sujana namani

Romance

4.7  

sujana namani

Romance

అందమైన ప్రేమంటే

అందమైన ప్రేమంటే

10 mins
5.5K


                               


అందమైన  ప్రేమంటే

*************************

 ‘ఎరా... అమ్మాయి వాళ్ళు ఫోన్ చేసారు ..ఏవిషయం చెప్పమని.. ఎం చెప్పమంటావ్....’

‘అమ్మా... ఆరోజు గుళ్ళో మీరు చూపించగానే చెప్పాను.... నాకు నచ్చలేదని.... అసలు మా ఫ్రెండ్స్ అంతా ... నీ అందానికి తగ్గ  అతి లోక సుందరి  ఎక్కడో పూజలు చేస్తు ఉంటుంది....అంటారు.... అలాంటిది ఎ ప్రత్యేకత లేని ఆమెను చేసుకుంటే , ‘కాకి ముక్కుకు దొండపండు’’ లా ఉందని , ఎంత వెక్కిరిస్తారో నీకేం తెల్సు...చూడగానే కనీసం మరోసారయినా చూడాలనిపించేలా ఉండాలి. ...ఆమె చాలా మామూలుగా ఉంది...’

‘పెళ్లి నీవు కదా చేసుకునేది....ఎవరేం అనుకుంటే నీకేం... అమ్మాయి చామన చాయగా ఉన్నా మంచి కళ ఉంది...’

‘అమ్మా ...చేసుకునేది నువ్వా...నేనా...ఇక ఇప్పటి నుండి ఆ టాపిక్ ఎత్తకు..’         

బయటకొచ్చి టైర్ పంచర్ కావడంతో ,విసురుగా బస్టాండ్ వైపు నడిచాడు సిద్దార్ద.

  బస్ చాలా రద్దీ గా ఉంది .అసలే చిరాగ్గా ఉన్నాడేమో అసహనంగా నిలబడ్డాడు.

    ‘ ఎక్స్ క్యుజ్ మీ ... వందకు చిల్లర ఉందా....’ అన్న పిలుపు కు ముందుకు చూసాడు . దివి నుండి భువికి విహారార్ధం వచ్చిన దేవకన్య లా , ముట్టుకుంటే మాసిపోతుందా , పట్టుకుంటే కంది పోతుందా అన్నంత సుకుమారంగా ఉందామె. 

నిజానికి ఆ చిల్లర అతనికి కూడా బస్ లో అవసరం ఉంది. కాని అంత అందమైన ఆమె అడుగుతుంటే కాదనలేక పోయాడు. మొత్తం జేబులన్నీ వెదికి ఇచ్చేసాడు.

చిన్నగా నవ్వింది . వెన్నెల పగలే కురిసినట్లనిపించింది. బలవంతాన ఆమె ఇంకా బస్ లో ఉన్నా దిగిపోయాడు.

    సిద్ధార్ద ఒక స్వచ్చంద సంస్థ స్థాపించి అందులో క్రియాశీలంగా వ్యవహరిస్తూ సభ్యులతో అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఇటీవల ఒక రైలు ఆక్సిడెంట్, రెండు బస్ ఆక్సిడెంట్ లలో కూడా వెంటనే స్పందించి చాలా మందిని రక్షించి హాస్పిటల్ లో చేర్పించడం , అవసరమైన రక్త దానం చేయడం ...లాంటివి చేయడంతో అతనికి తెలియకుండానే మీడియా కవర్ చేసి పెద్దగా ప్రచురించింది. ఆరోజు లంచ్ అవర్ లో దగ్గరలోని కాలేజ్ లో అవయవదానం గురించి అవగాహనా కార్యక్రమం ఉండడంతో సంస్థలో సభ్యుడైన భాస్కర్, కొలీగ్ కూడా కావడంతో అతనితో కల్సి వెహికిల్ పై బయల్దేరాడు. దారిలో అడిగాడు భాస్కర్,’ఎరా... మొన్న చూసిన అమ్మాయి ఎలా ఉంది...ఒకే చేసావా...’ అంటూ. ఎందుకంటే అతనే ఆ సంబంధం గురించి చెప్పింది. 

