gopal krishna

Drama Classics Children

4  

gopal krishna

Drama Classics Children

దొంగ...దొంగ

దొంగ...దొంగ

5 mins
430


   నడినెత్తిన సూరీడు చుర్రుమనిపిస్తు న్నాడు. అసలే రోహిణి కార్తె. ఎక్కడ పిట్టలు కూడా కనపడ్డం లేదు. మునసబు సుబ్బారావు గారింటి ప్రహరీమీద కాకులు అన్నం మెతుకుల కోసం కావ్ కావ్ అని అరుస్తూ, అక్కడున్న నాలుగుమెతుకుల్ని ఏరుకుంటున్నాయి. ఎదురు వీధిలో మా ఇంటికి ఎదురుగ కనిపించే రాజారావు రోజూ చేసే వడ్రంగం కార్ఖానా బంద్ చేసి గంటైపోయింది. 

  ఊరందరికీ ఆ పనీ ఈ పని చేసి పెట్టి, ఎవరన్నా తిండి పెడితే వాళ్ళరుగు మీదే తినేసి, చెరువు గట్టుమీద చింతచెట్టుకింద సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకునే కుంటి వెంకన్న అప్పుడే పంతులు గారింట్లో సుష్టుగా భోంచేసినట్లున్నాడు. గట్టిగా త్రేన్చుకుంటూ చేతిలో విసనకర్రతో చింతచెట్టు కిందికి బయల్దేరాడు. "ఏంట్రా యెంకన్నా ఇయ్యాల భోజనం ఎక్కడ?" మండుటెండలో నెత్తిమీద తువ్వాలు వేసుకొని గబగబ ఇంటికి వెళ్తూ కూడా వెంకన్నని పలకరించడానికి నడకలో వేగాన్ని తగ్గించాడు రైల్వే సత్యం. 

  "పంతులుగోరు ఆళ్ళమ్మ సచ్చిపోయిన రోజుట భోజనం పెట్టారు సత్తాలు" కుంటి వెంకన్న కాలు ఈడ్చుకుంటూ నడుస్తూ ముందుకి కదిలాడు. "ఇంత ఎండలో బయట తిరక్కపోతే ఏమౌతాది, డూటీ అయ్యాకా సాయంకాలం దాకా అక్కడే ఉండొచ్చు కదా"! రైల్వే సత్యం పెళ్ళాం రాజీ మొగుణ్ణి నిలదీసింది. "మజ్జానం వరకే కదే డూటీ ఇంకా అక్కడెందుకు" అంటూ తాను వేసుకున్న రైల్వే యూనిఫామ్ ముతక నీలం రంగు చొక్కా, నిక్కరు విప్పేసి లుంగీ కట్టుకొని కాళ్ళూ చేతులు కడుక్కోడానికి వెళ్ళాడు పెరట్లోకి. 

    బ్రాహ్మణ వీధి చివర సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం ఉంది. పిల్లలు మామూలు రోజుల్లో గుడి ఆవరణలోనే రోజంతా ఆడుకుంటారు. బ్రాహ్మణ వీధిలోకి కుంటి ఎంకన్న తప్ప ఎవరూ ఇతర కులాల వాళ్ళు వెళ్ళరు. బ్రాహ్మలు కూడా ఎవర్నీ రానివ్వరు అటువైపు. అయినా ఊళ్ళో అందరూ కలిసి మెలిసి ఉంటారు. కానీ వేసవి కాలం అందులోనూ రోహిణి కార్తె....., జనాల్ని ఠారెత్తిస్తూంటే పెద్దోళ్ళు పిల్లల్ని ఉదయం తొమ్మిదిగంటల నుండి ఇంటికే కట్టడి చేసేసారు. ఎలాబతకాలో ఈ వేసం కాలంలో, నిట్టూరుస్తోంది తన ఇంటి వీధి వైపు పంచలో కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ సుబ్బులత్తయ్య.

