శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

1.వాడిన మొగ్గ

1.వాడిన మొగ్గ

3 mins
461



        

           ‎

  మాఅబ్బాయికి 28 సంవత్సరాలు. మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం. వివాహంతో...ఓ ఇంటివాడు కూడా అయి సంవత్సరం కావొస్తుంది. వాడిని చూసినప్పుడల్లా ఉన్నత శిఖరాలను చూసినట్టుగా ఆనందపడ్డాను. తల్లిగా నాబాధ్యత సక్రమంగా నిర్వర్తించాననే నమ్మకంతో ఉండిపోయాను.

   

  ‎అంతా బాల్యాన్ని తలుచుకుని మళ్లీ ఆరోజులు వస్తే బావుండునని ఎంతో ఆనందంగా చెప్తూ వుంటారు. కానీ మా అబ్బాయి తన బాల్యం గురించి తన స్నేహితుడికి చెప్తున్న మాటలు విన్నాకా ...అప్పటి ఆపసిహృదయం పడ్డ వేదన నాకిప్పుడు అర్థమైంది.

   

  ‎వాడి మాటలు విన్నాకా...నాకూ ఆనాటి రోజులు కళ్ళముందు మెదిలాయి....

   

  ‎వాడు నాకడుపు నుంచి ఈభూమ్మీద పడ్డప్పుడు నుంచీ..వాడినెంతో ఆకాశాన్ని ఎత్తేయాలన్న ఆశతో...వాడి ప్రతి చర్యా నేనే గమనిస్తూ...మాటలు నేర్పడం, ఆటలు ఆడించడం,స్కూలుకి తీసుకెళ్లడం,అక్షరాలు దిద్దించడం, హోమ్ వర్కులు చేయించడం, నా అభిరుచైన చిత్రసలేఖనంలో కూడా స్వయంగా శిక్షణ ఇవ్వడం, వాడికిష్టమైన చదరంగంలో శిక్షణ ఇప్పించడమే కాకుండా ఎక్కడ పోటీలు నిర్వహించినా పాల్గొనేలా ప్రోత్సహించి ...బహుమతి గెలుచుకోవాలన్నట్టు తాపత్రాయ పడేదాన్ని. వాడలా బహుమతి గెల్చుకున్నాడంటే...అదంతా నేను వాడికిచ్చిన శిక్షణ ఫలమే అన్నది మాత్రం నిజం. అలాగే...చదువులో కూడా ఏరోజు ఇచ్చిన నోట్స్ ఆరోజే చదివించి రాసేవరకూ వదిలిపెట్టేదాన్ని కాదు. పరీక్షలకు సిలబస్ ప్రకారం అన్నీ చదివించి , అన్నీ అప్పచెప్పుకుని వాటిపై ఇంట్లో కూడా నేనూ ఒక టెస్ట్ పెట్టాకా...వచ్చిన తప్పులను మళ్లీ మళ్లీ కరెక్ట్ చెప్పేవరకు పుస్తకాలు మూయించేదాన్ని కాదు. మర్నాడు పరీక్షకు పంపుతూ రివిజన్ చేయించి...ముందు రోజు తప్పు చెప్పినవన్నీ తప్పులు రాయకుండా గుర్తుచేసి...పరీక్ష బాగా రాయమని చెప్తూ ...స్కూలుకి సాగనంపుతూ జాగ్రత్తలు చెప్పేదాన్ని.

   

  ‎పరీక్షలు అయ్యాకా మార్క్స్ ఫైల్ ఎప్పుడిస్తారా అనే ఎదురుచూపు. ఆరోజు ఇస్తారని తెలియగానే మార్క్స్ చూసేయాలన్న ఆత్రుత. అన్నీ నేర్పించి పరీక్షకి పంపాను కదా తప్పకుండా వాడికే మొదటి ర్యాంక్ వస్తుందనే ధీమా నాలో.తీరా ఫైల్ చూసాకా... రెండో, మూడో తక్కువ మార్క్స్ రావడం వల్ల ...ఐదారు ర్యాంకుల వెనక్కి వెళ్లిపోయేసరికి నాలో విపరీతమైన నిరుత్సాహం. ఆబాధతో వాడికేమీ రావనే బాధతో మరికాస్త ఎక్కువగానే నూరిపోసేదాన్ని చదువు విషయంలో. నా కంటి తుడుపుకేమో... ఎప్పుడైనా వాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడంటే ఉబ్బితబ్బిబ్బయ్యేదాన్ని. ఆనందం వచ్చినా కంటిమీద నిద్ర కూడా కరువవుతుందని అప్పుడే అర్థం అయింది. ఇలా పదవతరగతి వరకు నా చేతిలో కీలుబొమ్మయ్యాడు నాకొడుకు. ఆతర్వాత ..వాడికి చదువు చెప్పేటంతటి పెద్ద చదువు నా దగ్గరలేదు.నేను చదుకున్నది అంతంత మాత్రమే. నా చెర నుంచి బయటపడి విముక్తుడయ్యాడేమో... వాడికి చదువు ఏం వస్తుందో ఏం రావడం లేదో...? మార్కులు ఎలా వచ్చినా పట్టించుకునే స్థితి దాటిపోయాను.అంతా దేవుడి మీదే భారం వేసాను కాబట్టే... ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి...క్యాంపస్ లో వాడంతట వాడే ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇది వాడు సాధించిన ఘనవిజయమే అయినా...చిన్నప్పుడు చదువులో నేనిచ్చిన పునాది గట్టిగా ఉండటం వల్లేనని నా మనసు నొక్కిచెప్తూ ఉంటుంది. ఏదైనా... వాడు జీవితంలో వాడికాళ్ళమీద వాడు నిలదొక్కుకున్నాడు.నాకదే కొండంత సంతోషం. వాడి విషయంలో వాడినాన్నకంటే నేనే ఎక్కువుగా బాధ్యత తీసుకున్నందుకేమో... వాడిమీద పూర్తి హక్కులూ నాకున్నాయనిపించించి.. నేనంతా వాడి గురించి మంచే ఆలోచిస్తూ చేస్తున్నా అనుకున్నాను .