‘ఆ... నీ మొహం.... ఏంటి నచ్చేది....నచ్చలేదు ....అమ్మకు చెప్పేసా...ఇవ్వాళ బస్ లో ఒక మెరుపుతీగ ను చూసా... చేసుకుంటే అలాంటి ఆమెను చేసుకోవాలి... అందర్నీ వదిలి ఆమె నన్నే చిల్లర అడిగింది తెలుసా...’

‘ఓహో....లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లా...అయితే త్వరలో పప్పన్నమన్న మాట...’

‘ముక్కు మొహం తెలీదు...పేరు ఊరు తెలీదు... లవ్....అట ....పద పద మళ్ళీ టైం లోపల ఆఫీస్ చేరాలి, బాక్స్ తినేయాలి... ఆకలి దంచేస్తోంది....’

ముందు కార్యకర్తలు వెళ్లి అందర్నీ విశాలమైన ప్రాంగణంలో కూర్చోపెట్టడంతో , వెళ్ళగానే తనను పరిచయం చేసుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు.

‘నేటి యువతే రేపటి భవిత.. మీరు కేవలం గంటకు కట్టిన తాడులా ఉండొద్దు. అది కేవలం అక్కడి నుండి ఆ చుట్టుపక్కల మాత్రమె తిరుగుతుంది. కాని మీ శక్తి మేధస్సు విశాలంగా ఉండాలి.కష్టం అంటారేమో...

 ‘నొప్పి లేని నిమిషమేది జననమైనా మరణ మైనా ...జీవితాన అడుగడుగునా

 నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది ..నెత్తురుంది సత్తువుంది ...ఇంత కన్నా సైన్యముండునా

జడివానైనా ,తూఫానైనా మొదలయ్యేది చినుకుతోనే

చిట్టడివైనా, కారడవైనా మొదలయ్యేది చిగురుతోనే

ఎంత గొప్ప విజయమైనా మొదలయ్యేది చిన్న ప్రయత్నం తోనే ...’ ఇది విన్నారు కదా ...

ఆకాశం అన్నాక కొన్నిసార్లు ఇంద్రధనుస్సు, వెన్నెల, కారుమబ్బులు, ఉరుములు, మెరుపులు ,మేఘాలు, వర్షాలు కనిపిస్తుంటాయ్...ఇవి ఉన్నా లేక పోయినా ఆకాశం మాత్రం అలానే ఉంటుంది. మనిషి జీవితం కూడా అంటే ఇంద్ర ధనుస్సులాంటి సంతోషం, ఉరుముల్లాంటి కోపాలు, కారుమబ్బుల్లాంటి బాధలు, వర్శాల్లాంటి కన్నీళ్లు ఉంటాయ్ ...ఇవి ఉన్నా లేకపోయినా జీవితం మాత్రం సాగుతూనే ఉంటుంది. అందుకే మనిషి వచ్చి పోయే కాలంలా కాక కలకాలం ఉండే ఆకాశంలా ఉండాలి...

  మనం ఉన్నా లేకపోయినా మన ముద్ర కలకాలం భూమి మీద నిలవాలి.

‘కారం లేని కూర ,ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, మమకారం లేని ఇల్లు , సేవానిరతి లేని జీవితం వ్యర్దం ..... అందుకనే మీకు చేతనయినంతలో చిన్న సహాయమైనా చేయండి. మేము చదువుకుంటున్నాం..ఏమీ సంపాదించడంలేదు ..ఏమి చేయగలం అనుకోకండి... ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహమాన్, ఒక సచిన్, నిన్నటి కి నిన్న జిమ్నాస్టిక్స్ లో పతకం సాధించిన రెడ్డి కాలేక పోవచ్చు కాని ప్రయత్నిస్తే ఒక మదర్ థెరిస్సా కావచ్చు... కాగలరు... ఇందుకు మేధస్సు, ప్రతిభ,కృషి అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటె చాలు...

