STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

ఇంటింటి రామాయణం

ఇంటింటి రామాయణం

4 mins
30


జానకీ..నీకు ఎన్నిసార్లు చెప్పనూ ఇంత నెయ్యి వెయ్యద్దు ఇడ్లీలమీద అని..నీకు మంచిది అనిపిస్తే చాలా నాకు తినాలనిపించద్దా..ఆ..అని భార్య మీద విసుక్కుంటున్నాడు కారుణ్య..


నెయ్యి బలమూ, తిన్న తిండి వంటబట్టేలా చేస్తుందని నేనూ చెప్తూనే ఉంటా రోజూ మీకూ..

మీకు తిన్నది అరగాలని ఇలా నన్ను సాధిస్తుంటారు నాకు తెలుసులెండీ మీ ఉపాయం అంది జానకి మూతి మూడువంకర్లు తిప్పుతూ..హబ్బా పల్లెటూరి పెళ్ళామా అని విసుక్కుంటూ ఆఫీసుకి వెళ్ళిపోయాడు కారుణ్య..


అబ్బబ్బా మొద్దులా ఏంటీ ఈ అవతారం..ఎప్పుడు చూడు ఇంత పెద్ద అంచున్న చీరలేనా..కాస్త స్టయిలుగా షిఫాన్ చీర కట్టుకోవచ్చుగా, రెండుమూరల పూలొకటి అదనంగా..ఓ గులాబీ పువ్వు సింపులుగా పెట్టుకుంటే సరిపోతుంది, కళ్ళకు కాటుక, అమ్మోరులా ఇంతపెద్ద బొట్టూ..అని ఇంకా కారుణ్య జానకిని ఓ సాయంత్రం సాధించబోతే..


నాన్నా అమ్మకి ఇష్టమైనట్టు తయారయ్యింది..ఆ మాత్రం స్వాతంత్రం లేదా అమ్మకి ..ఊ..అని నేటితరం మహిళ సరయు తండ్రిని మృదువుగా అడ్డుకుంది..


బాస్ ఇంట్లో షష్టిపూర్తి ఫంక్షను..సరదా సరదా పోటీలు జరుగుతున్నాయి...అచ్చతెలుగు సాంప్రదాయంగా ఎవరొచ్చారో వారికి బహుమతి అన్నారు...జానకి నెగ్గింది...అయిదుగ్రాముల బంగారు నాణెం, బాసు దంపతులు, జానకికి బహుకరించారు..


ఏంటిప్పుడు మరి అని నవ్వుతూ కూతురు కళ్ళెగరేసింది కారుణ్యని చూసి..సరే ఒప్పుకుంటాలే అని కూతురి తల మీద చిన్నగా చేత్తో తట్టాడు కారుణ్య...వచ్చేముందు జానకి బాసు భార్యకి ఒక బాక్సు ఇచ్చింది..ఆవిడ బాక్సు తీసి చూసి అబ్బో పూతరేకులు మీరే చేసారా అంది..అవునని తలూపింది జానకి..అరే నాకూ ఇష్టమే అంటూ బాసు ఒక పూతరేకు తిని ఆహా ఏమి రుచి బాగా చేసారు థాంక్యూ అన్నాడు..ఏనుగు అంబారీ ఎక్కినంత గొప్పగా అనిపించింది కారుణ్యకి..ప్రేమగా జానకి చెయ్యిపట్టుకుని థాంక్స్ అన్నాడు నిజాయితీగా భార్యను మనసారా మెచ్చుకుంటూ..


కూతురుకి పెళ్ళయ్యింది...కొడుకుకీ పెళ్ళయ్యి కోడలొచ్చింది..కోడలు ఉద్యోగం, జానకి ఉండీలేని ఆరోగ్యం..ఇంట్లో కోపాలు, చిరాకులు షరా మామూలుగా..


జానకి నోరు ఎంత పెద్దదో కోడలొచ్చాకే అర్ధమయ్యింది కారుణ్యకి...కోడలుకి కూడా ఆఫీసు బాధ్యతలు, పైగా ఇంటిపనులు సరిగ్గా రావు..నిత్యం ఏదో ఒక గొడవే జానకికి, రూపిణికి..


ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీసులో కొలీగ్స్ లాగా, భార్య నైసుగా లేదని పోల్చుకుని చిరాకుగా ఉండేవాడు కారుణ్య...రిటైరయ్యి ఇంట్లో ఉండేటప్పుడు భార్య ఇల్లు దిద్దుతున్న తీరు చూసి, కోడలి పనిరాని తనం చూసి..జానకి ప్రత్యేకత కారుణ్యకి అర్ధం అయ్యింది..