   

  ‎కానీ...వాడి మాటలు విన్నాకా...నేను వాడి దృష్టిలో చాలా అన్యాయం చేశాననే ధోరణి కనిపించింది. చిన్నప్పుడే నాపై వాడికెంత ద్వేషం రగిలిపోయి ఉన్నాడో...? నిజమే...వాడి మాటల్లో నిజం ఉంది. నేను వాడికి చాలా ద్రోహం చేసాను. పూవుగా వికసింపచేశాననుకున్నాను గానీ...మొగ్గలోనే వాడిపోయాడని ఇప్పుడర్ధమైంది. ఎంతో చలాకీగా ఆడుకునే వయసులో చదువే ధ్యేయమంటూ ... రాకాసిలా పీడుస్తూ... పిక్కబాసెము పెట్టిన సంఘటనలూ , మార్కులు తక్కువొచ్చాయని తట్టుకోలేక క్లాసురూమ్ లోనే వాడి స్నేహితుల ముందే చెంపదెబ్బలు కొట్టిన గ్రహాపాటు క్షణాలు అన్నీ గుర్తుకొచ్చాయి. స్కూలు నుంచి ఇంటికి తీసుకొచ్చీ రాగానే వాడి కడుపుకింత అన్నం కుక్కేసి...ఒక అరగంటైన రెస్ట్ ఇవ్వకుండా గదిలోకి తీపైకెళ్లిపోయి ఆ రోజు చెప్పిన పాఠాల్ని నూరి పోయడమే కదా ఆనాడు నేను తప్పు. తోటి పిల్లలతో ఆడుకోడానికి పంపడం గానీ, సరదాగా పార్కులకి, టూర్లకు తీసుకెళ్లింది ఎక్కడ? ఇప్పడాలోచిస్తుంటే ఆనాడు నాలో ఎందుకంత చదువు పిచ్చి పట్టిందో నాకే అర్థం కావడం లేదు.బహుశా ఈపోటీ ప్రపంచంలో వెనకపడిపోతాడే మో అనే భయంతో కావచ్చు.ఏ ఆటైనా చదువైపోయాకనే వదిలేదాన్ని. ఇచ్చిన ఆ సమయమైనా ఇంట్లో కూర్చుని ఆడుకునే ఆటలే గానీ ఏ గ్రౌండ్ కీ ఎప్పుడూ పంపించలేదు. నా బాల్యం ఇంత దరిద్రంగా ఏడ్చిందని వాడి స్నేహితుడికి అప్పుడు తాను అనుభవించిన బాధ చెప్తుంటే...నాకు కన్నీళ్లు వచ్చాయి. నేనెంత మూర్ఖురాలిగా ఆనాడు ప్రవర్తించానో నాకిప్పుడు అర్థం అయింది. మార్కులే ముఖ్యమనుకుంటూ వాడి సంతోషాన్ని కుప్ప కూల్చేసినందుకు సిగ్గుపడుతున్నానిప్పుడు.చదువే లోకమని అదేపనిగా రుద్దేయకూడదని ఎన్నో విషయాలు జ్ఞానోదయమైంది.

   

  ‎నేనిప్పుడు ఒక్కటే నిర్ణయించుకున్నాను. బాల్యంలో వాడు పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి వాడికి ఇవ్వాలంటే... వాడికి పుట్టబోయే వాళ్ళని నాదగ్గరే పెట్టుకుని ఆదర్శప్రాయంగా తీర్చుదిద్దాలని, ప్రతీక్షణం వారి కళ్ళల్లో ఆనందం కనిపించాలని, వారి ఇష్టానికి కూడా స్వేచ్చనివ్వాలని, చదువంటే భయం ,జుగుప్సా కలిగేలా చేయకూడదని ...ఆసున్నిత మనస్కులకు చెప్పే విధంగా చెబుతూ ... మానసిక ఉల్లాసం కల్పిస్తూ .. బాల్యం లోనే బంధాలపై మమకారం పెంచేలా మరో మంచి పెంపకాన్ని నేరవేర్చాలనిపిస్తుంది.

   

  ‎ నాపిచ్చి గానీ ... నాకీ అవకాశం నాకొడుకు నాకిస్తాడని ఆశ పడ్డం వేస్ట్ ఏమో...? అప్పట్లో వాడికి నామీదున్న కోపం ఇప్పటికీ మర్చిపోలేకపోయాడంటే...వాడు పడ్డ మనసు కష్టానికి వాడి బాల్యం మొగ్గలోనే వాడిపోయింది . వాడి మనసు వికసించడానికి తావే లేదు.

   

  పిల్లల యందు ‎నాలా ఏతల్లీ ప్రవర్తించకుండా ఉంటే చాలు.మనసులో నన్ను నేను అర్థం చేసుకుంటూ ...పాపప్రక్షాళన చేసుకోవాలనే తలంపుతో తాపత్రాయపడుతున్నానిప్పుడు.

     

      *   *   *   *   *   *   *  *  *

  ‎


  ‎

  ‎


   


   


   

  

  


Rate this content
Log in

Similar telugu story from Drama