  మీరు చూస్తూనే ఉన్నారు...ఇటీవల ఎన్ని ఆక్సిడెంట్ లు అవుతున్నాయో... ఏంతో మంది కాళ్ళు , చేతులు,కళ్ళు, లోపలి అవయవాలు ఇలా ఎన్నో కోల్పోతున్నారు. అలాగే జీవన్మ్రుతులైన వారెందరో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే మనం అవయవ దానం చేస్తే, అలా అందరూ ప్రతిన పూనితే మనం పోయాక కూడా శాశ్వతంగా జీవించ వచ్చు. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇవ్వాళ ఉంటాం రేపు వెళ్ళిపోతాం ... ఒక్కసారి ఆలోచించండి...అలాగే రక్త దానం చేస్తే మనలో కొత్త రక్తం తయారవుతుంది. ఇంకా ఉత్సాహంగా పని చేయవచ్చు. దానివల్ల ఎందరి పేదల ప్రాణాలో పోకుండా కాపాడవచ్చు.... వాళ్ళందరికీ మా సంస్థ తరపున ఒక గ్రూప్ ఉంది, ఎక్కడ అవసరం వచ్చినా ఆ గ్రూప్ లో పెడతాం, ఎవరికీ ఆ గ్రూప్ రక్తం ఉందొ, ఎవరికీ ఆ స్థలం దగ్గర ఉందొ వారు వెంటనే స్పందించ వచ్చు..మీరెవరైనా చేరదల్చుకుంటే మా కార్యకర్తలు ఇచ్చే ఫామ్స్ లో మీ వివరాలు నింపండి...

‘పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని....మూగనేలకు నీరందివ్వని వాగు పయనం దేనికనీ....’ అన్న సినారె గారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి .. నాకీ 

అవకాశం ఇచ్చిన మేనేజ్ మెంట్ కి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాటలిప్పటికి, మమతలేప్పటికి ....సెలవిప్పటికి,స్నేహం,సేవ ఎప్పటికి......’

 ఉపన్యాసం ముగించగానే ఆగకుండా చప్పట్లు మోగుతూనే ఉన్నాయి...  

కార్యక్రమం పూర్తయ్యి వచ్చేసి బాక్స్ తిని ఆఫీస్ పనిలో పడ్డాడు. సాయంత్రం ఒక ఫంక్షన్ హాల్ నుండి ఆహారం మిగిలిందని మెస్సేజ్ రావడంతో అక్కడికి వెళ్లి ఆ ఆహారం అంతా తను తీస్కేల్లిన వాన్ (ట్రక్కు)లో పెట్టుకుని, ఎప్పటికి తానిచ్చే అనాధ శరణాలయాలు, వృద్దా శ్రమానికి ఇచ్చి రాత్రి ఇంటికి వచ్చేసాడు.

వచ్చి భోజనం చేసాక, వచ్చిన మెసేజ్ లన్నీ చూస్తుంటే ఒక తెలియని నంబర్ నుండి వచ్చిన మెస్సేజ్ అతన్ని బాగా ఆకర్షించింది. అదేమంటే,’ మీరెంత అందంగా ఉంటారో ... మీ మనస్సు అంతే అందంగా ఉంది అని నిరూపించారు. నిజంగా మీ ఉపన్యాసం.... సారీ అలా అనడానికి మనస్సోప్పడం లేదు .... మీరు కాలేజ్ లో చేసిన జ్ఞానోదయం ఒక అద్భుతం....

