gopal krishna

Drama Classics Inspirational

4  

gopal krishna

Drama Classics Inspirational

కలవని మనసులు

కలవని మనసులు

3 mins
257


డియర్ సారధీ,  

    ఈ లెటర్ మీకు చేరేసరికి నేను ఉంటానో ఉండనో చెప్పలేను. ఆరేళ్లయ్యింది మీరు ఇక్కడినుండి వెళ్ళి. "ఎప్పుడొస్తారు" అని నేను అడగడం, "ఇంకో నెల" అని మీరు అనడం పరిపాటిగా మారిపోయింది. ఇంకా మీ సమాధానాన్ని వినే సహనం నాలో మిగల్లేదు. నేను కట్నం ఇచ్చి మిమ్ములను పెళ్ళి చేసుకున్నది, మీతో నా జీవితం సంతోషంగా ఉంటుందని.

    మీకు కట్నం ఇచ్చి పనిమనిషిగా మీ అమ్మా నాన్నలకి చాకిరీ చేయడానికి కాదు. పనిమనిషి కి అయినా జీతం ఉంటుందేమో. నాకు వెట్టి చాకిరీ మాత్రం మిగిలింది మిస్టర్ సారధీ. మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావడంలేదు. మిమ్మలను పెళ్ళి చేసుకున్నాకా, నెలరోజుల మనకాపురానికి గుర్తుగా పుట్టిన ఆడపిల్లని చూడాలని మీకు అనిపించలేదంటే మీ మానసిక దౌర్బల్యాన్ని అర్థం చేసుకోగలను. అది మీ తప్పు కాదు. మీ అమ్మ పెంపకంలో లోపం అది. ఆడపిల్లను చిన్న చూపు చూసే మీకు ఆడది పెళ్ళాంగా కావాలి. ఇంకో ఆడది, తల్లిగా కావాలి. కూతురు ఎలా ఉందో కనీసం చూడాలని కూడా అనిపించని మీకు భార్యగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను.

     మీతో గడిపిన నెలరోజుల్లో నెలతప్పి ఆడపిల్లకి జన్మనిస్తే అది మీ అమ్మకి ఘోరమైన నేరంగా కనిపించింది. నెలరోజులకే గర్భం ధరించడం మీ అమ్మ దృష్టిలో తప్పు. అదెలా తప్పో అర్థం కాలేదు. కానీ ఆడపిల్ల పుట్టింది కదా! అందుకే ఆవిడ తప్పుపట్టారు. మా ఇంటావంటా ఆడపిల్లని కనే చరిత్ర లేదు అంటూ బుగ్గలు నొక్కుకుని వూరు వాడా చాటింపు వేసింది. బహుశా ఆవిడ మగవాడి గా పుట్టాల్సింది కానీ పొరపాటున ఆడదై పోయి పుట్టిందేమో.

    సారధీ, మీకు నేను అవసరం లేదని నాకు అర్థమైంది. నేను వెళ్ళిపోతే నా స్థానం లో, ఇంకొకరిని బలి ఇవ్వాలని మీ అమ్మ ఆలోచన. ఇంకో ఆడపిల్లని ఈ ఇంటికి బలివ్వడం ఇష్టం లేక ఇన్నాళ్లూ మీ అమ్మా నాన్న లని భరించాను. మీ నాన్నకి కోడలితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఆడపిల్లని ఎలాగౌరవించాలో కూడాతెలియదు. బహుశా మీకు కూడా ఆ బుద్ధులే వచ్చాయేమో. ఎంతైనా ఆయన రక్తం పంచుకు పుట్టారు కదా! పైగా క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని కుటుంబం మీది.