   ఆవిడ ఇల్లు బ్రాహ్మల వీధి చివర. ఆవిడ ఏడో ఏటనే పెళ్లి చేశారట పెద్దలు. ఎనిమిదో ఏటకే మొగుడు పోయి, విధవరాలైంది దానికి గుర్తుగా తెల్లని చీర, తలమీంచి కప్పుకుంటుంది. తలమీద ఒక్క వెంట్రుకా లేకుండా నెలకోమారు గుండు కొట్టించు కుంటుంది పూర్వాచారం ప్రకారం.

   ప్రెసిడెంట్ రాఘవరెడ్డి ఇంట్లో చల్లని ఏసీ గదిలో భార్య రత్నం ఇచ్చిన చల్లని మజ్జిగ దాహం పుచ్చుకుంటూ కులాసాగా ఉన్నాడు ఎండమొహం కూడా చూడకుండా. పెళ్ళాం ఇచ్చిన మజ్జిగ తాగేసి, ఆవిణ్ణి మొరటుగా చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. రత్నం భర్త చేతుల్లోంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అదేమీ రాఘవరెడ్డి ముందు పనిచేయలేదు. భర్త ఇంత ఖుషీగా ఉన్నాడంటే ఏదో కీడు జరగబోతోందని ఆవిడకి తెలుసు. 

    ఊళ్ళో ఒక్కసారిగా కలకలం మొదలయ్యింది. "సుబ్బారాయుడు గుళ్ళో దొంగ దూరాడు", "పట్టపగలే ఊళ్ళో దొంగలు పడ్డారు" ఎవరో గట్టిగా అరిచిన అరుపు వినిపించింది. మండే ఎండను కూడా లెక్క చెయ్యకుండా కాలికి చెప్పులు వేసుకోడం అలవాటు లేని సుబ్బులత్తయ్య ఒక్కసారిగా వీధి గుమ్మంలోకి వచ్చి "దొంగా.. దొంగా" అంటూ అరవసాగింది. సుబ్బులత్తయ్య అరుపులతో వీధి పిడుగులు పడినట్లు దద్దర్లిల్లిపోతోంది. అందరికంటే ముందు తేరుకున్నది మునసబు సుబ్బారావు. "ఏమైందే సుబ్బులత్తా" అంటూ వీధిలోకి వచ్చాడు. 

   పదే పది నిమిషాల్లో ఊరంతా దొంగ కోసం గాలించడం మొదలుపెట్టారు. "దొంగ గుడి తలుపు బద్దలుకొట్టి లోపల దూరడం నేనే చూసాను" అంటూ అరిచాడు వెంకట్రమణ. "ఒరేయ్ ఎంకట్రమణా మనకెందుకురా అక్కర్లేని పంచాయితీ", ఎవరూ వినకుండా కొడుకుని గట్టిగా కసురుకుని లోపలికి తీసుకెళ్లింది రామాలయం పక్కనే చిన్న కిల్లీ కొట్టు పెట్టుకుని ఉంటున్న సావిత్రమ్మ. వాళ్ళ దుకాణం సుబ్బారాయుడి గుడివీధి చివర ఎడమవైపు వైపు ఉంటుంది. పిల్లా పెద్దా అందరూ ఎండను మరిచిపోయి సుబ్బా రాయుడు గుడివైపు పరుగులు తీశారు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తాళం కప్ప బద్దలుకొట్టి దొంగ లోపల దూరాడను కుంటా తీరిగ్గా లుంగీ పైకి మడతపెట్టి అన్నాడు రైల్వే సత్యం. 

