Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

6. దేవుడు - దేవత

6. దేవుడు - దేవత

2 mins
179      అపరిచితులెంతో మంది ఎదురవుతూనే వుంటారు మనం చేసే ప్రయాణాల్లో. అలాంటి వారిలో ఒక్కోసారి ఆప్తులై గుండెల్లో నిలిచిపోయేవారూ వుంటారు. అలాంటి సంఘటనే ఇది....

             

      భూమిక హడావిడిగా హైద్రాబాద్ వెళ్లే బస్సెక్కింది. కొంచెం సేపట్లో కదలబోయే ఆ బస్సులో సీటు ఉందని చెప్పడంతో... 'హమ్మయ్య' అనుకుంటూ ఎక్కేసింది. రేపటి ఉద్యోగం కోసం వెళ్తున్న ఇంటర్వ్యూ కి ఎలాగైనా అటెండ్ అవ్వాలి. సీట్లోకెళ్లి కూర్చున్న కొంచెం సేపటికి...టికెట్ రిజర్వ్ చేయించుకోని వాళ్ళ దగ్గరకొచ్చి డబ్బులు తీసుకుని టికెట్ ఇస్తున్నాడు కండక్టర్ . భూమిక దగ్గరకు వచ్చేసరికి... ఒక్కసారిగా కంగారు పడింది. "నా బాగ్ నా బాగ్... అంటూ తాను కూర్చున్న చోట అటూ ఇటూ అంతా వెదికింది. హాండ్ బాగ్ కనిపించలేదు. 


    "అదెలా పడేసుకున్నావమ్మా...? బస్సు కదిలిపోతుంది. టికెట్ తీయడానికి డబ్బులు లేకపోతే దిగిపోమ్మా"... గదమాయించాడు కండక్టర్.  


    భూమిక బిక్క మోహమేసింది. పోయిన హాండ్ బాగ్ తో పాటూ...రేపటి ఇంటర్వ్యూ గుర్తుకొచ్చేసరికి తల తిరిగినట్టు తూలిపడబోయింది .


    ఆ వెనక సీట్లోంచి ఇదంతా చూస్తున్న ఆకాష్ గబుక్కున పట్టుకున్నాడు పడిపోకుండా.  


     "మరేమీ ఆలోచించకుండా...ఈమెకు ఒక టిక్కెట్టు ఇవ్వండి " అంటూ కండక్టర్ చేతికి డబ్బులందించాడు. కొంచెం నీళ్లు తాగాక తేరుకున్న భూమిక చేతిలో కొంచెం డబ్బుంచి... "పర్లేదు..ఉంచండి అన్నాడు. హైద్రాబాద్ లో దిగిన వెంటనే ఖర్చులకు ఉండాలి కదా"...అంటూ అందించాడు ఆకాష్.


     "ఆపదలో ఆదుకున్నారు. రేపు ఇంటర్వ్యూ కి వెళ్లలేకపోతానేమోనని భయమేసింది. చాలా థాంక్సండీ". అంది ఎంతో కృతజ్ఞతతో...భూమిక.


     "మీరేమీ ఆలోచించకండి. స్థిమ్మితంగా కూర్చుని రేపు వెళ్లబోయే ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవ్వండి" అన్నాడు సలహా ఇస్తూ ఆకాష్. 


    "మీరేమీ అనుకోకపోతే...మీ ఫోన్ నెంబర్ చెప్తారా...? నేను కాల్ చేసినప్పుడు మీ అకౌంట్ నెంబర్ చెప్తే బ్యాంక్ లో మీరిచ్చిన అమౌంట్ వేసేస్తాను" అంది భూమిక.


    "మీరిక ఆవిషయం గురించి మర్చిపోరా" ? అని ఆకాష్ అనడంతో...చిన్న నవ్వు నవ్వేసి...మాట్లాడకుండా కూర్చుంది. కూర్చుందే గానీ....అంత తెలియకుండా తన హాండ్ బాగ్ ఎలా పోగొట్టుకుందో...అర్థం కాలేదు. అందులో యాభైవేల రూపాయలతో పాటూ... రెండో, మూడో వేలు కూడా చిల్లరగా ఉన్నాయందులో. హైద్రాబాద్ లో రేపు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వబోయే కంపెనీలో జాబ్ వచ్చినా రాకపోయినా కొన్నాళ్ళు హైద్రాబాద్ లోని యే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లోనో జాయినై ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు కదాని, షాపింగ్ కోసమని తండ్రిని అడిగి మరీ తెచ్చుకుంది అంత డబ్బు. తండ్రి అడిగితే ఏం చెప్పాలో తెలీడం లేదు. ఆలోచనల్లో కళ్ళు మూతలు పడిపోయాయి.


     ఆ తర్వాత -

     ఏ కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని బయలుదేరి వచ్చిందో అదే కంపెనీలోనే మంచి జాబ్ రావడంతో ...భూమిక ఆనందానికి అంతులేదు. 


     ఫోన్ లో తన స్నేహితురాలతో మాట్లాడుతూ... చెప్తుందిలా...

     

     "బస్ లో హాండ్ బాగ్ పోగొట్టుకున్న నాకు...ఆ అపరిచితుడు ఎవరో గానీ...నాకు టికెట్ తీసి ఆదుకున్నాడు కాబట్టే..నేనీ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వగలిగాను. నిజంగా...అతను నాపాలిట దేవుడు. అతని ఋణమెలా తీర్చుకోవాలో"  ఆకాష్ ని తలచుకుంటూ బస్ లో జరిగిన సంఘటన చెప్పింది.


       *        *         *         *


    హైద్రాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించి.. చావు బ్రతుకుల మధ్య ఉన్న తల్లిని బ్రతికించుకోగలిగాడు ఆకాష్.


    సమయానికి డబ్బు తెచ్చి ఆసుపత్రికి కట్టడం వల్లే...వెంటనే ఆపరేషన్ చేసారు డాక్టర్లు. లేదంటే...తన తల్లి అతనికి దక్కేది కాదేమో...?


    ఎంత ప్రాణాల మీదకు వచ్చిన రోగాలకైనా వేలకు వేలు కుమ్మరిస్తేనే గానీ... వైద్యానికి అంగీకరించని ప్రయివేటు ఆసుపత్రుల వైఖరి వల్లే....తానూ నేరం చేయాల్సి వచ్చిందని బాధ పడుతూ మనసులోనే ఇలా అనుకుంటున్నాడు.... 


    బస్ లో ఆ అపరిచితురాలు ఎవరో గానీ...నా పాలిట దేవత. అమ్మ ఆపరేషన్ కి డబ్బు చాలడం లేదనే దిగులుతో ఉన్న నాకు...ఆమె హాండ్ బాగ్ కొట్టేయాలన్న ఆలోచన రావడమే తరువాయి...ఆమె కళ్లుగప్పి ఎలా కొట్టేసానో నాకే తెలియదు. అదృష్టవాసత్తు అందులో ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి...డబ్బు సరిపోయింది.  

    

    నీవెళ్లిన ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యి..మంచి ఉద్యోగమే సంపాదించుకుని వుంటావని...ఆ అపరిచితురాలి క్షేమాన్ని కాంక్షిస్తూ...క్షమించమని కూడా భూమికను మనసులో తల్చుకున్నాడు ఆకాష్....!!*


   ***              ***            ***

                 


Rate this content
Log in

More telugu story from శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Similar telugu story from Drama