sujana namani

Inspirational

4.5  

sujana namani

Inspirational

కర్తవ్యమ్

కర్తవ్యమ్

3 mins
641


                                   

      సాహితికి   పెళ్లయి అప్పటికి వారం రోజులు .... పెళ్లి కాగానే అప్పగింతల తర్వాత అత్తగారింట్లో అడుగు పెట్టింది. తర్వాత రిసెప్షన్ , నల్లపూసలు కుచ్చడం, కులదైవం అయిన వేముల వాడకు వెళ్లి ఒక రోజు అక్కడ నిద్ర చేసిరావడం ఇలా అన్నీ అయి శోభానానికి  ముహూర్తం చూసి చూసేసరికి వారం అయింది. ఇక ఇన్ని రోజులు భర్త ఎస్ ఐ అయిన అభినవ్ కొంటె చూపులు, ఎవరూ లేనిది చూసి చేసే కొంటె చేష్టలు సాహితికి ఎంతో ఆనందాన్ని కల్గిస్తున్నాయి. ఇక ఇద్దరూ ఆత్రంగా ఎదురుచూసే మొదటి రాత్రి రానే వచ్చింది. అయితే అందరూ అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదని, ఎవ్వరూ ఊహించని విధంగా, ఎ చరిత్ర లో లేని విధంగా తమ మొదటి రాత్రి ఉండబోతోన్న విషయం ఆమె కల నైనా ఊహించలేదు.

  ఆరోజు అమ్మలక్కలు అంతా చిన్నపిల్లలు రాకుండా తలుపులు బిగించి సాయంత్రం శోభనానికి ముందు ఆకులు వక్కలు అందించుకునే పేరుతొ ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చో బెట్టి పూబంతులాట ఆడిపించడం ఆతర్వాత తాంబూలం ఒకరి నోటిలో పెట్టి మరొకరిని చేతులు వెనక్కి పెట్టి నోటితో అందుకోమనడం , కాజూ మధ్యలో పెట్టి అందుకోమనడం లాంటి సరసమైన ఆటలు ఆడించి, ఒడిలో పండ్లు నింపి కొత్త చీరతో  పూలతో సింగారించారు. ఇద్దరిలో మన్మధుడు పూల బాణాలు వేశాడా అన్నట్లు ఉత్సాహం, కోరిక పురి విప్పి నాట్యం చేస్తోంది. 

     పూలతో అలంకరించిన పందిరి మంచం , పక్కనే స్వీట్లు, పండ్లు పెట్టిన ప్లేట్లతో గది నిండా సుగంధ ద్రవ్యాల సువాసనలతో మత్తుగా ఉంది. ఎప్పుడెప్పుడా     అని ఎదురుచూసిన ఆ మొదటి రాత్రి ఏమేమో చేయాలని టెన్షన్ గా గదిలో ఎదురు చూస్తున్నాడు అభినవ్. అలంకరించుకున్న నగలతో, పట్టుచీరతో తల నిండా పూలతో పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి అడుగుపెట్టింది సాహితి.

   దగ్గర కెళ్ళి గ్లాస్ తీసి పక్కన పట్టి ఆమె చేయి పట్టి మంచం వరకు నడిపించాడు. పక్కన కూర్చో బెట్టుకుని జన్మ జన్మలకు విడలేననన్నట్లు తమకంగా చేయిని గట్టిగా బిగించాడు. ఆమెకు ఆ అపరిచిత స్పర్శ హాయిగా కొత్తగా ఉంది.

‘సాహితీ.... నీకు తెల్సు కదా నా ఉద్యోగం... ఎప్పుడు ఎ క్షణం వెళ్ళాల్సి వస్తుందో తెలియదు .. ‘ అన్నాడు.

‘నాకు తెలుసు ‘అన్నట్లు తల ఆడించింది ఆమె.

‘రిస్క్ కూడా ఎక్కువే ‘ అన్నాడు .

‘నాకు తెల్సు ..తెలియకుండానే చేసుకుంటానా ..... దేశానికి సేవ చేసే వారంటే నాకు చాలా ఇష్టం.... అందుకే ఏరి కోరి చేసుకున్నాను... మీ అంకిత బావం నాకు బాగా నచ్చింది .... ఇదే చెప్పాలనుకున్నారా’ అంటున్న ఆమె గొంతులో ఇంకా తాత్సారం ఎందుకు అన్న బావం లీల గా ధ్వనింప గా , ఆర్తిగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ఆమె ఆ వెచ్చని పరిష్వంగానికి మై మరిచి పోయింది.