   "దొంగ ఇంకెక్కడుంటాడు ఎప్పుడో పారిపోయుంటాడు" అన్నాడు మునసబు సుబ్బారావు. "గుళ్లోనే దాక్కున్నాడేమో" అంది సుబ్బులత్త. "దొంగతనం చేసినవాడు ఇంకా ఎందుకుంటాడు. దొరికిన సరుకులతో ఈపాటికి ఉడాయించేసి ఉంటాడు" అన్నాడు వెంకట్రమణ. అందరూ గుడి ముందు నిలబడి పంచాయితీ పెట్టారు కానీ ఎవరూ గుడి తలుపు తియ్యడానికి సాహసించలేదు. "ఒరేయ్ సుబ్బిగా గుడి తలుపు తియ్యరా" గట్టిగా అరిచింది సుబ్బులత్త. 

   "వాడి చేతిలో కత్తి ఉంటే నా పరిస్థితి ఏంటే సుబ్బులత్తా"! అన్నాడు మునసబు. కొంచెం సేపు తర్జనభర్జనలు తదనంతరం రైల్వే సత్యం కాలితో గుడితలుపు బలంగా తన్నాడు. ఒక్క ఉదుటున లోపలనుండి దొంగ బయటికి ఉరికాడు. తలపాగా, మొహానికి అడ్డంగా గుడ్డ కట్టుకుని ఉన్నాడు. బలంగా ఉన్నాడు. ఒకే ఊపులో రైల్వే సత్యాన్ని వెనక్కి తోసేసి, జనాల్ని చీల్చుకుంటూ రివ్వున పరిగెత్తాడు వాడు. ఆ తోపుడు కి సత్యం నేరుగా సుబ్బులత్త మీద పడి, కిందపడిపోకుండా ఉండడానికి ఆమెను గట్టిగ వాటేసుకున్నాడు. ఆ ఊపుకి ఆవిడ కిందపడిపోయింది. అందరూ సానుభూతి చూపిస్తూ అవిణ్ణి పైకి లేపారు. 

  చెరువు గట్టెక్కి, చెరువు దాటేసి, చంద్రయ్య పేట వైపు పోవాలనేది వాడి ఉద్దేశం. అటువెళ్తే కొండలు ఉంటాయి కాబట్టి జనాల అలికిడి తగ్గేదాకా ఎక్కడో అక్కడ తలదాచుకోవచ్చు. ఊళ్ళో వాళ్ళ అరుపులకి చెరువు గట్టు మీద రావి చెట్టుకింద నిద్రపోతున్న కుంటి ఎంకన్న తుళ్ళిపడి లేచాడు. 

    ఎవరో మనిషి వేగంగా పరిగెడుతూ ఉంటే , కొందరు అతని వెనకాల పరిగెత్తడం చెరువు గట్టు మీద కూర్చున్న ఎంకన్న చూసాడు. చేతిలో విసన కర్ర పక్కన పడేసి, లేచి కూచున్నాడు. తన ముందు నుండి పరిగెడుతున్న వాణ్ణి చూసి, కాలు అడ్డం పెట్టాడు . ఆ పరిగెడుతున్నవాడు బొక్కబోర్లా పడడంతో లాఘవంగా వాడి మీదికి వెళ్ళి వాడి వీపు మీద కూర్చున్నాడు. ఒక్క క్షణంలో దొంగని పట్టుకున్న కుంటి వెంకన్న జనాలు దగ్గరికి వచ్చేలోగా వాడిని నిలబడ నివ్వ లేదు. వాడివీపు మీద కూర్చుని చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు కదలకుండా. 

   జనాలు ఒక్కొక్కడు ఒక్కోగోల, దొంగమీద దెబ్బలు పడుతున్నాయి. మొహానిక్కట్టుకున్న గుడ్డను తొలగించారు. అందరూ నోరెళ్ళ బెట్టుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకో సాగారు. "చంద్రయ్యపేట కదరా నీది" అడిగా డు మునసబు సుబ్బారావు. "ఈడి పేరు చంద్రయ్య . అక్కడ ఈ పనీ లేకుండా ఊళ్ళో సెత్త తిరుగుళ్ళు తిరుగుతాడు", అన్నారు ఎవరో "ఈణ్ణి ఇలా కాదురా, పెసిరెంట్ గారింటికి తీస్కొని పోదాం. ఈడి సంగతి అక్కడి తేలిపోవాల" అన్నాడు రైల్వే సత్యం. "పోయినేడాది రామాలయంలో డిబ్బీ పట్టుకొని పోయింది ఈడేనేమో, వాణ్ణి నాలుగు తన్ని తగిలించి నిజం చెప్పించండి" అరిచాడు వెంకట్రమణ. 

