శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

3.8  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

19.లోకం పోకడ

19.లోకం పోకడ

3 mins
265   ఓటమి అంటే తెలియని భూమికకు మళ్లీ ఊరెళ్ళాల్సిన అవసరం వచ్చి...భర్తను అడగాల్సి వచ్చింది.


  " ఏవండోయ్...నేను రేపు మా ఊరెళ్లి వస్తాను... అనుమతివ్వరూ'...గోముగా అడిగింది భర్త ఆకాష్ ని భూమిక.


  ఆమాట వినగానే..ఆకాష్ అదిరిపడ్డాడు. "అదేంటే...?ఈమద్యే కదా వెళ్ళొచ్చావు...మళ్ళీనా..."? నీరుగారిపోతూ అన్నాడు.


  " తప్పదండీ...మా మేనత్త మనుమరాలు పెద్దపిల్లయ్యింది. ఫంక్షన్ చేసే ఏర్పాట్లకి నా సలహాలు, సహాయం కావాలంట. మరీ మరీ రమ్మని చెప్పింది. ఎంత...ఒక్క వారం రోజుల్లో వచ్చేయనూ" అంది భర్త భుజంపై వాలుతూ.


  'అయితే...ఎప్పటిలాగే నీకో కథ చెప్తాను. చెప్పాకా... నేనడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తేనే సుమా... నిన్ను మీ ఊరు బస్ ఎక్కించేది అన్నాడు ఆకాష్. 


  " అయ్యా మహా ప్రభూ...మీరెంత రచయిత అయితే మాత్రం...ఇలా బేతాళుడు రాజుకి కథచెప్పి ప్రశ్నల్ని విప్పి చెప్పమన్నట్టు నాకీ పరీక్షలేంటండీ...? ఏమైనా బాగుందా...? సరే...అడగండి. నేనెప్పుడు మాత్రం మీ దగ్గర ఒడిపోయాను గనుక..? నేను మాత్రం మా ఊరెళ్లడం ఖాయం". అంది భూమిక.


   "అయితే చెప్తాను. మధ్యలో ప్రశ్నలు వేయకుండా సరిగా విను".అంటూ ఇలా మొదలు పెట్టాడు. 


   "నాన్నా నేను ఇంటర్ ఫస్టు క్లాసులో పాసయ్యాను కదా...మరి మీరు చెప్పినట్టుగా...మార్కెట్లోకి కొత్తగా వచ్చిన బైక్ ని నాకు బహుమతిగా ఇస్తున్నారా లేదా..." అడిగాడు రామూ తన తండ్రి వెంకటాద్రిని.


   కొడుకు కోరిక తీర్చడం పెద్దపనేమీ కాదు ఆ తండ్రికి.జిల్లాలో ఉన్న ఏ అధికారికి ఫోన్ చేసినా క్షణాల్లో ఇంటికి చేరిపోతుంది. తాను ఆలోచించేదల్లా కొడుకు విజయం గురించే. వీడికి తెలియదు కానీ...వీడి ప్రతిభకు కారణం నా హోదా...పలుకుబడి..డబ్బూ దర్పం. నా రాజకీయ పరపతే కాకుండా డబ్బుని కూడా విరజిమ్మడం వల్లే వాడు పాసయ్యావని వాడికెలా చెప్పను...?" 'డబ్బుకు లోకం దాసోహం ' అనే జగమెరిగిన సత్యం వీడికెలా అర్థమవుతుంది...? మనసులో అనుకున్నాడు మంత్రి వెంకటాద్రి.


    "సర్....మీ అబ్బాయి గారు ఫస్ట్ క్లాసులో పాసైనట్టే...రేపు వచ్చే ఎన్నికల ఫలితాల్లో కూడా ఇలాగే మీరు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలి"...అని చెబుతూ... మునగచెట్టెక్కించేశాడు వెంకటాద్రిని.


   తన పీఏ పొగడ్తకి ...మీసకట్టు సవరించుకున్నాడు వెంకటాద్రి. అతను చెప్పినట్టే...ఈసారి నేను ఈ ఎన్నికల్లో గనుక గెలిస్తే...డబ్బుతో నలుగురు ఎమ్యెల్యేల నైనా కొనేసి...ముఖ్యమంత్రిని అయిపోవచ్చు అనుకుంటూ మనసులో నవ్వుకున్నాడు. పాపం పిచ్చి ప్రజలు...ఓటు కోసం నేను వాళ్ళకిచ్చింది పదో పరకో కాకుండా...ప్రతి కుటుంబానికి రెండువేలు ఇచ్చుకోవడం తక్కువేమీ కాదు. ఇతరపార్టీలన్నింటిమీదా నేనిచ్చింది ఎక్కువే. అదీకాక అధికారపార్టీలో ఉన్నానేమో...ఎన్నికల ప్రకటన రాకుండానే...వివిధ పథకాల పేర్లతో...డైరెక్టుగానే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమా అయ్యేది. ఇదే మన పార్టీ చేసిన మంచి పని. పాపం పిచ్చి ప్రజలకు తెలీదు...ఇదొక దొడ్డి దారి లంచం అని. ఇదే విషయాన్ని తన పీఏ దగ్గర చెప్పుకుని ఆనందించాడు...వెంకటాద్రి. అతని తెలివితేటలకు ముక్కున వేలేసుకున్నాడు పీఏ.