   కూతుర్ని పెళ్ళి చేసి అత్తవారింటికి పంపిఉంటే ఇంకో ఇంటినుండి తెచ్చుకున్న ఆడపిల్ల విలువ తెలిసేది మీ నాన్నకి. కోడలిలో కూతుర్ని చూసుకోవలసిన ముసలాయన, కోడలివైపు కామంతో చూస్తే దాన్ని ఏమనాలి? మీ నాన్న ఎందుకు చదువుకున్నాడో ఆయనకే తెలియాలి. ఇలాంటి ఇంట్లో ఉంటే నా మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. 

    మిస్టర్ సారధీ, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. మీతో కాపురం చేయాలనే కోరిక పోయింది నాకు. జీవితంలో ఆడదానికి ఏ సరదాలు ముఖ్యమో అవే లేకుండా పోయాయి నాకు. భర్త తో కలిసి సరదాగా బయటకి వెళ్ళాలని, పండక్కి, పబ్బానికి భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లాలని, సరదాగా ఒక సినిమాకో, షాపింగ్ కో వెళ్ళాలని అనుకుంటుంది ఏ ఆడదైనా. కానీ నాకు ఆ అవకాశం ఇచ్చారా? ఎప్పుడైనా మీ అంతట మీరు ఫోన్ చేసారా? కనీసం పండక్కి అయినా వచ్చి కూతురుని చూస్తారేమో అనుకున్నాను ఎన్నోసార్లు. మా నాన్న ఏడీ? అని అడిగితే ఏమని చెప్పాలి? చచ్చిపోయాడని చెప్పనా? మీ నాన్న పిరికివాడు. ఆడపిల్లని పోషించలేని అసమర్ధుడు అని చెప్పనా? లేక తండ్రెవరో తెలియకుండా పుట్టావు అని చెప్పనా?

  ఇంత ధైర్యంగా నేను మాట్లాడగలనని మీరు ఊహించి ఉండరు. మీరు ఎదురుపడితే ఇంకా బాగా మాట్లాడాలని అనుకుంటున్నాను. కానీ మీరు రారు. నాకు తెలుసు కదా. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నానో మీకు చెప్పాలిగా. నా చిన్ననాటి స్నేహితురాలు, పద్మజ నాకోసం మంచి ఉద్యోగం చూసింది. అందుకే విదేశాలకు అదీ ఆస్ట్రేలియా కి వెళ్ళిపోతు న్నాను. కంగారుపడకండి సారధీ, నా కూతురు నాకు కావాలి. అందుకే మీకు దూరంగా తీసుకెళ్ళిపోతున్నాను. కలవని మనసుల కోసం ఆశగా ఎదురు చూడ్డం వృధా కదా!

  నేనిచ్చిన కట్నం, మా వాళ్ళు పెట్టిన బంగారం, అన్నీ ఒక నెల రోజుల్లో మా అమ్మా నాన్నలకు అందచేయండి. లేదంటే ఏమౌ తుంది అని అనుకోకండి. నేను పోలీసులు, కోర్ట్ అంటూ నాకు నమ్మకం లేని వ్యవస్థల చుట్టూ తిరగను. నా చిన్ననాటి మిత్రులకి, అదే నన్ను చెల్లెమ్మా అని ఆప్యాయంగా పిలిచే నా వాళ్ళకి చెప్పాను. మీ అమ్మా నాన్నలకి వయసులో పెద్దవాళ్ళు అని కూడా చూడకుండా చిత్రవిచిత్రమైన నరకాన్ని చూపిస్తామని మాటిచ్చారు. వాళ్ళు మాట నిలబెట్టుకునే మనుషులు. మరి తొందరలో మా డబ్బు నగలూ మా ఇంట్లో అప్పచెప్పండి. నేను వెళ్తున్నా శాశ్వతంగా మీ జీవితంలోంచి. విడాకులు ఇస్తానని అనుకున్నారేమో. అలాంటివి ఏమీ ఇవ్వను. నరకం ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. ఉంటాను సారధీ.  

                       ఇట్లు                          

                    మీకేమీ కాని

                      రుచిక.


Rate this content
Log in

Similar telugu story from Drama