శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

3.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

18.హ్యాండ్సప్

18.హ్యాండ్సప్

2 mins
232



   

              

     బంధాలు మనసుని బంధిస్తున్నట్టు రాత్రంతా ఒకటే యాతన. నిద్ర లేమితో...బుర్ర ఏమీ పనిచేయడం లేదు ఆకాష్ కి.

     

    తెలతెలవారుతుండగా....ఫోన్ నుంచి వస్తున్న సందేశాల శబ్దాలు...! అలవాటుగా ఫోను ఓపెన్ చేసి చూసాడు. ఒక్కొక్కరుగా...గుడ్ మార్నింగ్లు చెప్తున్నారు. కుటుంబ సమూహాలనుంచి కొన్ని, మిత్ర సమూహాల నుంచి కొన్ని వరుసగా తెగ మ్రోగుతున్నాయి. రోజూ గుడ్ మార్నింగ్లు అందుకుంటున్నా....కొన్నిరోజులుగా బాడ్ గానే ముగుస్తుంది రోజంతా. చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఫలించడం లేదు. ఫోన్లో వస్తున్న ఆ సందేశాలు చూడ్డంతో...తన ఆలోచనలకు ఒక మంచి ఐడియా తట్టినట్టయ్యింది ఆకాష్ కి.


    నిన్న కొంతమంది తనింటికొచ్చి చేసిన రభస కళ్ళముందు మెదిలింది...


   తెల్లారిందో లేదో...ఇంకా నిద్రనుంచి లేవనే లేదు...తలుపులు దబదబా బాదుతున్న శబ్దానికి తుళ్ళిపడి లేచాడు ఆకాష్.


   ఆ వెనకే భూమిక కూడా లేచి...భయంతో భర్తను పట్టుకుంది. ఎవరో గట్టిగా కేకలేస్తున్నారు. "ఒరేయ్...ఆకాష్...ఎక్కడరా మాడబ్బు...? నీ స్నేహితుడు మొత్తం డబ్బు పట్టుకుని పారిపోయాడు. వాడు డబ్బు కట్టాల్సిన బాధ్యత నీదే కదా...? నీకు నోటీసిచ్చి ఇప్పటికే చాలరోజులయ్యింది. దేనికీ స్పందించకుండా ఉన్నావు. నీకు పదిరోజులు టైం ఇస్తున్నాము. మర్యాదగా మొత్తం సొమ్ము కట్టు. లేదంటే...పరిణామాలు చాలా తీవ్రంగా ఎదుర్కోవలసి వస్తుంది అంటూ...గట్టిగానే బెదిరించి వెళ్లారు. 

   

    ఆ విషయంతో చాలా బెదిరిపోయాడు ఆకాష్. ఏమి చేయాలో...ఎలా తీర్చాలో తెలియని అయోమయంలో వుండగా వాట్సాప్ సందేశాలు పంపుతున్న బంధువుల, మిత్రుల సమూహాలు తనకు ఓ బలమైన బంధంగా అనిపించాయి. 


   తన సమస్యను పూసగుచ్చినట్టు రాసి...వాట్సాప్ కుటుంబ సమూహాలకూ....మిత్ర సమూహాలకూ ఈవిధంగా పంపించాడు. 


   నమ్మిన వాళ్లందరికీ హామీ సంతకాలు చేసేయడం వల్ల, వారందరితో మోసపోయి... లక్షల్లో చెల్లించాల్సిన బాధ్యత నామీద పడింది. దీనివల్ల నాకు వచ్చే జీతం కట్ అయిపోవడమే కాదు... ఉన్న ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను పూర్తిగా పదిరోజుల్లో సెటిల్మెంట్ చేయకపోతే నాకు శిక్ష పడ్డం ఖాయం. నా కుటుంబం అంతా రోడ్డున పడుతుంది.దీన్నుంచి తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. మీరంతా కలిసికట్టుగా నన్ను ఆర్థికంగా ఆదుకుంటే...నేను ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి కొంచెమైనా గట్టెక్కగలను...లేదంటే నాకు చావే గతి... అంటూ అందరికీ సందేశం పంపించి....ఊపిరిపీల్చుకున్నాడు ఆకాష్.


     మనసుకు ఏదో చిన్న ప్రశాంతత దక్కడంతో... చూద్దాం...రోజూ నాకు సందేశాలు పంపే వీరందరికీ నేను ఆప్తుడ్ని కాబట్టే...నన్ను గుర్తిస్తున్నారు. నా సమస్యను వీరందరికీ చెప్పాను కాబట్టి....నన్ను కొంచెమైనా గట్టెక్కిస్తారేమో అనే చిన్న ఆశ కలిగింది అతనిలో.  ఆశ కాదేమో.... బలమైన నమ్మకమది. నిద్రపోతున్న భార్యనూ, కొడుకునూ చూస్తూ...మీకు నేను దూరమయ్యేదే లేదు. ఈ అందరి బంధం ఏకమైతే మన బంధం గట్టిగానే ఉంటుంది అనుకున్నాడు ఆకాష్.


    ఒకరోజు కాదు...రెండు రోజులు కాదు...తాను పంపించిన సందేశం వాట్సాప్ సందేశాల వరదల్లో కొట్టుకుపోతూ మరుగున పడిపోయింది గానీ...ఎవరి దగ్గరనుంచీ...సారీ అనే పలకరింపు కూడా రాలేదు. అప్పుడర్థమయింది అతనికి...'ఇప్పుడు నేనొక ఒంటరివాడినని ...దివాళా తీసిన సాధారణ వ్యక్తినని.... 


   ఆకాష్ విరక్తిగా అనుకున్నాడు ...ఇది వాట్సాప్ గ్రూపు కాదు...హ్యాండ్సప్ గ్రూపని....!!*


    

     ***              ***           ***        

    


     







 


Rate this content
Log in

Similar telugu story from Drama