STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama Fantasy

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama Fantasy

అమ్మదిగో

అమ్మదిగో

1 min
350


 నాలుగేళ్ళ నానీకి ఆడుకోడానికి బొమ్మలెన్నున్నా... తనని ఎత్తుకుని ఆడించే బొమ్మలాంటి అమ్మ మాత్రం కనిపించలేదు. అలా కనిపించి పదకొండు దినాలైపోయింది. నిద్రపోతున్న అమ్మను కర్రల మీద పడుకోబెట్టి అందరూ అలా ఎందుకు ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారో అర్థం కాలేదు ఆ చిన్నారి మనసుకి. అదే ఆఖరిసారి చూడ్డం అమ్మని.మళ్లీ కనిపించనే లేదు. ఎప్పుడూ ఏడవని నాన్న తనని దగ్గరకు తీసుకుని మరీ గుండెలవిసేలా ఎందుకేడుస్తున్నాడో మాత్రం ఆ చిన్ని గుండెకు భారంగానే వున్నా... మళ్లీ అమ్మని చూడాలనే కోరికతో మాత్రం మనసు కొట్టుకుంటూనే ఉంది.

    

    అమ్మ తర్వాత నాన్నేగా...తనతో సన్నిహితంగా మెలిగేది. ఆ చిట్టితండ్రికి సేద తీరాలనిపించి...తండ్రి దగ్గరకెళ్ళి మెడ చుట్టూ చేతులువేసి చుట్టేస్తూ...ముఖాన్ని భుజంపై వాల్చుకున్నాడు. కొడుకు అమ్మపై బెంగపడ్డాడని తెలుస్తూనే ఉంది తండ్రికి. నేనే ఇకపై వీడికి అమ్మైనా నాన్నైనా అనుకుంటూ...పిల్లాడిని మరింతగా హత్తుకున్నాడు. అప్పుడే మళ్లీ నోరువిప్పాడు ఆ పసివాడు .

    

    "నాన్నా...అమ్మేది..? "మనసులోని దిగులు కళ్ళల్లోకి కొట్టుకొచ్చింది ... కన్నీటితో కప్పేస్తూ...!

   

    ఈ లోకాన్ని విడిచెళ్ళిపోయిన భార్యను తలుచుకుంటూ...వాడికి వాడమ్మ గురించి ఎలా చెప్పాలో తెలియలేదు. కొడుకు వీపు నిమురుతూ.... కనిపించనీయకుండా కళ్ళు తుడుచుకున్నాడు. 

   

    ఆ చిన్నారి మనసులో ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది..!

 ఇంటికెవరెవరో వచ్చి...తన తండ్రిని ఊరుకోబెడుతూ... ఏంటో మాట్లాడుతూ ఉంటే ...పెద్ద పెద్ద కళ్ళతో చూసాడు తప్పించి...అంతకు మించి ఊహకు రాని వయసది. కొంతమంది అయితే తనకు బిస్కెట్స్, చాక్లేట్స్ , బొమ్మలు తెచ్చి ఇస్తున్నా...అవేమీ అమ్మను మరిపించలేకపోయాయి. ఆ చిట్టిగుండెలో ఎంతగా పేరుకుపోయిందో విషాదం..?

    

   ఇంటినిండా జనంతో...అందరూ బువ్వలు తింటుంటే...తనకు బువ్వ తినిపించే అమ్మ రూపం... అక్కడున్నమ్మల్లో వెతుక్కుంటున్నాడు. వాడి వెతుకులాటంతా తన తల్లికోసమే అని అర్థం చేసుకున్న వారందరికీ గుండె ద్రవించిపోయింది. వాడినేదో మభ్యపెట్టి మరిపించాలి గనుక...లాలనగా వాడిని చంకనేసుకుని బుజ్జగిస్తూ..."ఒరేయ్ కన్నా...నీకో మాట చెప్పనా...? అమ్మ కావాలా నీకు..? అమ్మ ఎక్కడికీ పోలేదు కన్నా... నువ్వు పెద్దయ్యాకా ఏమవుతావు అని అడిగితే... స్పైడర్ మాన్ అవుతానంటూ పైకి కిందకీ దూకుతున్నావు కదా...అలా ద

