sujana namani

Drama

4.0  

sujana namani

Drama

పరిష్కారం

పరిష్కారం

5 mins
781


                       


 మనస్సంతా ఇది అని తెలియని బాదగా ఉంది లక్ష్మి కి ,వెలితిగా ఉంది,గుబులుగా ఉంది ఏదో అసంతృప్తి ,అభద్రతాభావం ..మరో ఇరవై రోజుల్లో సంక్రాంతి పండగ ఉండటంతో వూరువూరంతా సందడిగా ఉంది. కానీ తన మనస్సు నిండా చింత.తర్వాత సంవత్సరానికి ఈ సంక్రాంతి ఎలా ఉంటుందో ...అప్పుడు అత్త మామలతో కలిసి జరుపుకుంటుందేమో...అప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ బయటకొస్తాడు కానీ చూడడానికి వాళ్ళ నాన్న ఉండడు..మళ్ళీ ఎన్ని సంవత్సరాలో .. ఆయనకు ఇది విదేశాలకు మొదటి ప్రయాణం.... ...ఆలోచనల్లో ఉండగానే పక్కింటి శారదమ్మ వచ్చింది ‘లక్ష్మి’అంటూ.      

          ‘ఏంటి పిన్ని’ చేతులమీది పని వదిలేసి వచ్చింది,ముందున్న వరండా లోకి.

   ‘మరే ...మొన్న నువ్వు, మా ఇంట్లో మా అమ్మాయికి శ్రీమంతానికి ఫలహారాలు చేశావు కదా.. చాలా చాలా బావున్నాయని శ్రీమంతానికి వచ్చిన మన వీధి లోని వాళ్ళు,చుట్టాలు అంతా మెచ్చుకున్నారు. నేను తీరా తయారుచేసే సమయానికి జ్వరం తో లేవలేక పోవడం తో , నా బాద చూడలేక నువ్వు, మీ అత్త కలిసి చేశారు. ఇప్పుడు అందరూ పండగొస్తోంది కదా నువ్వేమైనా తయారు చేసి ఇస్తావా అని అడుగుతున్నారు, బయట అలా చేసి ఇస్తే ఎంత డబ్బు లిస్తారో అంతా కన్నా పది ఎక్కువే ఇస్తామన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆ పాచి పనేమ్ చేస్తావు... నీకు ఇప్పుడు డబ్బులు కూడా బాగా అవసరం కదా...కొందరు విదేశాల్లోని వారి పిల్లలకు కూడా పంపిస్తారట....ఏమంటావు...’

      ఆరోజు శారదమ్మకు బాగా జ్వరంగా ఉంటే తాను ధైర్యం చెప్పి పిండి పట్టడం దగ్గర్నుంచి అన్నీ తామే చేశారు. వీళ్ళింటి తో పాటు మరో రెండు ఇళ్ళల్లో అంట్లు తోమడం వూడవడం లాంటివి చేస్తుంది. అందరికన్నా శారదమ్మకు మాత్రమే తమ ఇంటి