రూపిణికి పెళ్ళయ్యి నాలుగేళ్ళయినా పిల్లల ఊసు ఎత్తట్లేదు అని జానకికి కోపం వస్తోంది..ఒకరోజు కొడుకు వంశీని, రూపిణిని నిలదీసింది..చూడండర్రా మాకు ఓపికలున్నప్పుడే పిల్లల్ని కంటే నేను చేసుకోగలను, ఓపిక పొయ్యాక ఉద్యోగం చేసే తల్లితో పిల్లల ఆలనపాలన కష్టం అవుతుందిగా మరి..అని..


రూపిణికి ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదు..ప్రమోషన్ వచ్చేలా ఉంది..ఇప్పుడు కష్టపడి పనిచేస్తేనే ప్రమోషన్ వచ్చే చాన్సు ఎక్కువ, లేదంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టం వేస్టు అయిపోతుందని రూపిణికి బాధ..


ఇంకో రెండేళ్ళకు రూపిణి శుభవార్త వినిపించింది...అంతే జానకి రూపిణికి సర్వ సపర్యలూ చేస్తోంది..అంతేలెండి నా కడుపులో ఉన్న మీ వారసత్వానికి ఈ జాగ్రత్తలన్నీనూ, నేను మోసే యంత్రాన్ని కదా మరి అందుకే ఇన్నిరోజులూ లేని శ్రద్ధ నా మీద మీకిప్పుడూ అని అంది రూపిణి బాధగా...అది కాదమ్మా కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి ప్రశాంతంగా ఉంటే బిడ్డ కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు..నువ్వు కూడా ఇప్పుడిలా అప్పుడలా అనిబేరీజు వేసుకుని మనసు చిన్నబుచ్చుకోకు, బిడ్డకు మంచిది కాదు అని కోడలికి స్నేహంగా నచ్చచెబుతున్న భార్యను చూసిన కారుణ్యకు జానకి ముచ్చటగా కనిపించింది...పొద్దున్నే రూపిణికి దానిమ్మపండు గింజలు వలిచి ఇచ్చేది...లంచ్ బాక్సులోకి యాపిల్ ముక్కలొకరోజు జామకాయ ముక్కలొకరోజు ఇచ్చేది..సాయంత్రం రోజూ మొక్కజొన్నె తినిపించేది..రాత్రిపూట పెద్దగ్లాసు పాలు ఇచ్చేది ఓ నేతిచుక్క వేసి మరీ...


రూపిణి నిండుగా తయారయ్యింది..ఈ మధ్య రోజూ కోడలికి ఉప్పుతో దిష్టి తీస్తోంది జానకి...


ఆ రోజు సాయంత్రం జానకీ అంటూ ఇంకా టీ తేలేదేంటీ అనుకుంటూ కారుణ్య వంటింట్లోకి వెళ్ళాడు...జానకి స్టవ్ ఉన్న గట్టు ముందు నేల మీద పడిపోయి ఉంది...జానకీ అని నీళ్ళు మొహం మీద చల్లాడు..స్పృహలో లేదు జానకి..అయ్యో అనుకుని అంబులెన్సు పిలిచి హాస్పిటలుకి తీసుకెళ్ళారు జానకిని..


హార్ట్ అటాక్ మొదటిసారి కాస్త బలంగానే పలకరించింది జానకిని...ఇహ జాగ్రత్తలు మొదలయ్యాయి జానకికి..తిండిలో కట్టుబాట్లు పనిచెయ్యటంలో ఆంక్షలు..ఇది చెయ్యొద్దు అది తినొద్దు అని రూల్స్ పాటించాల్సి వస్తోంది జానకికి..


కారుణ్య నిద్రపోతున్న భార్య పక్కన కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు...నిద్రలో జానకి చెయ్యి కారుణ్య చెయ్యి మీద పడింది..ఆ చేతిస్పర్శకి కారుణ్యకి అనిపించింది..మొన్నేమన్నా జరిగుంటే నా పక్కన ఈ నా సగభాగం ఉండేదా...తను నా పక్కన లేకపోతే నా రోజులు గడిచేదెలా..పెళ్ళయ్యి ముప్ఫయేళ్ళు నాకు అంతగా నచ్చని నా భార్య ఈ రోజు ఇంత ముఖ్యం అనిపిస్తోందేంటీ...కాలంతో పాటూ బంధాల విలువ, బంధం తాలూకు అవసరం తెలిసొస్తాయన్నమాట...అనుకున్నాడు కారుణ్య...


