సుఖం అనుభవించలేదు కాబట్టి, నీకు నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను, భీమయ్యకు మరుజన్మ ఉండేటట్టు పంపించాడు ఆ బ్రహ్మదేవుడు.
రామయ్య కూడా బ్రహ్మ దేవుని దర్శించుకుని వినమ్రతతో, స్వామి !నేను కూడా అకాల మరణం పొందాను, కానీ నాకు ఎంతోమందికి సాయం చేయాలన్న కోరిక తీరకుండానే చనిపోయాను, నాకు మరుజన్మ ప్రసాదించమని ప్రార్థించడానికి వచ్చాను, అని అన గానే, ఆ దేవుడు పూర్వపరాలు ఆరా తీసి, నీ నిస్వార్థ కోరికను ప్రసాదిస్తున్నాను నువ్వు కూడా అదే ఊరిలో మరుజన్మ పొందుతావు, అంటూ ఆశీర్వదించి పంపించాడు ఆ దేముడు.
మళ్లీ అదే ఊరిలో రాముడు భీముడు మరుజన్మ పొంది పెరిగి, పెద్దయి బ్రహ్మ దేవుడు ప్రసాదించిన జీవితాలతో మనుగడ సాగించారు.
'రాముడు 'అదే ఊరిలో అత్యంత ఐశ్వర్యవంతుడిగా ఎదిగి, చేతికి ఎముక లేనట్లుగా దానధర్మాలు చేస్తూ, అత్యంత భక్తి, శ్రద్ధలతో ఆలయ నిర్మాణాలు చేసి, అనాధాశ్రమాలు కట్టించి, తమ సొంత ఊరిని అన్నివిధాల అభివృద్ధి పరిచి, ఎంతో దయ మయుడుగా కీర్తి ప్రతిష్టలు పొందాడు.
'భీముడు 'అదే ఊరిలో రామయ్య కట్టించిన పెద్ద పెద్ద ఆలయాల, మెట్లమీద 'బిచ్చగాడిగా, ముష్టి అడుక్కొంటు తన పోషణ కూడా సరిగా జరగక మనసులోనే బాధపడుతూ
చెయ్యి చాచిన వెంటనే చిల్లర డబ్బులు పడే, తన దురాశ కోరిక ఫలితంగా, రోజు అమ్మ !అయ్యా! అంటూ అడుక్కుంటు, అయ్యో? ఆ దేవుడిని ఎంత నికృష్టమైన కోరికను అడిగాను, ఈరోజు నేను చేయి చాచి అడిగితే గాని, అన్న పానాదులు దొరకటం లేదు, అంటూ తన మనసులోనే రోజు మదన పడుతు కాలం గడపసాగాడు భీమయ్య.
మనం పుణ్యగతులు పొందాలంటే ,ఇతరులకు సహాయపడి, ఉన్నంతలో దానధర్మాలు చేస్తూ, ఆ దేవదేవులను ప్రార్థిస్తూ గడపాలి,
లేదా, ఆ బీముడు లాగే అత్యాశకు పోయి బిచ్చగాడిగా మరుజన్మ పొందవలసి వస్తుంది.