విషయాలు తెలియడం తో ఏ సహాయం కావాలన్న చేస్తుంది, తన మంచి కోసం ఆత్మీయురాలిలా ఆలోచిస్తుంది...అందుకే అలా తయారు చేసినందుకు డబ్బులు వద్దన్నా బలవంతాన చేతిలో పెట్టింది. ఆవిడ అన్నట్లు ఇప్పుడు డబ్బుల అవసరం కూడా బాగా ఉంది పూట గడవడమే కష్టం గా ఉందంటే, భర్త పని కూడా పోయింది. పెళ్లి అయి రెండు సంవత్సరాలు. మామ పక్షవాతం వచ్చి మంచం లోనే ఉంటాడు. మందులు వాడు తున్నారు అత్త మామను చూసుకోవాలి కాబట్టి ఇంట్లో పని చేస్తూ తను బయట పని చేయడానికి సహాయపడుతుంది.భర్తకు తమ కులవృత్తి మగ్గం పని తప్పితే మరోది రాదు. కానీ చేనేత అమ్మకం లేక మగ్గం యజమాని గడవటం లేదని ఉరేసుకోవడం తో కనీసం అరకొర వచ్చే డబ్బులు కూడా రాక వీధిపాలయ్యింది బ్రతుకు. ఒకరోజు జామపండ్లు కొని వీధి వీధి తిరిగి అమ్మాడు కానీ అది కూడా అనుభవం లేక తిరగ లేక తిరిగినా ధర గిట్టుబాకు కాక మానేశాడు. తర్వాత 4 రోజులు కూలి పనికి పోయాడు కానీ అలవాటు లేని పని అయ్యేసరికి 4 రోజులు చేయగానే వారం రోజులు మంచాన పడ్డాడు. తానే ఇక మనకా కూలి పని ఎమోద్దంటూ బలవంతాన మాన్పించింది. మళ్ళీ సమస్య మొదటి కొచ్చింది. ఈ లోగా భర్త శంకర్ స్నేహితుడోకరు బజార్లో కలిసి ,’ ఒక సారి దుబాయి వెళ్ళి బాగా సంపాదించుకుని వచ్చి ఇక్కడుంటే సుఖం కదా, నువ్వు దుబాయి వెళ్లరా మన ఫ్రెండ్ రమేశ్ కూడా అలాగే వెళ్ళాడు’ అనడం, దానికి తోడు దళారి ఒకతను పంపించే ఏర్పాట్లన్నీ చూస్తానని ఒక లక్ష ఉంటే వెళ్లొచ్చు అన్నాడు. తమ దగ్గర అంతా డబ్బు లేదని వూర్కున్నాడు, కానీ అతనే మళ్ళీ వచ్చి ఒక లక్ష ఖర్చు చేస్తే, అక్కడి కెళ్ళాక ఇంతకు పదింతలు సంపాదించుకోవచ్చు అని అనడం తో భార్య మెడలోని మంగళసూత్రం అమ్మి , మరికొంత అప్పు చేసి అన్నీ సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పుడీ పనికి ఒప్పుకుంటే ఎంతలేదన్నా కనీసం పండగ సీజన్ లో పది వేలన్నా వస్తుంది.ఎంతకంతే  ఆసరా. డబ్బు సంపాదించే అవకాశం దానంతట అదే తనను వెదుక్కుంటూ వచ్చిందని,  సరేనంది.

       విదేశాలకు పంపించే వాళ్ళు 15 రోజుల ముందర నే చేయించుకుంటున్నారు. అలా పండగ వరకు క్షణం ఖాళీ లేకుండా చేసింది. ఇంటిపని అంతా అత్త చూస్తే, శంకర్ పూర్తిగా ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఎవరు ఆర్డర్ ఇచ్చినా వారే బియ్యం, ఆయిల్,పప్పు ఉప్పు లన్నింటికి డబ్బులు ఇచ్చేవారు. చేసినందుకు కేజీ కి ఇంత అని ఇచ్చేవారు. ఆ డబ్బులు భర్త చేతి ఖర్చులకని ఇచ్చింది.

    భర్త వెళ్ళే రోజు మరీ 15 రోజుల్లోకి వచ్చేసింది. ఆరోజు లక్ష్మి ఎదురింట్లో అంట్లు తోముతుంటే , ‘లక్ష్మి ఇది విన్నావా...’ అంటూ వచ్చింది శారద హడావుడిగా.

    ‘ఏంటి పిన్ని...’ అంది

  ‘మరే దుబాయి వెళ్ళిన రమేష్ లేడు.....’

  ‘ఎందుకు లేడు..పక్క వీధిలోనే గా ఉండేది. మా ఆయన  ఫ్రెండ్ కూడా ..’

   ‘మరే అతను నిన్న చనిపోయాడట. ఇంకా శవం అక్కడే ఉందట. ప్రభుత్వం ఇక్కడకు తీసుకురావాలని వీళ్ళు అడుగుతున్నారట.’

 ‘అయ్యో ........ఎలా...ఎలా చనిపోయాడట...’

 ‘ ఏమో పూర్తి వివరాలు తెలీవు.. వెళ్ళి వద్దామా...శంకర్ ఉంటే ఆయన్ని కూడా రమ్మను.’

  ‘ ఆయన కూడా వస్తాడు పిన్ని...’ అంటూ గబ గబా అన్నీ కడిగేసి ఇంటికొచ్చి భర్తకు విషయం చెప్పింది. శంకర్ నిర్ఘాంత పోయాడు.

