శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

17.వయసు జోరు

17.వయసు జోరు

2 mins
674



            

            

   మన పండగలు ఎన్నో వస్తాయి. కానీ... ఇంట్లో కుటుంబ వ్యక్తులకు చేసే శుభకార్యాలే మన అసలైన పండుగలు....

  

   అలాంటి పండుగ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు అన్నాచెల్లెళిద్దరూ. 


   తల్లిదండ్రులకు షష్టిపూర్తి పండుగ చేయాలని వారి ఆశ....!


   "చెల్లీ...నాన్నగారి అరవయ్యో పుట్టినరోజు ఇంకా పదిరోజులు మాత్రమే ఉంది. మన ప్లాను ప్రకారం అమ్మనీ నాన్ననీ సర్ప్రైజ్ చేయాలి కదా.... వారికి తెలియనీయకుండా జాగ్రత్తపడాలి. అందుకే బంధువులందరూ ఊర్లోనే వున్నారు కాబట్టి రావడానికి ప్రాబ్లెమ్ ఉండదు. ఒకరోజు ముందు తెలియచేస్తే సరిపోతుంది " అంటూ చేయబోయే కార్యక్రమాల గురించి చెల్లెలు రేవతితో ఎంతో ఉత్సాహంగా చెప్తున్నాడు అరవింద్.


  అన్న గారి మాటల్ని విని...ఆ పండుగెంత సంబరంగా జరగబోతుందో ఊహించుకుంది రేవతి. 


   ఆ పదిరోజులూ ...ఇట్టే గడిచిపోయాయి.


   తండ్రికి కొత్తబట్టలందిస్తూ...తల్లి తో సహా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ చేత్తోనే తల్లికి ఎర్రంచు పసుపు పట్టుచీర ఇచ్చి...ఇద్దరికీ కాళ్లకు నమస్కారం చేశారు. పిల్లల ఆప్యాయతకు, ప్రేమకూ పొంగిపోయారిద్దరూ. ఆతర్వాత...ఒక్కొక్కరుగా ఇంటికి బంధువులు వస్తుంటే...చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఒకపక్కన పూలవాళ్ళు వచ్చి ఇల్లంతా అలంకరించి వెళ్లిపోయారు. 


  దంపతులైన ఆకాష్ భూమిక లను చక్కగా తయారుచేసి కుర్చీల్లో కూర్చోబెట్టారు. పురోహితుడు రావడంతో చిన్నపాటి పెళ్లి తంతు చేసి భోజన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆరోజు పిల్లలిద్దరూ బంధువులతో కలిసి తమ పండుగ జరపడంతో...వారి సంతోషం అంతా ఇంతా కాదు. అంతటితో అయిపోయిందా అంటే లేదు. ఆరోజు రాత్రి దగ్గరి బంధువులంతా ఇద్దర్నీ గదిలోకి పంపి తలుపులేశారు. ఆ వేడుక ముగించి ఎవరి ఇళ్లకు వారు ప్రయాణమై వెళ్లిపోయారు.


  గదిలోకెళ్లిన ఆకాష్ కి ముప్పై ఐదేళ్ల క్రితం నాటి శోభనపు రాత్రి ముచ్చట్లు చెప్పాలనిపించింది భార్య భూమికతో. ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఒకరికొకరు పరవశించారు. వారి పండగను ఎంతో వేడుకగా చేసిన పిల్లలిద్దరికీ తమపై ఉన్న ప్రేమకు చలించిపోయారు.


  "అరవైలో కూడా కోరికలు అదుపులోకి రాలేదంటే... వయసు ముదురుతున్న పిల్లలిద్దరికీ ఇంకా పెళ్లి చేయకుండా మనం తప్పు చేసామెమో" అన్నాడు భార్యతో ఆకాష్.


  అవునండీ... నాకు అదే అనిపించింది. అసలు మన రేవతి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే మనమే బలవంతంగా దాని ప్రేమను కట్ చేసాము. ఆ విషయం బయటకు తెలియడంతో సంబంధాలు రాలేదు. వయసు కూడా ఎక్కువైపోయింది. ఆడపిల్ల పెళ్లి చేయకపోవడంతో మన అరవింద్ కి పెళ్లి చేయాలనే ఆలోచన కూడా మనకు రాలేదు.... చేసిన పొరపాటును ఇప్పుడైనా దిద్దుకోవాలి" అంది భర్తతో భూమిక.


   ఆకాష్ కూడా భూమికతో ఏకీభవించాడు. "ఇకనైనా పంతాలకు పోకుండా వారి జీవితాన్ని వారికి వదిలేద్దాం. వారి మనసుకు నచ్చిన వారిని ఇచ్చి సంతోషంగా పెళ్లి చేద్దాం" అన్నాడు ఆకాష్.


   ఇప్పటికైనా మంచి నిర్ణయానికి వచ్చాం. మన పండుగ వారి చేతుల మీదుగా చేశారు. మనం కూడా పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసి వారి పండుగలను కళ్ళారా చూడాలి.అప్పుడే మనం జరుపుకునే నిజమైన మన పండుగలు" అంది భూమిక.


   పిల్లల ఆలోచనలతో... సూర్యోదయానికై ఎదురుచూస్తున్నారు ఆ దంపతులిద్దరూ....!!*


    ***           ***         ***











 


Rate this content
Log in

Similar telugu story from Drama