29.స్నేహితురాలి లేఖ
29.స్నేహితురాలి లేఖ


స్నేహితురాలి లేఖ చదివాకా... ఏదో ఆలోచనలో పడింది భూమిక.
తన కాపురం చీకటిమయమైపోతున్నా... నా జీవితానికి వెలుగునివ్వాలని ఎంతగా తపిస్తుందో కదా.
అనుభవం పాఠాల్ని బోధిస్తుందేమో...? ఎంత అర్థవంతంగా రాసిందో. ప్రతి అక్షరంలోనూ ప్రేమను కుమ్మరిస్తూ... నా బ్రతుకును నాశనం చేసుకోవద్దని ఎంత చక్కగా చెప్పింది...? చదివేకొద్దీ చదవాలనిపిస్తుంటే...
మళ్లీ ఆ లేఖ మడత విప్పింది భూమిక.
కాకినాడ
ప్రియమైన భూమికకు,
నీవెలా ఉన్నావని అడగను. నేను బాగున్నాననీ చెప్పను. ఎందుకంటే...నా జీవితమెలాగూ నాశనమై పోయింది. నీ జీవితాన్నైనా సరిదిద్దుకుంటావని...నేను చెప్పే ఈనాలుగు మాటలూ అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నాను. నీ మనసు మార్చుకుంటే...నాకంటే సంతోషించేవాళ్ళు వుండరేమో...?
చెప్పు భూమికా...? నువ్వు పెళ్లి చేసుకున్న ఆకాష్ మంచివాడు కాదంటావా...? నువ్వంతగా అతన్ని దూరం చేసుకోవడం న్యాయమంటావా...? నువ్వెప్పుడూ తన కళ్ళముందే వుండాలనుకోవడం తప్పంటావా...? ఇలాంటి భర్త నువ్వెన్ని జన్మలెత్తితే వస్తాడంటావు....?
నువ్వొకసారి నా జీవితంలోకి తొంగిచూడు. నేను ప్రేమించిన వాడిని పెళ్ళిచేసుకున్నా నేనెప్పుడూ సుఖపడలేదు. ఆరడుగుల అందగాడే అయినా తాగుబోతూ, తిరుగుబోతూ..జూదగాడు..ఇవన్నీ కలిపితే... నన్ను హింసించే శాడిస్ట్. ప్రేమించి మోసపోయిన నాకు ఇంతకంటే దౌర్భాగ్యస్థితి ఉండదేమో...? విడిపోయి వచ్చేయడం...పెద్ద కష్టం కాదు. ఒంటరిగా ఆడది ఈసమాజంలో బతకడమే కష్టం. అందుకే ఎంతో ఓర్పుతో
ఓ ఆడదానిగా నాభర్త ఎప్పటికైనా మారకపోతాడాని సహిస్తున్నాను...!
ఇదంతా ఎందుకు చెప్పానో నీకర్థమయ్యే ఉంటుంది.
నీ భర్త తాగుబోతూ కాదు...తిరుగుబోతూ కాదు... జూదగాడూ కాదు. నల్లగా వున్నా...మనసున్న మంచివాడు కాబట్టే... నువ్వంటే పిచ్చిగా ఇష్టపడుతున్నాడు.
నువ్వు ఎప్పుడూ తన కళ్లెదుటే వుండాలనుకోవడం నీకు నచ్చడం లేదంటే... అతని పిచ్చిప్రేమ కూడా ద్వేషానికి కూడా దారితీస్తుందని నిన్ను చూసాక అర్థమయ్యింది.
నీవెక్కడికెళ్లాలనుకున్నా...దగ్గరుండి తీసుకెళ్తున్నాడంటే...నీపై అనుమానంతో కాదు. భర్తగా నీపై తీసుకున్న బాధ్యతతో అని నీవెందుకనుకోవు...?
పుట్టింట్లో నాలుగు రోజులైనా వుండనీయడని ...అతనొక శాడిస్ట్ అనుకుంటే ఎలా...? నిను చూడకుండా ఒక పూటైనా ఉండలేడని నువ్వెందుకనుకోవు...?
పుట్టినరోజుకీ...పెళ్లిరోజుకీ...ఓ సినిమాకి గానీ... రెస్టారెంటుకైనా తీసుకెళ్లడని అతనొక పిసినారిగా నువ్వనుకుంటే ఎలా...? ఆ ముఖ్యమైన రోజుల్లో నలుగురిలో కంటే... మీకు మీరు ఏకాంతంగా గడిపితే బాగుంటుందని నీకెందుకనిపించదు...?
ఇవన్నీ నీకు నేరాలూ...ఘోరాలు అయిపోతే...నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు.
నిన్నే ప్రాణంగా ప్రేమించే ఆకాష్ హృదయంలో నీకు మాత్రమే చోటున్నందుకు...ఆ పవిత్రమూర్తిని అర్థం చేసుకో. చేజేతులా నీకు నీవు దూరమైపోతూ...నీభర్తను అపార్థం చేసుకోకు.
నీ శ్రేయస్సునాశించే...
రాధిక.
"నిజమే కదా... రాధిక చెప్పేవరకూ నాభర్తను నేనర్థం చేసుకోనేలేదు. నాభర్త నాపై చూపించేది అతిప్రేమని తెలీక ద్వేషంతో రగిలిపోయాను. ఓ మంచి మనసుని కష్టపెట్టి నేరం చేసానేమో" అనే కనువిప్పు కలిగింది భూమికకు.
ఆరోజు మొదలు..మారిన మనసుతో భర్త ఆకాష్ ని అమితంగా ప్రేమించడం మొదలుపెట్టింది భూమిక....!!*
*** *** ***