   అంతా వెళ్లారు. అక్కడ అతని భార్య ఏడుపు హృదయవిదారకంగా ఉంది. వారి రెండు సంవత్సరాల అబ్బాయి బిక్కు బిక్కు మంటూ చూస్తున్నాడు. వాడు కడుపులో ఉండగానే వెళ్ళాడట. కనీసం కొడుకును కూడా చూసుకోలేదుట. వెళ్ళేప్పుడు 50 వేలు అప్పు

చేశాడట. ఇప్పటివరకు అతను పంపించిన డబ్బులు కేవలం ఆ వడ్డీ, అప్పు తీర్చడానికే

 సరిపోయాయట. అక్కడ పరిస్టీతి ఘోరంగా ఉందట. ఉండడానికి సరైన నివాసం లేక, తిండి సరిగ్గా లేక పని లేక చాలా అష్ట కష్టాలు పడ్డాడట. అప్పు చేసి పోయి ఏ ముఖం పెట్టుకు రావాలని బాదపడి ఆత్మహత్య చేసుకోబోయాదట. ఫ్రెండ్స్ కాపాడి ధైర్యం చెబితే రావడానికి వీసా గడువు తీరిపోయి వచ్చేందుకు డబ్బుల్లేక చివరకు జ్వరం బారిన పడి తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడట. 

         కనీసం తండ్రి ముఖం కూడా తెలియని కొడుకును పట్టుకుని , ‘ నువ్వు నాన్నను చూడడానికి కూడా నోచుకోకపోతివిరా...నా కడుపున ఎందుకు పుట్టావురా.....ఇరవై ఏళ్లకే నా రాత ఇలా రాశాడా దేవుడు...’ అని తల కొట్టుకుంటూ భార్య , ‘కొదుకా... ముప్పై ఏళ్లకే నూరేళ్ళు నిండాయాకోడుకా...మాకు తలకొరివి పెడతావనుకుంటే నీకే పెట్టించుకుంటున్నావ ..కొడుక...'.నేను సంపాయించుకొచ్చి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి సూసుకుంటాన్నన్నవు కొడుకా…’ అని తల్లితండ్రులు ఏడుస్తుంటే గుండెలు ఆవిసిపోతున్నాయి...వాళ్ళ ఏడుపులు హృదయవిదారకంగా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే అక్కడి నుండి శవం ఇక్కడికి రావడానికి పడే పాట్లు ఒక ఎత్తు. ఎవరూ పట్టించుకోరు. అక్కడ అతనితో పాటు వెళ్ళిన మిగతావాళ్లే అధికారులను బ్రతిమిలాడి   ప్రభుత్వానికి మీడియాకు సమాచారమిచ్చి వచ్చే ఏర్పాట్లు చేయిస్తున్నారట. ఎప్పటికీ వస్తుందో తెలియదు. అక్కడే అనాధశవం లాగా కాలిస్తే కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోరు.

    ఇక అక్కడ ఉండలేక పోయింది లక్ష్మి. చల్లా చెమటలు వచ్చి కళ్ళు తిరిగినట్లయి కూలబడిపోయింది. ఇది చూసి మల్లేశ్ ఆమెను మెల్లగా లేవదీసుకుని శారదమ్మకు చెప్పి ఇంటికి తీసుకొచ్చి పడుకో బెట్టాడు. ఒక గంటకు కొంచెం తెప్పరిల్లింది. అప్పటికే అతను రాత్రికి కావాల్సిన వంట చేసేశాడు. తల్లి తండ్రి 7 గంటలవరకే కొడుకు వండింది తిని పడుకున్నారు. మగతగా కళ్ళు మూసుకుని పడుకున్న లక్ష్మి మంచం పక్క కూర్చున్నాడు మల్లేశ్. కళ్లువిప్పింది ఆమె.