సంవత్సరం తరువాత మనవరాలు ప్రియతో జానకి ఆడుకుంటోంది ..చేతుల్లో మొహం దాచి మళ్ళీ చేతులు తీసి ప్రియని చూస్తే ప్రియ కిలాకిలా నవ్వుతోంది...


కొన్నిరోజులకి జానకికి మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ వచ్చింది..మూడోసారి రాకుండా చూసుకోమని డాక్టర్లు జాగ్రత్త చెప్పారు..రూపిణి ప్రియని వాళ్ళ అమ్మదగ్గరికి పంపించెయ్యాలని అనుకుంటోంది..


జానకికి బెంగగా అనిపిస్తోంది..ఎలా మనవరాలు దగ్గర లేకుండా అని..రూపిణీ మనకి ఉన్నది సరిపోతుందిలేమ్మా..నువ్వు ఉద్యోగం మానెయ్యగలవా..ప్రియని చూడకుండా ఉండలేను నేను అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది జానకి రూపిణి దగ్గర...చాలా టెన్షన్ అనిపించింది రూపిణికి..జాబ్ వదలటం ఇష్టం లేదు అలా అని అత్తగారి ఆరోగ్యం, అత్తగారికి ప్రియతో ఉన్న అనుబంధాన్ని నిర్లక్ష్యం చెయ్యాలనీ లేదు...ఇన్నేళ్ళు ఈ అత్తగారి ఆధారం వల్లే ప్రశాంతంగా జాబ్ చేస్తోంది..మరి ఈ రోజు ఆవిడకి తన అవసరం ఉంది కానీ జాబ్ వదలాలని అస్సలు లేదు..ఆర్ధికభద్రత, తనకంటూ ఒక హోదా ఇవి వదలాలంటే బాధగా ఉంది రూపిణికి...


సాటి ఆడదాని బాధ అర్ధం చేసుకునే తత్వం సరయుది అని వదినకి ఫోన్ చేసి ఇదీ విషయం అని చెప్పి సలహా అడిగింది రూపిణి..తల్లి ఆరోగ్యం గురించి తనకీ తెలుసు సరయూకి...


పెళ్ళయ్యి వేరే ఇంటికి వెళ్ళినా అప్పుడప్పుడైనా అందుకునే అమ్మప్రేమ దూరమైతే తట్టుకోలేను ..సమయం ఉన్నప్పుడే అమ్మను కాపాడుకోవాలి అని ఆలోచించింది...భర్తతో మాట్లాడింది...తండ్రితో ఆలోచన చేసింది...


వారి ఊరిలో త్రీ స్టార్ రెస్టారెంట్ నడుపుతున్నారు సరయు వాళ్ళు..భర్తను ఒప్పించుకుని తల్లి ఉన్న ఊరికి తరలి వచ్చేసారు సరయూ వాళ్ళు, 

ఈ ఊరిలో రెస్టారెంట్ ఓపెన్ చేసారు..


అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు...ఇంటిపైన ఒక అంతస్తు కట్టించి ఇచ్చాడు కారుణ్య సరయూ వాళ్ళకి...సరయు ఇంట్లో ఉండి జానకిని ప్రియని తన కొడుకు ఆదిత్యని చూసుకుంటోంది...సరయు అత్తామామా తమ ఇద్దరి కొడుకుల దగ్గరా చెరో ఆరునెలలు ఉంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు...సరయూ వాళ్ళ దగ్గర ఉండే ఆరునెలలు జానకికి, తన అత్తగారికి వచ్చే మాట పట్టింపులు నెగ్గుకురావటం ఒక్కోసారి సరయుకి కత్తి మీద సామే అయ్యేది అలాంటప్పుడు జానకికి చెప్పేది అమ్మా ప్రియ నీ దగ్గర ఉండాలంటే నీ నోరు తగ్గించుకోవే తల్లీ అని..దానితో కొన్నిరోజులు జానకి కుదురుగా ఉండేది...కారుణ్యకి చుట్టూ ఉండే బంధాల రూపంలోని ఇన్ని రకరకాల మనస్తత్వాలను గమనించడం సరదాగా అనిపించేది... ఓ పుస్తకంలో తనకు తోచిన రీతిలో ఆ అనుభవాలను విశ్లేషించి రాసుకోవడం ఓ అలవాటుగా మారింది...ఇంకో పదేళ్ళకు కూడా జానకితో ఆయన ప్రయాణం ఇంకా నడుస్తోంది చెయ్యిచెయ్యీ కలుపుకుని....


Rate this content
Log in

Similar telugu story from Classics