శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

4.2  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

7.అదృష్ట జాతకురాలు

7.అదృష్ట జాతకురాలు

2 mins
350



      నాలో నేను . నా అంతరంగంలో ఎన్నో ఆశలు. నేను మావాళ్ళెవరికీ అర్థం కాను. అందుకే ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాను. ఈ నరక కూపం నుంచి ఎలా బయటపడదామని


    అమ్మ నాకు పెళ్లి చేస్తే బావుండునని చూస్తున్నాను. నా వయసు 30 ఏళ్లు. వయసు చేసే తుంటరి కోరికల్ని అదిమి పెడుతూ... నాకు సరి జోడి కోసం ఎన్నో కలలు కంటున్నాను.


    రోజూ కాలేజీకి వెళ్తున్నప్పుడు...బస్టాండ్ లో అల్లరి మూక చేసే హేళన నాకు తప్పడం లేదు. 


    "ఓయ్... భూమికా...! నిన్నే...!


   ఆ పిలుపు విని... అసలే భయంతో నిలబడిన నేను మరింత భయంతో ముడుచుకు పోయాను. 


   "సందెకాడకు నా శ్రీనుగాడి దగ్గరికి వస్తావా..? రవి గాడి దగ్గరికి వస్తావా..? లేక నా దగ్గరికి వస్తావా..? ఎవరు కావాలో త్వరగా ఎంచుకో... ఇంకా ఎన్నాళ్ళు మాకీ విరహం"...? అంటూ నా చెవులకు తాకేలా ఆ మూకలో ఒకడనేసరికి అందరూ గొల్లుమన్నారు...


   అటువంటి మాటలను వినడం నేను పరువంలో కి అడుగుపెట్టినప్పటి నుంచి అలవాటైపోయింది. దాదాపు వాళ్ల ప్రవర్తనకు నేను అలవాటు పడిపోతున్నా నాలో ఎక్కడో బాధ పుడుతూనే ఉంటుంది . ఆ విషయమై నా తల్లి నచ్చజెప్ప పోతుంది. కానీ తల్లితో రాజీ పడలేక నా కళ్ళు తడిబారని రోజంటూ లేదు. 


    "ఐ లవ్ యు..."!

   ఎప్పటిలా వెకిలి పిలుపులు కాక ప్రేమగా పిలిచేసరికి ఆశ్చర్యంగా పక్కకి చూసాను. 


    ఓ అపరిచిత వ్యక్తి చేతిలో కిట్టు తో నా పక్కకు వచ్చి వున్నాడు. 


   " నా పేరు ఆకాష్. మెడికల్ రిప్రజెంటేటివ్ గా జాబ్ చేస్తున్నాను. మీ పేరేంటో తెలియదు . గత నాలుగైదు నెలలుగా ఈ ఊరు క్యాంప్ వచ్చినప్పుడల్లా ఇదే స్థలంలో మిమ్మల్ని చూడడం జరుగుతుంది ఎందుకో మిమ్మల్ని చూసిన క్షణమే నాకు నచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్ద వాళ్లను కలిసి మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకొంటున్నాను". మనసులోనే పెంచుకున్న ప్రేమ భావాన్ని బయట పెట్టాడు అతను.


    నేను చిన్నగా నవ్వి...మౌనంగా అక్కడనుంచి కదిలెళ్లిపోయాను. ఏం చేసినా...బాగా ఆలోచించి చేయాలనుకునే మనస్తత్వం నాది.


   నెల్లాళ్ళు గడిచింది...


   నాతో ఆకాష్ మళ్లీ అదే విషయం చెప్పేసరికి... మనసు కరిగింది...నా మనసు చిగురేయడం మొదలెట్టింది. 


   తన ఇంటికి వచ్చి మాట్లాడతానన్న ఆకాష్ ని వారించాను. "వద్దు వద్దు... మాది సాంప్రదాయమైన కుటుంబం.  ఇటువంటి వివాహాలు మా ఇంటా వంటా లేవు. మనం పెళ్లి చేసుకుంటామని తెలిస్తే మిమ్మల్ని నన్నూ కూడా బ్రతకనీయరు. అందుకే మనం ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం" అని నా అభిప్రాయాన్ని చెప్పాను. 


   నన్ను తన ఊరు తీసుకునిపోయి ఆడంబరంగా పెళ్లి చేసుకున్నాడు ఆకాష్. 


  మా మొదటి రాత్రి...


  " థాంక్యూ...భూమికా...! నన్ను కాదనకుండా నన్ను పెళ్లి చేసుకున్నందుకు. నీలాంటి అందగత్తె నాకు భార్యగా దొరకడం.. నిజంగా నా అదృష్టం" అంటూ నన్ను దగ్గరకు తీసుకున్నాడు.


    నేను కూడా నా అదృష్టానికి పొంగిపోతూ... ఆకాష్ వైపు చూసి చిన్నగా నవ్వాను...


   "మీరు నా జీవితంలోకి ప్రవేశించి ఉండకపోతే నాకు ఇష్టంలేని చాండసమైన ఆ వేశ్యా వృత్తిలోనే నాతో బలవంతంగా వ్యాపారం మొదలుపెట్టి...నా జీవితాన్ని బలి చేసి ఉండేది మా అమ్మ . నీ పుణ్యమా అని ఇన్నాళ్ళకైనా... అందరిలా ఇల్లాలని కాగలిగాను. ఆ రొంపిలో పుట్టిన నేను నా శీలాన్ని కాపాడుకుంటూ మొదటిసారిగా మీకే అర్పిస్తున్నానన్న నిజం మీకు చెప్పినా నమ్ముతారనే నమ్మకం నాకైతే లేదు. ఒకవేళ చెప్పినా... నన్ను ఈ సింహాసనం నుంచి గెంటేస్తారేమో...? ఆ ఎంగిలి బ్రతుకులోకే పొమ్మని తరిమేస్తారేమో...? అందుకే వెతుక్కుంటూ వచ్చిన ఈ అదృష్టాన్ని కాలదన్నుకోలేను. ఎప్పటికీ మీకీ విషయం చెప్పలేను. నన్ను క్షమించండి". నాలోనేనే అనుకుంటూ...భర్త కౌగిలిలో ఒదిగిపోయాను... !!*


 (30.6.89 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించిన కథను క్లుప్తీకరించి రాసినది)  













   


Rate this content
Log in

Similar telugu story from Drama