    కళ్ళు తెరిచిన ఆమె కళ్ళల్లో కోటి ప్రశ్నలు కనబడ్డాయి అతనికి. రేపటి తన భావితవ్యాన్ని అక్కడ ఈరోజే అద్దం లో చూసినట్లనిపించింది. విదేశాలకు వెళ్ళే తన ఈ మొదటి ప్రయాణం , చివరి ప్రయాణం అవుతుందా .... ఈ రోజు పేపర్లో ఈ వార్తా తో పాటు దళారులు ఎలా మోసం చేస్తున్నారు , విదేశాల్లోకి పంపి ఎలా చేతులు దులుపుకుంటున్నారు,అక్కడ కార్మికుల వెతలు వీసా గడువు తీరి తిరిగిరాలేక అక్కడ ఉండలేఖ పడే నరక యాతన అంతా కల్ల్కు కట్టినట్లు రాశారు. అదంతా చదివాపాక కూడా మమ్మల్ని అలా వదిలి వెళతావా అంటూ లక్ష్మి నే కాదు ఆమె కడుపు లోని బిడ్డ కూడా తనని అనాధని చేస్తావా అని ప్రశ్నిస్తున్నాట్లనిపించింది. ఇతర ప్రభుత్వాలు ఇలా వెళ్ళిన తమ దేశం ప్రజల కోసం సహాయం చేస్తున్నారా’ ఎవరో అన్నారు

     ఆమె తన ఆరచేయిని అతని వైపు చాపిందీ ‘ మిమ్మల్ని ఇప్పటి వరకు పన్నెత్తి ఒక కోరిక అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్న.. నాకు మాటియ్యి. కాలొ గంజో ఇక్కడ కలిసి కష్టం చేసుకుని ఉందాం, కాని అక్కడకు వెళ్లకయ్య... ఇప్పుడు మనం చేసే ఈ పిండి వంటల తయారీ మంచి లాభసాటిగానే ఉంది. అయితే ఇది ఎప్పటికీ ఉండదుకదా అని నువ్వంటున్నావు . ఇవ్వాళే శారద పిన్ని చెప్పింది ఇయాల్రెపు  విదేశాలకు ఎగుమతి చేయడానికి, ఉధ్యోగాలు చేసుకునే వాళ్ళు టైము లేక అందరూ ఇలా తయారుచేసినవాటినే కొనుక్కుంటున్నారట . పచ్చళ్ళూ . వడియాలు ఇలా అన్నింటి కి గిరాకీ బాగా ఉందట. శారద పిన్ని బందువులకిలాంటి దుఖానమ్ ఉందట. అక్కడికి తయారుచేసి ఇచ్చే వాళ్ళిద్దరూ ఇటీవలే వాళ్ళ వూరు వెళ్లిపోయారట . ఆయన తనకిపుడు ఇలా తయారు చేసే వాళ్ళు కావాలన్నాడటా. డబ్బులు కూడా బాగానే ఇస్తారట . ‘ నీ చేతిలో మంచి నైపుణ్యం ఉంది. ఆయన అమ్మకం చూసుకుంటూ నీకు సహాయం చేస్తాడు. ఇంత చిన్నవయస్సులో నిన్ను వదిలి అంతా దూరం వెళ్ళడం మంచిదా.. కావాలంటే ఇంకా వేరే అప్పడా లు వడియాలు చేయవచ్చు.   దాంట్లో చాలా ఆదాయం ఉంటుంది. మీకు చేతకాకపోతే ఎక్కువ ఆర్డర్స్ వస్తే మీరే మరొకరినేవరినైనా చేతికిందికి పనికి పెట్టుకోవచ్చు. మీ మంచి కోరి చెబుతున్నా..ఒక్కసారి ఆలోచించు....పరుగెత్తి పాలు తాగేకన్న నిలుచుంది నీళ్ళు తాగడం మంచిది.’ అని అందండి..నాకు మీరు వెళుతున్నారంటే భయం భయం గా ఉంది. నిన్ను విడిచి ఉండలేను..వెల్లనని మాటివ్వు...’ లక్ష్మి చేతిలో మారుమాట్లాడకుండా చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. కన్నీళ్లు చిప్పిల్లిన ఆమె కళ్ళల్లో కోటి సూర్య కాంతుల వెలుగు లీనమై కనిపించిందత నికి.

   అలా విదేశానికి వెళ్ళాలనుకున్న మొదటి ప్రయాణం ఆగిపోయింది. కాని అది సంతోషాన్నే నింపింది.

                                                                  ************** .  Rate this content
Log in

Similar telugu story from Drama