  అంతేనా... సాయంత్రం చేసిన అన్నదానం , ఆలోచన, కార్యాచరణ... అమేజింగ్...హాట్సాఫ్ టు యు...అన్నం పరబ్రహ్మ స్వరూపం, పారేయడానికి ఒక నిమిషం చాలు, కాని పండించడానికి నెలలు, ఏళ్ళు కావాలి. .... మీరొక ఉత్తేజం ఒక చైతన్యం ... ఒక స్పూర్తి ...వివేకానంద వారసులు....భారత దేశానికి ఒక విలువైన ధనం (అసెట్).. ‘ అంటూ కింద పేరు ఇవ్వకుండా నమస్కారం పెట్టె గుర్తులు వరుసగా చాలా పెట్టి ఉన్నాయి....’

అది చదివాక సహజ సిద్ధ మైన కుతూహలం తో, ఎవరై ఉంటారీ అపరిచిత వ్యక్తీ , కాలేజ్ లో స్టూడెంట్ నా.. ఒక వేళ అలా అయితే అన్నదానం తనకు తెలీదు కదా... ఆఫీస్ లోని ఎవరి నంబర్ కాదు ....ఎవరై ఉంటారు.. తనను చూసారు కాబట్టే, తన అందం గురించి ప్రస్తావించారు... చిరునవ్వు తో ఆలోచిస్తూనే హాయిగా నిద్రపోయాడు .

  తెల్లవారి తన పుట్టిన రోజు కావడంతో తెల్లవారి లేవగానే ఎప్పటిలాగే ఆరోజు ఆఫీస్ బోర్డ్ పై రాయడానికి కొటేషన్లు చూసాడు. ఆ తర్వాత తనను విష్ చేసిన అనాధ శరనాలయ , వృద్ధా శ్రమ యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపి ఆ రోజు ఎ సమయానికి వస్తున్నాడో చెప్పాడు . స్నానం చేసి అమ్మ చేసిన రొట్టెలు, అన్నం కూరా ఉన్న పాకెట్లు తీసుకుని, బాబా గుడికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్నాక , బయట ఉన్న అందరికి ఆ పాకెట్లు ఇచ్చేసాడు. తర్వాత ప్రతి సారిలాగే అనాధ శరణాలయం వెళ్ళాడు, తను తీసుకెళ్ళిన పళ్ళు, స్వీట్లు ఇవ్వడానికి . వెళ్ళగానే ఎప్పటికీ పలకరించే వార్డెన్ ఆదరంగా విష్ చేస్తూ ఎదురొచ్చింది. ఆమె లోన ఉన్న పిల్లల దగ్గరకు తీసుకెళ్ళింది. అందరూ వెళ్ళగానే లేచి నిలబడి రెడ్ గులాబీలతో

‘ అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు .....’ అంటూ అందించారు. ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ తాను వచ్చి ఇవ్వడమే తెల్సు కాని వాళ్లకు అది తన పుట్టిన రోజని ఏమీ తెలీదు. ఇలా ఎప్పుడూ చెప్పలేదు. ఇలా ఎప్పుడు గులాబీలు అందివ్వలేదు. అయోమయంగా చూస్తున్న అతనితో ,’బాబూ...ఎప్పటికీ మా శరణాలయాన్ని సందర్శించి మీలా సహకారం ,ప్రోత్సాహం అందించే వ్యక్తీ తన పేరు చెప్పవద్దని , ఇలా చెప్పమని చెప్పారు... మాకూ మీపై ఉన్న అభిమానం వల్ల ఇష్టంగా స్వీకరించాం..... ‘ చెప్పుతూ పోతోంది ఆవిడ.

  అందరికీ చిరునవ్వుతో నమస్కారం పెట్టి స్వీకరించాడు. అలాగే వృద్దా శ్రమం లో కి వెళ్ళి దుప్పట్లు, ముసలి వాళ్లకి పాడ్స్ లాంటివి ఇస్తుంటే, వాళ్ళూ తమ ఆయుష్శూ పోసుకుని నూరేళ్ళు వర్దిల్లమంటూ దీవేనలిచ్చారు. వార్డెన్ మాత్రం ఒక పాకెట్ ఇచ్చి, మీలా ఎప్పటికీ ఆశ్రమానికి వచ్చే వ్యక్తీ మీపైని అభిమానంతో తన పేరు చెప్పకుండా ఇది ఇవ్వమన్నారు. దయచేసి స్వీకరించమన్నారు. ‘ అంది.

