శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

20.దారిచూపిన దేవత

20.దారిచూపిన దేవత

2 mins
154



 

     

   ఆకాష్ ని తెలియనిదారిలోకి లాక్కొచ్చింది భూమిక. ఆ దారిలో తనకెన్ని ఒడిదుడుకులు వస్తాయో అనే భయం అతనిలో లేకపోలేదు. అయినా అడుగెయ్యక తప్పలేదు. భార్య పట్టుదలతోనూ...ఆమెచ్చిన దైర్యంతోనూ.... పల్లెటూరి నుంచి పట్నం మకాం మార్చాడు. 

 

     ఆకాష్ వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడైనా చదువుకున్నవాడే.  తన చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినా...తన తండ్రి కోరికతో ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా తండ్రితో పాటూ...వ్యవసాయ పనులే చూసుకుంటున్నాడు. 

     

   మోతుబారి కొడుకైన ఆకాష్ కి...వారికున్న భూముల్ని చూసి పెద్ద సంబంధమే వచ్చింది. చదువుకున్న భూమిక భార్యగా రావడంతో...ఆ ఊరి పరిస్థితినీ..పండని భూముల్నీ చూసి చూసి...కొన్నేళ్ళకి లాభం లేదనుకుని...గట్టి నిర్ణయమే తీసుకుంది.


   "ఏవండీ....ఎన్నాళ్ళని ఇలా వర్షాధారంతో పండే పంటల మీద ఆధారపడతాం చెప్పండి...?  వంద ఎకరాలు ఉన్నాయన్న మాటే గానీ...చాలీ చాలని పంట చేతికి రావడం...అదీగాక గట్టిగా వర్షాలు పడితే...అంది వస్తుందనుకున్న పంట కాస్తా  కొట్టుకుపోవడం కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. ఎదుగూ బోదుగూ లేకుండా ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేస్తామంటారు....?  ఇప్పటికైనా కొంత భూమిని అమ్మేసి... వ్యాపారంతో సంపాదించి  పైకి వచ్చే ప్రయత్నం చేయాలి" ...అంటూ భర్తతో విడమర్చి చెప్పింది భూమిక. 


   ఆకాష్ ఆలోచించాడు ." నిజమే భార్య చెప్పినదాంట్లో నిజముంది. కానీ తండ్రికి చెప్పే ధైర్యం లేదు. అందుకే.... భార్యను మరోసారి అడిగాడు. "మనం వెళ్లి తీరాలంటావా? నాకైతే నాన్నను భూముల్ని భేరం పెట్టమని అడిగే సాహసం నాకు లేదు" అన్నాడు బెదురుగా.


  "చూడండి. ఏదైనా అడిగితే కదా వారికి తెలిసేది. మీరు ముందు అత్తయ్య గారితోనూ మావయ్య గారితోనూ మాట్లాడండి. వారు ఏమంటారో చూసి...నేను మాట్లాడాల్సివస్తే మాట్లాడతాను" అంది. భర్తను ముందుకు తోస్తూ...


  భార్య చెప్పిన దానికి తలవంచాడు ఆకాష్. మర్నాడు వారి నిర్ణయాన్ని తండ్రితో చెప్పాడు. "మేము బ్రతికున్నంత కాలం అమ్మడానికి వీల్లేదు. మేము చచ్చాక ఏం చేసుకుంటారో మీ ఇష్టం" అంటూ ఆవేశపడ్డాడు కొడుకుమీద వీరభద్రం.


  " కొంచెం అర్థం చేసుకోండి నాన్నా...! మాకూ పిల్లలు ఎదుగుతున్నారు. మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం. అయినా ఇక్కడ భూములమ్మిన డబ్బుతో...పట్నాన్న స్థలాలు కొని అపార్టుమెంట్లు కట్టి ఫ్లాట్స్ అమ్ముకుంటే....ఇక్కడికంటే పదింతలు చేయొచ్చు. మా వైపున కూడా ఒకసారి ఆలోచించండి."  మరోసారి గౌరవ పూర్వకంగా అడిగాడు ఆకాష్. అయినా తండ్రి బెట్టు తగ్గకపోవడంతో...భూమిక రంగంలోకి దిగింది.


   అణిగిమణిగి వుండే కోడలు కూడా నోరు పారేసుకోవడంతో...చేసేదిలేక వారి వాటాకి వచ్చే భూముల్ని భేరం పెట్టి వచ్చిన మొత్తాన్ని వీరభద్రం కొడుక్కి అప్పచెప్పాడు.


   పట్నానికి మకాం పెట్టిన కొద్దిరోజుల్లోనే...భార్య చెప్పిన మార్గంలో అడుగులేస్తూ...విజయశిఖరాల్ని అందుకున్నాడు ఆకాష్.


   కొడుకు విజయాన్ని చూసిన వీరభద్రం..."నువ్వు చెప్పింది నిజమేరా...ఇక్కడున్న భూముల విలువ కంటే...పట్నాన్న స్థలాల విలువే రోజురోజుకీ వేలకు వేలు పెరుగుతున్నాయి. ఎప్పుడో మేము పోయాకా వచ్చే ఆస్తిని ..ఇప్పుడే మీరు గోడవచేసి తీసుకోవడం వల్ల...మీరీ స్థితికి ఎదగగలిగారు. మీ ఉన్నతిని బతికుండగా మా కళ్లారా కూడా చూడగలిగాము"

ఆస్థులమ్ముకుపోయి వ్యాపారం చేస్తామంటే...తెలియని దారిలోకి తప్పటడుగు వేస్తున్నారేమోననే భయంతోనేరా... అనుభవం నేర్పించిన పాఠాలతో...పెద్దవాళ్లుగా పిల్లల్ని మందలిస్తూ కేకలేస్తాము. మనసులో ఏమీ ఉంచుకోకండి" అంటూ కొడుకునీ, కోడల్నీ ఆప్యాయంగా పలకరించారు వీరభద్రం.


   తల్లీతండ్రీ కూడా తమని అర్థం చేసుకుని..ఇంటికొస్తూ ఉండటంతో....


    ఆకాష్ ఆనందానికి అంతేలేదు. "తెలియని దారిలోకి తీసుకొచ్చి ...దారిచూపించిన దేవతవు నువ్వు" అంటూ భార్య భూమికను మెచ్చుకోలుగా చూసాడు ఆకాష్...!!*


    ***            ***           ***


 


     



 


Rate this content
Log in

Similar telugu story from Drama