   పంచాయితీ కాస్త ప్రెసిడెంట్ ఇంటికి చేరింది. బయట గోలగోల గా అరుపులు వినిపిస్తూ ఉంటే, "ఎవరో వచ్చినట్లున్నా రయ్యా" అంటూ భర్త నుండి దూరంగా జరగడానికి ప్రయత్నం చేసింది రత్నం. "ఆళ్ళు కూసుంటారులేయే", అంటూ ఇంకోసారి పెళ్ళాన్ని దగ్గరకు లాక్కోబోయాడు. ఆవిడ అతణ్ణి పక్కకి తోసి కిందపడిన బట్టల్ని ఏరుకుని పక్కగదిలోకి వెళ్ళిపోయింది. 

   రాఘవరెడ్డి బద్ధకంగా మంచం దిగి, మొహం కడుక్కొని నింపాదిగా అరుగుమీదికి వచ్చాడు. అప్పటికే పిల్లా పెద్దా అందరూ గుమిగూడి గోలగోలగా అరుస్తూ నిలబడ్డారు. "ఎహె, ఏమైందో ఒక్కడు సెప్పండి" ఒక్క బూతుతిట్టు గట్టిగా తిట్టడంతో అందరూ నిశ్శబ్దమై పోయారు. "చూడండి రెడ్డిగారూ వీడు గుళ్ళో దొంగతనం చేస్తూ దొరికిపోయా డు" అన్నాడు మునసబు. "ఏరా, ఏదీ దొంగసొత్తు అడిగాడు ప్రెసిడెంట్. అప్పటికే వాడికి ఒళ్ళంతా హూనమయ్యేలా కొట్టినా వాడు నోరుకూడా విప్పలేదు. మళ్ళీ మళ్ళీ అడిగినా వాడు నోరు విప్పలేదు. వాడి చొక్కా, పంచా అన్ని విప్పి మరీ వెతికినా ఏమీ కనిపించలేదు. 

   అందరూ ఒకరిమొహాలు ఒకరు చూసు కున్నారు. గుళ్ళో ఏం పోయిందో ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. పూజారి గారు గుళ్ళోకి వెళ్ళి చూడ్డానికి ఇంకో ఇద్దరు పెద్దల్ని తీసుకెళ్లాడు. "ఈడికిలా కాదు గానీ, పోలీస్టేసనుకి ఏసెయ్యాల" అంటూ ప్రెసిడెంట్ వాడి వీపు మీద రెండు దెబ్బలు చరిచి, జీప్ షెడ్ లోంచి బయటికి తీసి వాడి కాళ్ళూ చేతులూ కట్టేసి ఎక్కించాడు. మునసబు కూడా ప్రెసిడెంట్ తో పాటూ జీప్ ఎక్కాడు. "ఈణ్ణి అక్కడే తన్నించి నిజం చెప్పిత్తాము" అంటూ జీపు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చా డు ప్రెసిడెంట్. ఊరికి సంబంధం లేనంత దూరం తీసుకెళ్లి ఒక చెట్టు కింద ఆపాడు. "ఒరేయ్, చెత్త నాయాలా, దొంగతనం చెయ్యరా అంటే పట్టపగలు చేసింది చాలక అందరికీ దొరికిపోతావా" అంటూ చెడామడా తిట్టేసి, ఇవ్వు ఆ బంగారం" అన్నాడు ప్రెసిడెంట్ రెడ్డిగారు. 