ముందు తీసుకోకూడదు అనుకున్నా తనలాగే సేవ ఇష్ట పడే వ్యక్తీ అనేసరికి తీసుకున్నాడు. తెరిచి చూస్తె తెల్లటి మల్లెపూవులాంటి లాల్చి పైజామా డ్రెస్... ఎర్రగులాబి, పూలపూల కవర్ లో ఒక ఉత్తరం... ఆశ్చర్యంగా తెరిచాడు.

‘ప్రియమైన మీకు.... అనాధశ్రమానికి, వృద్దా శ్రమాలకు ఆవయసులో వారి బాధలు గుర్తించి మీరు చిన్న వయసులో చేసే సేవ అమోఘం ... మనసు చూపే అందం కనులేప్పుడూ చూపలేవు. మనసు చూసే అందం మనిషేన్నడూ చూడలేడు .... మొదటి వాడు ఎప్పుడూ ఒక్కటే, మరి మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే... అయినా అదే వెనక వచ్చే మాలాంటి వాళ్లకు బాట... అందరిలో ఒక్కడిగా వెలుగుతున్న  మీకు శత సహస్ర కోటి వందనాలతో ....మీ అభిమాని ’ అంటూ నమస్కారం గుర్తులు పెట్టి ఉన్నాయి.. కింద ఎవరి పేరూ లేదు. ఆశ్చర్యంతో రాత్రి చూసిన మెస్సేజ్ గుర్తొచ్చి సెల్ ఓపెన్ చేసాడు. మరో మెస్సేజ్ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు వచ్చింది. ‘ కరుణామయుడికి ,దేశం గర్వించే భారత పౌరునికి , మధురభాషి, మందస్మిత భాషి, మృదు భాషి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు, మీకో సర్ప్రైజ్ ఈరొజు .... చెప్పుకోండి చూద్దాం ....మీ అభిమాని ’ అని ఉంది. అంటే ఆ సర్ప్రైజ్ ఇదే నన్నమాట.... ఆ మెస్సేజ్ పెట్టినవాళ్ళు, ఇది పంపిన వాళ్ళు ఒక్కరే అన్న మాట..మరి వీళ్ళు ఆడనా, మగనా, పెళ్లయినవాళ్ళా , కానివాళ్ళా....వీరికి తన అలవాట్లు ఎలా తెలుస్తున్నాయి. తనను ఏమైనా అనుసరిస్తున్నారా...అలా ఏమీ కనబడటం లేదు. పైగా తన పుట్టిన రోజు వాళ్లకు తెలిసిందంటే తన కార్య కర్తల్లో ఎవరైనా నా .... కాని వాళ్ళెవరైనా తనతో డైరెక్ట్ గా మాట్లాడతారు కదా , పైగా ముందే గ్రూప్ లో శుభాకాంక్షలు పెట్టారు కదా... ఈ నంబర్ కి ఫోన్ చేస్తే పోలా అనుకున్నాడు. చేసాడు కాని స్విచ్ డాఫ్ అని వచ్చింది. తర్వాత ఎవరు మీరు అంటూ మెస్సేజ్ పెట్టాడు. కాని ఎందుకో తెలీదు కాని మనస్సు సంతోషంతో నిండి పోయింది. ఆ రాత్రి మరో మెస్సేజ్.... ‘యుద్ధంలో వెయ్యి మంది వీరులను సంహరించిన వాడి కన్నా తన మనసుని తాను జయించిన వాడే నిజమైన వీరుడు అన్నారు గౌతమ బుద్ధుడు... బాబా గుడి వద్ద అందరి ఆకలి తీర్చి బాబా మనస్సు గెల్చిన మీ కు ఫిదా అయ్యాను. పది మంది కోసం ఒకసారి తలదించినా ఫర్వాలేదు కాని ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టని మీ వ్యక్తిత్వానికి వేనవేల వందనాలతో ...మీ అభిమాని...’ షాక్ అయ్యాడు. గుడి సంగతి కూడా ఎలా తెల్సింది... ఆ వ్యక్తీ ఎవరో గాని తానె వారికి గులాం,అభిమాని అయి పోతున్నాడు.... కాని ఎందుకు తనతో దాగుడు మూతలు... కాని ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియడం లేదు . ఫేస్ బుక్ లో వెదుకుదామంటే పేరు తెలీదు. ఎలాగైనా శరణాలయం వాళ్ళను అడిగితె కనీసం ఆడ, మగ తెలుస్తుంది అనుకుని ఆ రోజు వారిని కలిసాడు. వారు ముందు నిరాకరించినా తర్వాత అతనితో ఉన్న అనుబంధం వల్ల , ఇలా అమ్మాయి అని చెప్పారు. దానితో ఇంకా ఆశ్చర్యం వేసింది. ఆఫీస్ లో అందరూ తనను ఆప్యాయంగా పలకరించే వాళ్ళు అంతా పెళ్ళయినవాల్లె. ఇక ఇంటి వీధిలో కూడా తనకు అందరూ తెలిసిన వాళ్ళే. ఇద్దరే అమ్మాయిలు , వాళ్ళు ప్రతీసారి రాఖీ కడతారు. ఏదైనా ఎదురుగానే చెప్పేస్తారు. ఇంత మ్యాచురిటీ లేదు ...ఇక మరెవరు... అనుమానం... ఆ బస్ లో అందమైన అమ్మాయి దగ్గరకొచ్చి ఆగిపోయింది. బస్ లో అందరూ ఉండగా తననే ఎందుకు చిల్లర అడిగింది. ఆ కళ్ళల్లో ఎదో ఆరాధన స్పష్టంగా కనబడింది. పైగా ప్రతీ రోజూ ఆ సమయానికే బస్ స్టాప్ లో కేవలం తనను చూడడానికే అన్నట్లు వస్తోంది. కళ్ళతో పలకరిస్తోంది. చిరునవ్వుతో ప్రేమిస్తోంది. మాటలు కలపడానికి ప్రయత్నిస్తోంది. ఆమె అని తెలియగానే అతని పెదాలపై చిరునవ్వు వెలసింది. తెల్లవారి మాట్లాడాలి అనుకున్నాడు.

