gowthami ch

Tragedy

4.2  

gowthami ch

Tragedy

మిత్ర ద్రోహం

మిత్ర ద్రోహం

4 mins
513


శంకర్ , శ్యామ్ , సురేష్ ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. 10 వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. పై చదువుల కోసం శంకర్ మరియు శ్యాం వేరే ఊర్లకి వెళ్లిపోయారు కానీ సురేష్ మాత్రం ఇంట్లోని ఆర్ధిక పరిస్థితులు మూలంగా అక్కడితో చదువుకి స్వస్తి పలికాడు. సెలవులకు వచ్చినప్పుడల్లా ముగ్గురూ కలిగి ఆడుకొనేవారు. వాళ్ళ వయస్సుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగి పెద్దదయింది.


శంకర్ కి బ్యాంక్ ఉద్యోగం , శ్యాం గవర్నమెంట్ టీచర్ అవ్వడంతో ఏ ఊరిలో కూడా ఎక్కువ కాలం ఉండేవారు కాదు. సురేష్ మాత్రం వాళ్ళ నాన్న చేస్తున్న వ్యాపారం కొనసాగిస్తూ అదే ఊరిలో ఉండిపోయాడు. ఇలా ముగ్గురూ ఎవరి దారిన వారు విడిపోయారు.


ఒక్కొక్కటిగా పెళ్లిళ్లు , పిల్లలు అన్నీ జరిగిపోవడంతో ఎవరికి వారు అయిపోయారు. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవడం తప్ప కలవడానికి సమయం కుదిరేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు ముగ్గురూ కలవాలని నిర్ణయించుకుని వాళ్లు పుట్టి పెరిగిన ఊరికి వచ్చారు.


చాలా కాలం తరువాత సొంత ఊరిలో అడుగు పెట్టడం వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మిత్రులు ఇద్దర్నీ తన ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో అందర్నీ పరిచయం చేసి స్నేహితులు ఇద్దరికి

తన ఇంట్లోనే భోజనం ఏర్పాట్లు చేసాడు సురేష్.

ఇలా ముగ్గురూ భోజనం చేసిన తరువాత బయటకి వెళ్లి ఊరంతా తనివితీరా తిరిగి, వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకొని ఎంతో సంతోషించారు.


వాళ్ళ చిన్న తనంలో చదువుకున్న పాఠశాలకు వెళ్లి ఆ మధుర జ్ఞాపకాలని గుర్తుచేసుకొని ఎంతో ఆనందించారు. అలా మాటల్లో పడి సమయం కూడా తెలియలేదు.


"ఎరా సురేష్ ఏంటిరా ఇంకా అదే ఇంట్లో ఉంటున్నారా! "అడిగాడు శ్యాం.


"అవునురా ఏమి చేయమంటావ్ ,మా నాన్న పోయే ముందు నాకేమైనా ఆస్తి ఇచ్చిపోయాడా ఏంటి ఒట్టి అప్పులు తప్ప. అవి తీర్చడానికకే నా జీవిత కాలం పట్టేలా ఉంది. ఇంక వేరే ఇల్లు మారే పరిస్థితిలో లేము. ఇది కాదని వేరే ఎక్కడికి వెళ్లినా ఇంత తక్కువ అద్దెకి ఇల్లు రాదు. అందుకే అందులోనే సర్దుకొని బ్రతికేస్తున్నాం.


"అయినా సంతోషంగా గడపడానికి వచ్చిన మిమ్మల్ని నా బాధలు చెప్పి భయపెట్టినట్లున్నాను. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే కానీ మీ సంగతులు చెప్పండి" అడిగాడు సురేష్.


"మాదేముందిరా గవర్నమెంట్ ఉద్యోగస్తుల గురించి తెలిసిందే కదా ఎప్పుడు ఏ ఊరికి బదిలీ అవుతామో చెప్పలేము. మా ఉద్యోగాల వల్ల అనవసరంగా పిల్లల చదువులు పోతున్నాయి. ఒక ఊరికి బదిలీ అయ్యి అక్కడ అందరూ పరిచయం అయ్యే సరికి ఇంకో ఊరికి వెళ్లడం. అక్కడ మరలా అంతా సర్దుకునే సమయానికి ఇంకో ఊరు ఇలా ఊర్లు పట్టుకు తిరగడమే సరిపోతుంది." అన్నారు శంకర్ మరియు శ్యాం.


"అయినా మీకు నాలా ఆర్ధిక సమస్యలు లేవు కదరా.."అని సురేష్ బాధపడటం గమనించిన శంకర్, "అరే... సురేష్ నువ్వేమి బాధపడకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్పనా" అని అడిగాడు.


"ఏంటిరా అది" అని అడిగాడు సురేష్. "అదేమీ లేదురా నేను బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నా పేరు మీద నీకు కొంత డబ్బు తక్కువ వడ్డీకి అప్పు ఇప్పిస్తాను. ఆ డబ్బుతో నువ్వు ఇక్కడ చేసే వ్యాపారమే పట్టణంలో చేసుకో ఇక్కడ నీ భార్యకి ఎలాగో వ్యాపారంలో అనుభవం ఉంది కాబట్టి ఇక్కడి వ్యాపారం చూసుకుంటూ ఆ వచ్చిన డబ్బుతోనే ఇంటి ఖర్చులు చూసుకోమని చెప్పు. అప్పుడు నీ సంపాదన లో నీ ఖర్చులకి పోను మిగిలిందంతా లాభమే కదా.

బ్యాంకు వడ్డీ ఎలాగో ఎక్కువ ఉండదు. అలా కొంత కాలం చేసి చూడు అంతా మంచిగా ఉంటే అప్పుడు ఇక్కడికి వచ్చి బాకీలు అన్ని తీర్చేసి మీ భార్య , బిడ్డల్ని కూడా నీతోపాటే తీసుకెళ్ళి అక్కడే ఉంటూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. " అని సలహా ఇచ్చాడు శంకర్.


"నీ సలహా బాగానే ఉంది కాని పట్నంలో కొత్తగా వ్యాపారం పెట్టి నిలబడగలమా అన్నదే నా అనుమానం." అన్నాడు సురేష్.


"ఆ అనుమానాలు ఏమి పెట్టుకోకు సురేష్. మంచి సెంటర్ చూసి పెట్టావంటే దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. "అన్నాడు శ్యాం.


"సరే రా మీరిద్దరూ ఇంతలా చెప్తుంటే నాకు కూడా నమ్మకం కలుగుతుంది మీరు చెప్పినట్లే చేస్తాను." అన్నాడు సురేష్.


"అయితే నేను రేపు ఊరు వెళ్లిన తరువాత అన్ని వివరాలు కనుక్కుని నీకు చెప్తాను." అన్నాడు శంకర్.


ఇలా ఇద్దరూ సురేష్ కి ఒక భరోసా కల్పించి ఊరికి బయల్దేరారు.


కొద్ది రోజులు గడిచిన తరువాత శంకర్ తను ఇచ్చిన మాట ప్రకారం బ్యాంక్ లో తన పేరుమీద 10 లక్షలు అప్పు తీసుకొని సురేష్ కి ఇచ్చాడు.


సురేష్ ,శంకర్ మాట ప్రకారం పట్నం కి వెళ్లి కష్టపడి వ్యాపారంలో మెళకువలు అన్నీ తెలుసుకొని కొన్ని నెలల లోనే వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసాడు. పగలు , రాత్రి ఎంతో కష్టపడి వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించి ఊర్లో అప్పులు అన్నీ తీర్చేసి పట్నంకి మకాం మార్చాడు.


