శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

15.యువత జోరు

15.యువత జోరు

2 mins
535   

   "ఒరేయ్....తెలియని ఊర్లో ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తున్నావ్. వెళ్ళేటప్పుడు వినాయకుడి గుడికెళ్లి దణ్ణం పెట్టుకుని వెళ్ళు...కొడుకు బట్టలు సర్దుతూ చెప్పింది భూమిక.


    ఏంట్రా...ఇంకా తయారవ్వలేదు. ఇంకో గంటలో బయలు దేరాలి మనం. త్వరగా భోజనం కానీయు. రెండు గంటల బస్సుకు టైం అవుతుంది...కొడుకుని తొందరపెడుతున్నాడు ఆకాష్.


   "ఈ డబ్బాలో జంతికలు, సున్నుండలు పెట్టాను. మధ్య మధ్యలో తింటూ ఉండు. అక్కడ హోటళ్ల తిండికి నోరుకట్టుకుని ఉండిపోకు. ఇంతకాలం ఇంట్లో వంట తిన్నావ్. ఇకపై అమ్మ చేతి రుచులు ఉండవు. నచ్చినా నచ్చకపోయినా నాలుగు మెతుకులైనా కడుపులో పడేసుకో. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. ఈ కవర్ లో కొన్ని రకాల మందులు పెట్టాను. జ్వరం వచ్చినట్టు అనిపించినా, దగ్గొచ్చినా, జలుబు చేసినా,విరోచనాలు పట్టుకున్నా.... అత్యవసరానికి పనికొస్తాయని" తనమట్టుకు తాను కొడుక్కి జాగ్రత్తలు చెప్తూనే...కొడుకు తీసుకెళ్ళాల్సినవన్నీ సర్ది ఒక పక్కకు పెట్టింది భూమిక.


   తండ్రీ కొడుకులిద్దరూ అమలాపురం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సు ఎక్కారు. ప్రయాణం చేస్తున్నంత సేపూ...కొడుక్కి జాగ్రత్తలు చెప్తూనే వున్నాడు ఆకాష్. అవసరాలకు డబ్బు పంపిస్తూ వుంటాను. అనవసర ఖర్చులు చేయకుండా... పొదుపుగా ఖర్చు చేస్తూ ఉండు. చెడు స్నేహాలు చేయకుండా...మంచివాళ్ళతో కలిపి చదువుతూ ఉండు. కాలేజీ...రూమూ తప్పించి...బయటకు ఎక్కడికీ వెళ్లిపోతూ వుండకు...ఇలా ఎన్నో చెప్తుంటే...అన్నిట్టికీ బుద్దిగా బుర్రుపుతున్నాడు కొడుకు.


   ఇంజనీరింగ్ పూర్తిచేసి కొడుకెంతో ప్రయోజకుడవుతాడని కలలు కంటున్నాడు ఆకాష్....!

     

          *       *         *


    ఉదయం 9 గంటలు...!


    రాధ పుస్తకాలు పట్టుకుని కళాశాల ఆవరణలో నడుస్తుంటే...వెనకే అనుసరిస్తున్నాడు గోపాల్.


    ఇలా కొన్నాళ్ళు సాగుతూనే ఉంది. మొదట్లో ఆమె బెట్టు చేసినా...రాను రాను గోపాల్ ఆకర్షణలో పడిపోయింది.


    ఇద్దరూ కలిసి నడుస్తూ...ఎన్నెన్నో కబుర్లు చెప్తూ...నవ్విస్తూ కవ్విస్తున్నాడు ఆమెను. రాధకు ప్రాణంగా మారిపోయాడు గోపాల్.


         *         *            *


    కళాశాలకెళ్లిన యువత పరువంతో పరవళ్ళు తొక్కుతూనేవుంటారు. అదిగో...వారిని చూస్తే మీకే తెలుస్తుంది....


     మధ్యాహ్నం 2 గంటలు...!


     సత్యను ప్రేమపేరుతో...కాలేజీ ఎగ్గొట్టించి సినిమాకి తీసుకుపోయాడు కృష్ణ. 


    హాల్లో...ఆ చీకటిమాటున ఒకరిపక్కనొకరు అతుక్కుపోయారు. చెవుల్లో గుసగుసలు...పకకలు. చూసేవారికి ఇబ్బంది కలిగేట్టు వున్నా....వయసు ఆ అల్లరిని ఆపనంటుంది.


    సినిమాపై లేదు వారి ధ్యాస. వారి లోకం వారిది. అక్కడ అడిగేవారు లేరు.


        *          *          *


    సాయంత్రం ఆరు గంటలు...!


    సాగరతీరాన్న బీచ్ పార్క్ రెస్టారెంట్లో ఒక మూల నున్న టేబుల్ దగ్గర రుక్మిణి.

     

    ఆమెకెదురుగా కూర్చున్నాడు మూర్తి.


    బేరర్ తెచ్చిన సమోసాల్ని తింటూ...ఒకే కూల్డ్రింక్ ని ఇద్దరూ సిప్ చేస్తున్నారు. 


     ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ...వారి మధ్య ఏవో కోరికలతో.....ప్రేమ చూపులతో ...మౌనంగా సంభాషించుకుంటున్నారు. 


     ఒకరి చేతినొకరు పెనవేసుకుని...ఆ ఇసుక తిన్నెలపై అడుగులేస్తూ...రాసుకుపూసుకు తిరుగుతున్నారు .


         *          *          *


     ప్రియమైన నాన్నగారికి,


     అమ్మా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈనెల మీరు పంపిన డబ్బు పుస్తకాలు అవసరమై కొనుక్కోవలసి వచ్చింది. ఖర్చులకు లేకుండా మొత్తం అయిపోయాయి. మీరు నా అకౌంట్ కి వెంటనే డబ్బు పంపించండి.


                   ఇట్లు...

                    మీ

                 గోపాల కృష్ణ మూర్తి.


      డబ్బు అవసరం అయినప్పుడల్లా...ఇలా ఉత్తరం రూపంలో ఈమెయిల్ చేయడం కొడుక్కి అలవాటే. అదే అలవాటుతో...అక్కడ కొడుకు ఏమి ఇబ్బంది పడుతున్నాడో అని భూమిక గోల చేయడం...ఆకాష్ బ్యాంకు కెళ్ళి కొడుకు అకౌంట్ లో డబ్బు జమచేయడం మామూలే....!!*


      ***            ***              ***

   


  


Rate this content
Log in

Similar telugu story from Drama