శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

11.ఆఖరి మజిలీ

11.ఆఖరి మజిలీ

2 mins
426


  

      ఆ ఆఖరి ఇంట్లో ఆకాష్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ...ఇన్నాళ్లకు తృప్తిగా...!

      

     ఎన్నెన్నో అద్దె ఇళ్ళు తిరిగాడు. ఎక్కడా ప్రశాంతత లేదు ఎప్పుడూ.. ఏదో ఒక ఇబ్బంది. తన జీవితంలో ఇల్లు కట్టు కోవడమే అవ్వలేదు. ఇన్నాళ్లకు అద్దె ఇళ్లనుంచి విముక్తి కలిగింది... భర్తను తలుచుకుని ...భారంగా అనుకుంది భూమిక. 


 ఆకాష్ భూమికలు తమ పెళ్లయ్యాక...

కాపురముండిన  అద్దె ఇళ్లు చాలా వున్నాయి. ఒకప్పుడు మూడు పడగ్గదులున్న పెద్దపెద్ద ఇళ్లలో ఉండి...ఆతర్వాత రెండు పడగ్గదులు..రాను రాను ఒకే పడగ్గదిలోనూ ...అలా దిగజారుతూ...ఇళ్లు మారుకుంటూ వచ్చారు. ఎక్కడా నిలకడగా రెండేళ్లు కూడా ఉండేవారు కాదు.  ప్రతి సంవత్సరానికి పెంచే అద్దెలు కట్టలేక అవస్థలు పడుతుంటే... యజమానులే ఖాళీ చేసిపొమ్మనేవారు. 


   బ్రతుకునీడకు ఏ అవస్థలో పడి ఆ ఇల్లు కాకపోతే మరో ఇల్లు చూసుకుంటూ అలాగే రోజులు నెట్టుకొచ్చేవారు గానీ సొంత ఇల్లంటూ అముర్చుకోలేకపోయారు. 


   ఆ అద్దె ఇళ్లల్లో ఒక సమస్య కాదు...ఎన్నో. వయసైపోయిన తల్లి దండ్రులు ఉన్నందుకు ..ఇల్లు అద్దెకిచ్చేవారు కాదు. ఇచ్చినా...వాళ్ళకి కొంచెం సుస్తీ చేస్తే చాలు...ఇల్లు కాళీ చేసేయమనేవారు...ఆ ఇంట్లో ఎక్కడ ప్రాణాలు విడుస్తారోనని. వారు పెట్టే రూల్స్ కి తల వంచక తప్పేది కాదు. 


   అందుకే...వయసుడుగిన తల్లిదండ్రుల్ని కూడా...దగ్గర ఉంచుకోకుండా తమ ఊరికిపంపించేశారు . అయినా తిప్పలు తప్పలేదు.


  ఆకాష్ ఆనారోగ్యానికి పాలయ్యాడు. కాన్సర్ తో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కీడెంచి మేలెంచిన ఇంటి యజమాని భూమికను పిలిచారు. "చూడమ్మా.. నీ భర్త ఆరోగ్యం మెరుగయ్యే సూచనలేమీ కనిపించడం లేదు. ఏమీ జరక్కముందే... ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలో అయినా చేర్చితే మంచిది" అని అదేలోకం గోల పెట్టడంతో... ఇంట్లోంచి ఆసుపత్రి మంచంపైకి మకాం మార్చక తప్పలేదు. 


   ఎప్పుడైతే...ఆసుపత్రిలో ఆకాష్ ప్రాణాలు విడిచాడని తెలిసిందో...వెంటనే కబురుపంపాడు ఇంటి యజమాని. చచ్చిన శవాన్ని ఇంటి దరిదాపుల్లోకి కూడా తీసుకురావద్దని. 


  ఆ కష్టానికి తోడు మరింత కష్టం చోటు చేసుకుంది భూమిక హృదయంలో. 


   ఆకాష్ ఆఖరి మజిలీని స్నేహితులు, బంధువుల సహాయంతో...తిన్నగా స్మశానవాటికకే చేర్చారు....  

   

   మృతదేహానికి అందరూ కడసారి చూపులు అక్కడీకే వచ్చి చూసి తమ సంతాపాలు తెలిపారు.


   పుట్టిన ప్రతిమనిషికీ బ్రతికున్నంత కాలం నాదీ అనుకునే జాగా లేకపోయినా... చచ్చిన తర్వాత తనకంటూ ఓ ఆరడుగుల జాగా తనకోసమే కేటాయించి ఉంటుంది. అది చాలు...మనిషి ఆత్మ శాంతించడానికి.

   

   ఆకాష్ మృతదేహాన్ని ఆ ఆరడుగుల గోతిలో... పరుండబెట్టి... ప్రార్థనలు చేశారు. అనంతరం మట్టితో మూసేశారు.  దానిపై ఆకాష్ జ్ఞాపికగా కట్టిన సిమెంట్ గోరీని చూస్తూ...అనుకుంది భూమిక....

    

   ఇన్నాళ్లకైనా ఆయన కంటూ...తన పరిధిలో ఒక నిర్మాణం జరిగింది. ఇక ఎవరూ ఖాళీచేయమని అడిగేవారుండరు. ఇదే ఆయన ఆఖరి ఇల్లు అనుకుంటూ బరువైన మనసుతో...అక్కడ నుంచి అడుగులేసింది...అద్దె ఇంటివైపు. 

    

   కానీ భూమికలో ఒకటే ఆలోచన...యజమాని ఇల్లు ఖాళీ చేయమంటే తానెక్కడికి పోవాలని....?


          ***      ***     ***

     



      







Rate this content
Log in

Similar telugu story from Drama