   తెల్లవారి లేచి ఆ రోజు కొటేషన్ కోసం వెదికాడు.

‘నిజమైన ప్రేమ అందం లో ఉండదు. అందమైన మనస్సులో ఉంటుంది. నిజమైన ప్రేమకు మించిన ఔషదం లేదు. స్వార్ద పూరితమైన ప్రేమను మించిన కాలకూట విషం లేదు.’

 ఆ తర్వాత ఆ రోజు పేపర్ తీసాడు. అతనికి ఆ క్షణంలో తెలీదు. పేపర్ లో చూసిన విషయాలు తన జీవితంలో తాను ఊహించని పరిణామాలకు దారి తీస్తాయని.

రెగ్యులర్ వార్తలు చదివాక , ఆరోజు సెంట్రల్ స్ప్రై డ్ లో , ఒక మహిళ రాత్రి పుట్ పాత్ పై పడుకున్న బీద వాళ్లకు కొత్త దుప్పట్లు కప్పుతుండగా తీసినఫోటో వేసారు. దానిపై ఒక ఆర్టికల్ రాసారు. చేసే దానం కుడి చేయితో చేసింది ఎడమ చేయికి తెలీకూడదంటారు. అలాంటి కోవకే ఈవిడ చెందుతుంది. ఇలా కప్పుతున్న ఆమెను చూసి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన మా విలేఖరి అలర్ట్ అయి ఫోటో తీసాడు. ఆ తర్వాత ఆమె గురించి వాకబు చేస్తే , చాలా ఆశ్చర్య కరమైన విషయాలు బయట పడ్డాయి. తానూ స్వయంగా ఇలాంటి వారికి సేవ చేయడం, వయోజనులకు , పిల్లలకు విద్యాదానం చేయడం, స్వచ్చ భారత్ గురించి మరుగు దొడ్లు లేని గ్రామంల లో పోరాడి మరుగుదొడ్లు కట్టించడం, అత్యాచారాలకు గురయిన మహిళలకు మనోధైర్యాన్ని ఇస్తూ వారి తరఫున పోరాడడం లాంటి ఎన్నో సమాజ హిత మైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె ఇంటర్వ్యు ఇవ్వడానికి ఆవిడ ఒప్పుకోలేదు. అతి కష్టం పై పేరు మాత్రం కనుక్కున్నాం... ఆవిడే సాయి త్రైలోక్య. బాబా కున్న దయాగుణం, ముల్లోకాలను పాలించే అమ్మలగన్న అమ్మ కున్న ప్రేమానురాగాలు కలుపుకుని పేరుకు దగ్గట్లు గా పుట్టిన ఆమె నేటి యువతకు ఒక ఆదర్శం , ఒక స్పూర్తి.’ అంటూ రాసారు. ఆ పేరు చూడగానే వచ్చిన , అనుమానం తో ఫోటో ను తీవ్రంగా చూసాడు. సందేహం లేదు అతని అనుమానం నిజమే. ఆమె మరెవరో కాదు. ఆరోజు తాను గుడిలో చూసి అమ్మాయే. తను ఆమె అందంగా లేదని తిరస్కరించిన ఆమ్మాయి. కాని చిత్రంగా అతనికి ఇప్పుడు ఆమె ఎంతో అందంగా కనబడుతోంది.

ఆమెకు అభిమాని అయిపోయాడు.

ఫోన్ చేద్దామనుకున్నాడు భాస్కర్ కి. ఆఫీస్ కెళ్ళి చెబుదామనుకున్నాడు. తర్వాత కిందనే మరో వార్తా అతన్ని ఆశ్చర్య చకితుణ్ణి చేసింది. అక్కడ ఒక ఫోటో ఇచ్చి అందులో ఉన్న అమ్మాయి తన అందంతో మగ వాళ్ళను ఆకర్షించి, చేతికి చిక్కినంత దోచుకోవడమో, బ్లాక్ మెయిల్ చేయడమో , చీటింగ్ చేయడమో చేస్తుంది. అందుకే పై నున్న అందాన్ని చూడకండి, అంతః సౌందర్యాన్ని చూడండి. అంటూ ఇంత వరకు ఆమె బారిన పడిన వాళ్ళ లిస్టు ఇచ్చారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు తాను బస్ లో చూసిన అమ్మాయి. అవాక్కయ్యాడు. అతనికి ఆరోజు కొటేషన్ గుర్తొచ్చింది.    