 ఇద్దరిలో సెగలు రగులు తున్నాయి. సరిగ్గా అప్పుడు మోగింది పక్క టేబిల్ పై నున్న అతని సెల్ ఫోన్...

 అయిష్టంగానే ఒక చేత్తో ఆమెను పొద వుకుంటూనే మరో చేత్తో అందుకున్నాడు.... హై కమాండ్ నుండి ....ఈ వేళప్పుడు .... మనసు కీడు శంకించింది. బృకిటి ముడిచి ఎత్తాడు.

  అటువైపు మాటలు వింటూనే భార్య ను చుట్టి ఉన్న చేయి ని వదిలేసి , ఆమె నుండి దూరం జరిగి లేచాడు.

‘నమస్తే సర్... ఔనా.... నిజమా.... ఓ మై గాడ్ .. ఎంత దారుణం.... నేను ఇప్పుడే బయల్దేరుతాను సర్... ....’ అంటూ పెట్టేసాడు .

దిగ్గున లేచింది సాహితి.

‘ఏ మయ్యిందండి?’

‘సారీ... సాహితీ.....నన్ను క్షమించు..... నా ఫ్రెండ్..మొన్న మన పెళ్ళికి వచ్చి గ్రీటింగ్స్ చెప్పిన మనోహర్... .. మందు పాతర పేల్చిన సంఘటన లో ప్రాణాలు కోల్పోయాడట ... రెండు జీపుల్లోని వాళ్ళు కూంబింగ్ కి వెళితే రెండు జీపులు పెల్చేసారట ..... నేను లీవులో ఉన్నా అత్యవసరంగా బయల్దేరమన్నారు. మరో గంటలో ట్రైన్ ఉంది.... వాడు ఇంకా నా కళ్ళ ముందు కదలాడు తున్నాడు. మొన్ననే పెళ్ళయ్యింది. వదినను తీసుకుని రా ... నేనూ మా ఆవిడను తెస్తున్నా... రెండు రోజుల ట్రిప్ వేద్దాం.... అన్నాడు... ఇప్పుడు ఒక్కడే శాశ్వతమైన ట్రిప్ పై వెళ్లి పోయాడు...  నేను ఇంకా నమ్మ లేకపోతున్నాను. అసలు వాళ్ళని ఎవరు ఎలా ఒదార్చగలరు... సారీ.. సాహితీ... మా జీవితాలు ఇలాగే ఉంటాయి.... నాకు నా డ్యూటీ నే మొదటి భార్య ..నన్ను క్షమించు....’

 స్థాణువులా నిలబడి పోయింది. సాహితి.

గుమ్మం వరకు వెళ్ళిన అతను ఒక్క క్షణం ఆగాడు. ‘ఇలా అంటున్నానని మరేం అనుకోకు సాహితీ... మరోసారి నువ్వు ఆలోచించుకో .....’ ఇంకా అనబోతున్న అతని దగ్గరకు వెళ్లి తన చేయి అతని నోటికి అడ్డం పెట్టింది . అతని హృదయానికి కరుచుకుపోయింది ఏడుస్తూ. అందులోనే అతనికి సమాధానం దొరికినట్లు ఆమె తల నిమురుతూ ఉండి పోయాడు.

  అలా సాహితికి మొదటి రాత్రి ఒంటరిగా నిద్రలేకుండా గడిచిపోయింది. అతనికి మొదటి రాత్రి ఒంటరిగానే ట్రైన్ లో గడిచింది.

  వారం తర్వాత మందు పాతర పేల్చిన వారిని పట్టుకుని తన ఫ్రెండ్ ఆత్మకు శాంతి చేకూర్చిన , ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశానికి పేరు తెచ్చిన అభినవ్ ని ప్రభుత్వం పతకం తో సన్మానించింది. ఆరోజు సభా ముఖంగా అభినవ్ తనకు సహకారాన్ని అందించిన భార్యకు కృతఙ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత వారి తోలి రాత్రి జీవితాంతం గుర్తుండేలా మధురంగా గడిచింది .

 ***************   


 
Rate this content
Log in

Similar telugu story from Inspirational