అలనాడు అవంతిక రాజ్యంలో
అలనాడు అవంతిక రాజ్యంలో


పూర్వం అవంతిక రాజ్యాన్ని వివేక వర్ధనుడు అనే రాజు పాలించేవాడు. వివేకవర్ధనుడు కళాభిమాని, కళాపోషకుడు. ముఖ్యంగా సంగీత కళను ఎక్కువగా పోషించేవాడు. అందుకే అతని కొలువుకి ఎక్కువగా సంగీత కళాకారులు వచ్చి తమ సంగీత కళతో అతన్ని మెప్పించి అత్యంత విలువైన కానుకలు పట్టుకొని వెళ్తుండేవారు.
రాజుగారి కళాభిమానం, కళాపోషన గురుంచి తెలుసుకున్న స్వరధారి అనే సంగీత కళాకారుడు, మంచి పాటలు రాసుకొని,వాటికి మంచి సంగీత బాణీలు కట్టి తన బృందంతో సహా రాజుగారి కొలువుకి వచ్చి తన సంగీత కచేరీతో రాజుని మెప్పించి కానుకలు పట్టుకొని వెళ్ళేవాడు.
స్వరధారికి రాజుగారి కొలువులో కచేరి నిత్య కృత్యం అయిపోయింది. రాజు గారు ఇచ్చిన ధనం, కానుకలుతోనే స్వరధారి, రాజుగారి కోటకు దీటుగా ఒక పెద్ద కోటను కట్టించుకోగలిగాడు, అందులో రాజమందిరాల్లో వుండే సకల సౌకర్యాలూ కల్పించుకున్నాడు. నౌకర్లు సేవకులు పనివారుతో అతని కోట కూడా రాజభవంతిని పోలి ఉండేది.
ఒకరోజు రాజుగారి కొలువుకి ఒక ముసలి వాడు వచ్చి తనకు న్యాయం చెయ్యమని కోరాడు. మీకు జరిగిన అన్యాయం చెప్పండి అని రాజు అడగగా స్వరధారి నా శిష్యుడు, అతనికి వచ్చిన సంగీత కళ అంతా నా దగ్గరే నేర్చుకున్నాడు, అతను నాకు స్వయానా కొడుకు, నా సొంత కొడుకు, నా శిష్యుడు అయివుండి నేను నేర్పిన విద్యలు మీ ముందు ప్రదర్శించి, విలువైన కానుకలు పొంది, కోటీశ్వరుడుగా మారిపోయి, నన్నూ, నా భార్యను ఒక పాత ఇంటిలో ఉంచి చాలీ చాలని పూట భత్యాలు మాకు ఇస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అని విలపించాడు ముసలివాడు, స్వరధారి తీరుకి రాజు ఆశ్చర్యపోయాడు, మీకు త్వరలో న్యాయం చేస్తాను వెళ్లి రండి అని ముసలివాన్ని పంపివేసి, వెంటనే తన రహస్య వేగులను పిలిపించి, స్వరధారి గురుంచి సమగ్ర సమాచారం తేవాలని ఆదేశించాడు.
మూడు రోజుల్లో స్వరధారి వివరాలు వచ్చాయి. సంగీత కళలో విశ్వవిఖ్యాతిగాంచిన అతడు మహా స్వార్ధపరుడు, తలిదండ్రులకూ సరిగ్గా పోషించని దుర్మార్గుడు, తన బృంద కళాకారులకు, నౌకర్లకు, సేవకులకు, పనివారికి అతి తక్కువ జీతాలు ఇస్తూ ఎవరైనా నోరుఎత్తి గట్టిగా తనని ఎదిరిస్తే రాజు వివేక వర్ధనుడు వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించి శిక్షలు వేయిస్తాను అని బెదిరిస్తాడు అని తెలిసింది.
రాజుగారు వెంటనే స్వరధారి తండ్రిని పిలిచి నాకు వారం దినాల్లో సంగీతం నేర్పమని కోరాడు. అతడు సంతోషంతో రాజుగారికి వారం రోజుల్లో తనకు తెలిసిన మేలిమి సంగీతాన్ని చక్కగా నేర్పాడు, అందులో తన కొడుకు నేర్చుకోడానికి ఇష్టపడని మీర్జా గాలిబ్ గజల్ ని రాజుగారికి చక్కగా నేర్పాడు.
ఒకరోజు స్వరధారి కచేరీ చేస్తుండగా రాజు మాతో సంగీత కళలో పోటీకి మీరు రాగలరా అని సూటిగా స్వరధారికి సవాల్ విసిరాడు, తానే విశ్వవిఖ్యాత సంగీత కళాకారుడను అన్న పొగరు ఉన్న స్వరధారి రెచ్చిపోయి, రాజా మీరు నన్ను సంగీత కళలో ఓడిస్తే నా ఆస్తినంతా మీకు ధారాదత్తం చేస్తాను అని పందెం వేసాడు.
ఇద్దరి మధ్యా గట్టి పోటీ జరిగింది. చివరకు గాలిబ్ గజల్స్ పాడటంలో రాజుగారిని ఓడించలేక స్వరధారి తలదించుకున్నాడు. రాజు స్వరధారిని తీవ్రంగా మందలించి, తన పుట్టు పూర్వోత్తరాలను వేగులు చేత చెప్పించి, స్వరధారి తండ్రిని, స్వరధారి బృందం, పనివారు,నౌకర్లు, సేవకులు మరియా స్వరధారి బాధితులను పిలిపించి వారిచేత స్వరధారి నిర్వాకం బయట పెట్టించి, ఇకపై వీళ్ళను కంటికి రెప్పలా చూసుకొని సముచిత గౌరవం, న్యాయమైన జీవన భృతి ఇవ్వక పోతే నీ ఆస్తులును స్వాధీనం చేసుకొని నీకు ఉరిశిక్ష వేస్తాను అని బెదిరించి పంపివేశాడు. స్వరధారి బుద్ది తెచ్చుకొని కన్నవారిని తన వెంట ఉన్నవారిని గౌరవంగా చూడటం, సముచిత వేతనాలు, ఉపాధి ఇవ్వడం చెయ్యడం మొదలు పెట్టాడు, రాజు స్వరధారి తండ్రికి తన ఆస్థాన సంగీత కళాకారుడుగా నియమించి గౌరవించి, గౌరవ వేతనం ఇవ్వడం ప్రాంభించాడు. వివేకవర్ధనుడు సార్ధక నామధేయుడు అని అందరూ రాజుని మెచ్చుకున్నారు.