  ఎదో అనుమానం తో  ఇక ఆగలేక అర్జంట్ గా అనాధశ్రమానికి వెళ్ళాడు. ఆ పేపర్ చూపించాడు. చీకట్లో బాణం వేసినట్లు వాళ్ళు , అరె... ఆమెను త్వరగానే గుర్తుపట్టారే...అన్నారు. అతనికి అర్ధమయ్యింది. భాస్కర్ ఇంటికి వెళ్ళాడు. గెట్ తీస్తుంటే    బయట చెట్లకున్న పూలు  కోస్తూ ,’తెలవారదేమో స్వామీ ...నీ తలపుల మునకలో తడిచిన దేవేరి అలివేలు మంగ కూ....’ అంటూ పాడుతోంది ఒక అమ్మాయి. అందులోని లాలిత్యానికి అలాగే నిలబడి పోయాడు. గుమ్మం లోనుండి చూసిన భాస్కర్, ‘అరె...ఎప్పుడోచ్చావురా... రా లోపలకు...’ అనగానే లోనకోచ్చ్చాడు. ఆ శబ్దానికి తల తిప్పిన ఆమె అతన్ని చూడగానే గిరుక్కున వెనుతిరిగి పక్క పోర్షన్ లో కేల్లిపోతుంటే, ‘ఏమండీ మిమ్మల్నే’, అంటూ పిలిచాడు. ఇక తప్పదన్నట్లు చూసింది ఆమె. ఆమె మరెవరో కాదు సాయి త్రైలోక్య.

‘ఆమెసాయి త్రైలోక్య... మా పక్క పోర్షన్ లోనే ఉంటుంది. అతను సిద్దార్ద..’ పరస్పర పరిచయం చేసాడు భాస్కర్ తడబడుతూ.

ఆమె మౌనంగా నమస్కరించింది.

‘ఏమండీ... మీరు నన్ను గుర్తు పట్టే ఉంటారు... గుర్తు పట్టడమేమిటీ... వెంబడిస్తుంటేనూ....’ ఆర్యోక్తిలో అతను ఆగిపోగానే అతనికి అంతా తెలిసి పోయిందని ఆమెకు అర్ధమై పోయింది.

‘సారీ...’ అంది చేతులు జోడిస్తూ.

‘అది నేను చెప్పాలి.... రియల్లీ అయాం వెరీ వెరీ సారీ.... సూటిగా విషయం లోకి వస్తాను ..మీరు దయతలిస్తే మనం పెళ్లి చేసుకుందాం...’

‘అంటే పెళ్లి చూపులపేరుతొ , అలా చూడగానే అంతా అర్ధమైనట్లు ,’ నచ్చలేదు’ అంటే ఎదుటి మనసు ఎంత బాధ పడుతుందో ఆలోచించారా....నా అహం దెబ్బతింది... మీరు నచ్చా రనగానే ఒప్పుకోవడానికి , మాకూ ఇష్టా ఇష్టాలుంటాయి కదా....’స్పష్టంగా అంది.

‘మీ కోసం ఈ జన్మంతా వేచి ఉంటాను. అందుకే సారీ అన్నాను. నా గర్వానికి అదో గుణపాఠం..క్షమిస్తారు కదూ....అయినా సర్ ప్రైజ్ గా అన్ని పనులు చేసి ఇప్పుడు ఇలా ఉడికించడం బావ్యమా...’ఒకే’ అంటే ఒక్క సారి నవ్వండి లేదంటే నాకోసం నవ్వే మీ కోసం ఈ జీవిత కాలం ఎదురుచూస్తూంటాను...’

ఆమె అందంగా నవ్వింది. అతనికి అంత పొద్దుటే వెన్నెల జల్లు కురిసినట్లనిపించింది.

భాస్కర్ ‘అవునురా.... తనలోని సేవా గుణం చూసే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ లా ఉంటారని నేను నీకు చెప్పాను. తర్వాత నీ విషయాలు,అలవాట్లు రోజూ చెబుతూ వచ్చా... తను, తను చేసే పనులకు అవి సహాయ పడతాయని నన్ను నీకు చెప్పొద్దని అంది.... సారీరా....’

‘మరి ఫైన్ గా పెళ్లి చేసేయ్ మరి ‘ అన్నాడు సిద్దార్ధ. ఆమె సిగ్గుల మొగ్గయింది.

చల్లగాలి చల్లగా ఇద్దర్నీ సృశిస్తూ దీవించింది. దూరంగా గుళ్ళోని జే గంటలు మంగళ కరంగా మోగాయి.

*****Rate this content
Log in

Similar telugu story from Romance