    ఆ మర్నాడే...ఎన్నికల ఫలితాలు. టీవీ ముందర ఆతృతగా ఎదురుచూస్తున్నారు జనాలు. వెంకటాద్రికి అయితే గట్టినమ్మకం.తానే ఈసారైనా ముఖ్యమంత్రి అవ్వాలని. ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. డబ్బుకు లోకం దాసోహం అనే వెంకటాద్రి ఓడిపోయాడు.


   "ఇప్పుడు చెప్పు భూమికా.....ఎన్నికలలో డబ్బు ఎక్కువుగా ఖర్చుపెట్టిన వెంకటాద్రి ఎందుకు ఓడిపోయాడు"...?  " అతని కుమారుడు అదే డబ్బుతో ఎందుకు పాసయ్యాడు..? డబ్బుకు లోకం దాసోహం అనే సూక్తి వెంకటాద్రి విషయంలో ఎందుకు పనిచేయలేదు"...? 


   కథంతా విన్న భూమిక పెదవులపై చిన్న నవ్వు విరిసింది.


   "చూడండి మహాశయా..... డబ్బు అనేది అవతలి వ్యక్తి తనకు చేసిన పనికి ప్రతిఫలంగా ఇచ్చేది. దాని ద్వారా... అతనూ అతని పిల్లలు సంతోషంగా బ్రతుకుతారని. ఇదే జగమెరిగిన సత్యం.కానీ మనిషి ఆలోచన పూర్తిగా డబ్బు చుట్టూనే తిరగుతూ సులువుగా సంపాదించాలనే యావ ఎక్కువైపోయింది. డబ్బుతో ఏమైనా సాధించవచ్చు అని విర్రవీగుతున్నారు. అందుకే వెంకటాద్రి కొడుకు పరీక్షలో పాసయ్యాడు. కానీ వెంకటాద్రి విషయంలో...ఆ సూక్తి ప్రభావం చూపకపోడానికి కారణం ఉంది. ఎన్నికన్నది వ్యక్తుల సమూహ ఆలోచన. ఓటర్లలో విభిన్న మనస్తత్వం ఉన్నవాళ్లు వుంటారు. ఎవరి ఆలోచనా ధోరణి వారిది. మంచి పాలనకు కత్తిలాంటి నాయకుడు అవసరం. డబ్బు తీసుకున్న వాళ్లంతా తన పార్టీకే ఓటు వేస్తారు అనుకోవడం వెంకటాద్రి భ్రమ మాత్రమే.తనలాగే పోటీలో ఉన్న ఇతరులు కూడా ఉంటారనే ఆలోచన కూడా లేకుండా తానే గెలుస్తాననే నమ్మకంతో... అధికారపార్టీ పథకాలు ఫలిస్తాయనే భ్రమలో వుండి తెలివిగా ఆలోచించాడు. ఇక్కడ ఓటర్లేమీ తెలివితక్కువోళ్ళు కాదు. వాళ్ళు అంతకైనా తెలివైన వాళ్ళు. వారికి కావాల్సింది...మంచి సమర్ధవంతమైన నాయకత్వం కావాలి. అన్ని పార్టీల నాయకులూ ఒకేలా ఉంటే ఓటరు కూడా ఆలోచనలో పడతాడు. అందుకే ఉన్నవాళ్ళలో సమర్ధుడు ఎవరన్నది ఓటర్లు కూడా ఓ కన్నేసి ఉంచుతారు. దానితో...ప్రజలు ఎన్నుకున్నవాడే నాయకుడవ్వడంతో... వెంకటాద్రి ఊహ తారుమార్తె ఓటమి చవిచూశాడు".


    భార్య నుంచి సరైన జవాబులు రావడంతో...ఊరు పంపించడానికి ఒప్పుకోక తప్పలేదు. గెలవడమే గానీ...ఓటమి తెలియని భార్య బుగ్గపై చేతితో చిన్నగా తట్టాడు. భర్త సరసానికి భూమిక సిగ్గు పడింది.


   మర్నాడు....భార్య భూమికను వాళ్ళ ఊరు వెళ్లే బస్సెక్కించి...తాను కూడా ఓటమితో వెనుతిరిగాడు.... ఆకాష్....!!*


      ***           ***         *** 


Rate this content
Log in

Similar telugu story from Drama