వ్యాపారం మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉందని బ్యాంక్ వడ్డీని కూడా శంకర్ నే కట్టమని, డబ్బు రాగానే అంతా కలిపి ఇచ్చేస్తాను అన్నాడు సురేష్. సరే అని శంకర్ కడుతూ వచ్చాడు.


ఇలా కొంత కాలానికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి డబ్బు కూడా బాగా సంపాదించాడు. డబ్బు తో పాటే పట్నం లోని విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయాడు. సొంత కారు , ఇల్లు కొన్నాడు. కాలంతో పాటు సురేష్ సంపాదన కూడా పెరుగుతూ వచ్చింది కొన్ని సంవత్సరాల లోనే కోట్లు సంపాదించాడు. ఈ మధ్యలో చాలా సార్లు శంకర్ కాల్ చేసి డబ్బు కట్టమని అడిగితే "డబ్బు సర్దుబాటు కాలేదు వచ్చే నెల మొత్తంగా ఇచ్చేస్తాను" అంటూ ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.


రాను రాను అతనిలో గర్వం కూడా పెరిగింది. కొత్త పరిచయాలు పెరిగాయి , పాత స్నేహితులు గుర్తు రానంతగా. డబ్బు ఇచ్చి సహాయం చేసిన మిత్రుడిని కూడా మర్చిపోయాడు. కానీ తన స్నేహితుడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడని తెలిసి శంకర్ , శ్యాం ఎంతో సంతోషించారు.


ఒకరోజు శంకర్ ఫోన్ చేసి "నువ్వు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నావు కదా, ఇంకా ఎన్ని రోజులు వడ్డీలు కట్టుకుంటూ కూర్చుంటావు, ఆ అసలేదో కట్టేసి నా అప్పు కూడా తీర్చేయోచ్చు కదా" అని అడిగాడు.


"నువ్వు అసలు దేనిగురించి మాట్లాడుతున్నావ్? అసలు నాకెప్పుడు ఇచ్చావు అంత డబ్బు?" అని అడిగాడు సురేష్.


ఆ మాట విన్న శంకర్ ఆశ్చర్య పోయాడు. "అలా అంటావేంటి సురేష్! నేనేగా నా బ్యాంక్ నుండి 10 లక్షలు అప్పు తెచ్చి నీకు ఇచ్చి పట్నం వెళ్లి వ్యాపారం చేసుకోమని చెప్పాను! అప్పుడే మర్చిపోయావా?"


"సురేష్ ఒక నవ్వు నవ్వి. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అసలు. నాకు ...నువ్వు... అప్పు ఇవ్వడం ఏంటి. నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా. ఏదో పాత స్నేహాన్ని అడ్డుపెట్టుకొని నా దగ్గర డబ్బు గుంజడానికి ప్రయత్నించకు పెట్టేయి ఫోన్" అని కాల్ కట్ చేసాడు.


మరలా ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఈ విషయం తెలిసిన శ్యాం కి కోపం వచ్చి "రారా శంకర్ వాడి దగ్గరకి వెళ్ళి అడుగుదాం."


"ఏమని అడుగుతావు రా."


"నువ్వు డబ్బు ఇచ్చినట్లు ఆధారం అడిగాడు గా..నేను ఉన్నాను ఆధారం పద పోయి అడుగుదాం." అంటూ శంకర్ చెయ్యి పట్టుకొని ముందుకు లాగాడు.


"అసలు మీరెవరో కూడా నాకు తెలియదు అంటాడు. అప్పుడేమి చేస్తావ్. వాడు ఇది వరకటి సురేష్ కాదు రా. మారిపోయాడు...కాదు కాదు...గొప్పవాడు అయిపోయాడు." అంటూ శ్యాం చేతిలోనుండి తన చేతిని విడిపించుకున్నాడు.


నమ్మి సహాయం చేసిన మిత్రుడికే ద్రోహం చేసేంత గొప్పవాడు అయిపోయాడు" అని బాధపడ్డాడు శంకర్.



Rate this content
Log in

Similar telugu story from Tragedy