ూకుతూ ఉంటే నీకు దెబ్బలు తగులుతాయని చెప్పి...నిజంగానే నిన్ను స్పైడర్ మాన్ లా చేసేయమని పైనున్న ఆ దేవుడ్ని అడగడానికి వెళ్లింది. మరి అమ్మ అక్కడకి వెళ్ళినప్పుడు దేవుడికి దణ్ణం పెట్టాలి, పాటలు పాడాలి కదా. అందుకే అమ్మ ఇంక ఇక్కడికి రాదు కన్నా..." అంటూ...చేతనైన రీతిలో చిన్న కథనల్లి ఆ చిన్నారి మనసుకి అర్థమయ్యేట్టు చెప్పింది వాడి అమ్మమ్మ.

    

    ఆ చిన్నారికి అప్పటికి కొంచెం అర్థమైనట్టు ఉంది. ఇక తన తల్లి కనిపించదన్న నిజం జీర్ణించుకోలేక...ఉబికి వస్తున్న కన్నీటితో....ఓ మూలకు వెళ్లి కూర్చున్నాడు.

    

   పదకొండవరోజు జరగాల్సిన పిండ కార్యక్రమాలు అన్నీ అయిపోయాకా ...పొద్దుగూకితే బంధువులేవరూ ఆఇంట వుండకూడదన్నట్టు భోజనాలు అయ్యాకా వచ్చినవాళ్ళంతా ఒక్కొక్కరూ ఎవరి ఇళ్లకు వారు బయలుదేరారు. ఇక ఆఇంట మిగిలింది తనతండ్రితో పాటూ ఆ చిన్నారి నానీ మాత్రమే.


  హఠాత్తుగా బయటపడిన కాన్సర్ జబ్బుతో ...భార్యను పోగొట్టుకున్న శ్రీధర్ బ్రతుకు ఆ చంటిపిల్లాడితో .... బావురుమంటున్న ఆఇంట్లో అల్లకల్లోలం అయినట్టుగా అనిపించింది. ఆ స్ధితిలో తనను పట్టించుకోని తండ్రిని ధీనంగా చూశాడేతప్ప...మరేమీ పిలవకుండానే...వీధి వరండాలోకి వెళ్లి ఆకాశంలోకి తొంగి చూస్తే....నిండైన జాబిలి నవ్వుతూ పలకరించింది. నానీ కళ్ళల్లో తేజోవంతమైన వెలుగు ఒక్కసారిగా...


   అప్పుడెప్పుడో....అమ్మ చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించడం బాగా గుర్తుంది తనకు. 

 

చందమామ రావే...

జాబిల్లి రావే...

బండెక్కిరావే...

కోటిపూలు తేవే...

అన్నీ తెచ్చి మా అబ్బాయికివ్వే...!! 

    

   అలా తీయగా పాడుతూ...బువ్వలోని రుచిని ఎంతబాగా చూపించేదో...? మనల్ని కూడా అక్కడకు తీసుకెళ్తుంది వెన్నెల్లో ఆడుకుందామా ...?" అంటూ తన కళ్ళకు ఊహాప్రపంచాన్ని చూపించిన అమ్మ - ఇప్పుడక్కడికే వెళ్ళి ఉంటుందన్న గట్టి నమ్మకం బలపడిపోయింది ఆ చిన్ని హృదయంలో. అలా అనిపించిందే తడవుగా...రివ్వున లోనికి పరుగెట్టాడు. తానెప్పుడూ స్పైడర్ మాన్ వేషం వేసుకున్నట్టే..గాగుల్స్ పెట్టి ...వెనుక వైపు మెడ నుంచి కిందకి వేలాడేటట్టు ఒక తువ్వాలుని కట్టాడు. ఎంత వేగంగా లోపలకి వెళ్ళాడో..అంతే వేగంగా బయటకు వచ్చి...చందమామలో తనకు మాత్రమే కనిపిస్తున్న అమ్మను చూస్తూ..."అదిగో అమ్మదిగో " అంటూ...దూరమైన అమ్మ దగ్గరకు స్పైడర్ మాన్ లా ఎగిరిపోవాలన్నట్టు అదే ప్రయత్నంలో వున్నాడు - పాపం ఆ చిన్నారి నాని...!!


Rate this content
Log in

Similar telugu story from Drama