gowthami ch

Drama

4  

gowthami ch

Drama

ఆఖరి ఇల్లు

ఆఖరి ఇల్లు

2 mins
391


సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు , వాకిలి చిమ్మి, కల్లాపు చల్లి, ముగ్గులు పెట్టి ,దేవుడికి పూజ చేసి వంట గదిలోకి వెళ్ళిన మహాలక్ష్మి అప్పటికే స్నానం చేసి అందరికీ టీ , కాఫీ ల కోసం పాలు కాగబెడుతున్న అత్తగారిని చూసి "మీకెందుకు అత్తయ్యా... ఈ పనులన్నీ నేను చూసుకుంటాను కదా మీరు వెళ్లి ప్రశాంతంగా కూర్చోండి నేను కాఫీ చేసి తీసుకొస్తాను" అంది నవ్వుతూ.


"ఏంటోనమ్మాయ్ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నన్ను అస్సలు ఏ పనీ చేయనివ్వడంలేదు. ఇది నాకేమీ నచ్చడం లేదు. మీకు ఈ మధ్యనే కదా పెళ్లయింది కొంత కాలం ఆనందంగా గడపక అప్పుడే ఈ వంట పనులన్నీ ఎందుకు చెప్పు " అంది అత్తగారు హాల్ లోని సోఫాలో కూర్చోంటూ.


"అదేంటి అత్తయ్య గారు అలా అంటారు నేను కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణమే ఈ ఇల్లు నా ఇల్లుగా మీరందరూ నా సొంతవాళ్లుగా మారిపోయారు. అలాంటప్పుడు ఈ పనులన్నీ నేనేగా చేయాలి. " అంటూ చేతిలోని కాఫీ కప్ ని అత్తయ్య కి అందించింది.


"మీ అత్తా కోడళ్ల ముచ్చట్లు అయిపోతే మాకు కూడా కొంచెం కాఫీ ఇవ్వండి ఇంటి యజమానురాలు గారు" అంటూ నవ్వుతూ గదిలో నుండి బయటకి వచ్చాడు మహాలక్ష్మి భర్త మోహనరావు.


"సరేగానీ అమ్మ , నేను నిన్న చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? "అడిగాడు మోహనరావు కాఫీ అందుకుంటూ.


"దేని గురించి నాన్న?...అంటూ ఆశ్చర్యంగా అడిగింది" మోహనరావు అమ్మ కాంతమ్మ.


"అదే అమ్మ ఈ ఇల్లు అమ్మడం గురించి. నాకు ఇక్కడి నుండి ఆఫీస్ కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందుకే ఈ ఇల్లు అమ్మేసి ఆఫీస్ కి దగ్గర్లో ఏదైనా కొందాం అనుకుంటున్నాను అని చెప్పానుగా దాని గురించి. "


"ఓహ్!!...దాని గురించా!!...ఈ ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదురా మోహన్. ఇది కాకుండా వేరే దారి ఏదైనా ఉంటే చూడు." అంటూ ఖచ్చితంగా చెప్పింది కాంతమ్మ.


" ఇంక ఏ దారి లేకనే ఈ నిర్ణయానికి వచ్చాను. నాకు తెలుసు నీకు ఈ ఇల్లు అమ్మడం ఇష్టం లేదని కానీ ఇప్పుడు ఇంక వేరే మార్గం లేక అడుగుతున్నాను. ఆలోచించి చెప్పు"


"ఇందులో ఆలోచించడానికి ఏమి లేదు. ఇది నీకు ఒక సాధారణ ఇల్లులా అనిపించొచ్చు కానీ నాకు అలా కాదు దీని వెనక ఎంతో కష్టం ఉంది. ఒకప్పుడు మీ నాన్నగారు ఈ ఊరిలోనే అత్యంత ధనవంతులలో ఒకరు.


"ప్రతి మనిషికీ కనీస అవసరాలైన తిండి , బట్ట , ఉండడానికి ఒక ఇల్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో

సొంత వాళ్లు , పరాయి వాళ్లు అని కూడా చూడకుండా అందరికీ ఎన్నో చేసాడు. తన సొంత భూములలోనే ఎన్నో ఇల్లు కట్టించి ఎందరికో దానంగా ఇచ్చారు.


"అంత మందికి అన్ని చేసిన మీ నాన్న గారికి వ్యాపారంలో నష్టం వచ్చి డబ్బు అవసరం అయినప్పుడు మాత్రం ఏ ఒక్కడూ చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు సరికదా కనీసం ధైర్యం చెప్పడానికి కూడా ముందుకు రాలేదు. ఉన్న ఇల్లు , ఆస్తి అంతా అమ్మి అప్పులు తీర్చి ఆ నష్టాన్ని అయితే భర్తీ చేసాడు కానీ మీ నాన్నగారిలో ఏదో తెలియని బాధ."


"అందరికీ అన్నీ చేసిన నాకు అవసరమొచ్చి చెయ్యి చాచి అడిగితే ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు" అని ఎంతో కుమిలిపోయారు.


"ఆ బాధలో నుంచి సాధించాలన్న పట్టుదల మొదలై మరలా బాగా కష్టపడి పైసా పైసా కూడబెట్టుకొని నిద్రాహారాలు మాని సంపాదించిన డబ్బుతో ఈ ఇల్లు కట్టించారు. ఇదే ఆయనకోసం ఆయన కట్టుకున్న ఆఖరి ఇల్లు. ఇల్లు అయితే కట్టుకున్నారు కానీ అయిన వాళ్ళు దూరమయ్యారు అనే భాద , మన అనుకున్న వాళ్లే అవసరం తీరగానే శత్రువులుగా మారిపోయారన్న నిజాన్ని తట్టుకోలేక పోయారు చివరికి ఆ దిగులుతోనే ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.


"అందుకే ఆయన అన్ని అవమానాలు పడి కష్టపడి కట్టుకున్న ఆఖరి ఇల్లు అయిన దీన్ని అమ్మడం నాకు ఇష్టంలేదు. "అంది కాంతమ్మ ఏడుస్తూ.


"ఇంత వరకు ఇది నాన్న కట్టించిన ఇల్లు గానే భావించాను తప్ప దీని కోసం నాన్న పడిన కష్టం తెలిసిన తరువాత ఇక ఈ ఇంటిని నేను కూడా అమ్మను అమ్మ." అంటూ తల్లికి మాటిచ్చాడు. 


Rate this content
Log in

Similar telugu story from Drama