   వాడు నోట్లోంచి తీసి రెండు బంగారం కళ్ళు, ఒక ముక్కుపుడక తీసిచ్చాడు. ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? అడిగాడు ప్రెసిడెంట్. "సత్యప్రమాణకంగా ఇవేనండీ" అప్పుడు విప్పాడు నోరు. "సరే, ఇదిగో ఈ లెక్క తీసుకెళ్ళు" అంటూ వాడి చేతిలో కొన్ని పచ్చనోట్లు పెట్టాడు. "అయ్యా, ఈ సారి తమరు దయ తలచాలా మా ఆవిడ నెలతప్పింది" అడిగాడు వాడు దీనంగా. "ఒరేయ్ సెంద్రిగా నీ పెళ్ళాం నెలతప్పడానికి నేను కారణం కాదు కదరా" మునసబు మొహంలోకి చూస్తూ గట్టిగా నవ్వాడు ప్రెసిడెంట్. వాడేమీ మాట్లాడకుండా "ఇంకొంచెం ఎక్కువిప్పించండి దొరా" అంటూ బతిమాలాడాడు. ఇంకో అయిదు నోట్లు వాడి చేతిలో పెట్టి, నేను చెప్పేదాకా ఈ వూరు పొలిమేరల్లో కనపడకు అంటూ వాణ్ణి వదిలేసాడు. "ఇదిగో ఇది నీకు ఇది నాకు" అంటూ ఒక బంగారు కన్ను మునసబు చేతిలో పెట్టి, ఇంకో కన్ను, ముక్కుపుడక ప్రెసిడెంట్ జేబులో వేసుకున్నాడు. 

   "హమ్మయ్య ఈసారి బాగానే నొక్కేసా" అనుకున్నాడు సెంద్రి గాడు అని పిలవబడే చంద్రయ్య. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటూ, రేప్పొద్దున్న దొంగతనం చేసిన సొత్తులో తన వాటా ఎంతో లెక్కలేసుకుంటూ జీపు లో కూర్చున్నాడు మునసబు. రాత్రి ప్రెసిడెంట్ ఇంటికి కన్నం ఎలా వెయ్యాలో చంద్రయ్యకి ముందే స్కెచ్ వేసిచ్చాడు మునసబు. సగం సగం అని ముందే ఒప్పందం కుదుర్చుకొని తిరిగి గ్రామం వైపు బయల్దేరాడు చంద్రయ్య. 

    "అయ్యా ప్రెసిడెంట్ గారూ, స్వాముల వారి రెండు బంగారు కళ్ళూ, అమ్మవారి ముక్కుపుడక, అమ్మవారి మెడలో సూత్రాలూ కనిపించడం లేదండీ" అంటూ లబలబ మొత్తుకున్నాడు పంతులు గారు. తను అమ్మవారి సూత్రాలతో సరిపెట్టుకున్నాడు చెంద్రిగాడు. "పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను పంతులుగారూ. రేపో నేడో ఎంక్వయిరీ అవుతుంది అంటూ సమాధానం చెప్పిన ప్రెసిడెంట్ ఎంత ఆలోచించినా తనకు సగం కూడా ముట్టలేదని గ్రహించి తేలుకుట్టిన దొంగలా ఉండిపోయాడు. 

    రాత్రి జరగబోయే దొంగతనం, తనకు ముట్టబోయే వాటిని తలుచుకొని మునసబు పులకరిస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఎంత సేవ చేసినా తనకి ఇల్లు గడిచేలా కూడా లేకుండా గుడిని దోచుకుంటున్న ఊరి పెద్దల వలన ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అనుకుంటూ, గుడిని సంప్రోక్షణం చేసి, రాత్రి మంగళహారతి ఇచ్చి గుడికి కొత్త తాళం కప్ప వేసి ఇంటికి బయల్దేరారు పంతులు గారు.


Rate this content
Log in

Similar telugu story from Drama