STORYMIRROR

Mirapa Mahesh

Inspirational

4  

Mirapa Mahesh

Inspirational

యోధురాలు

యోధురాలు

1 min
319


పురిటి యుద్ధంలో రక్తమోడ్చి...

మరణమో..,కోతగాయమో పొంచిఉన్నా..

వెనుదీయక విజయతీరం చేరే వీరనారి అమ్మ...

కంటి కొనలనుండి ఉప్పొంగే కన్నీటి సంద్రాన్ని...

ఓపలేని పురిటినొప్పుల నిప్పుల కొలిమిని...

ఆనంద చారికలుగా మార్చుకొని...

అమ్మతనం ఒసగిన ప్రతిరూపాన్ని చూసికొని...

విజయగర్వంతో మైమరచే యోధురాలు అమ్మ...

ప్రేమ., ఆప్యాయత., అనురాగం., త్యాగం., సేవ.,శ్రమ.,క్షమ లాంటి..

సుగుణాస్త్రాలు ఎన్నో అమ్మ అమ్ములపొదిలో...

తనకే తుదకు ఆసరా కొరవడినా...

కన్నబిడ్డకు ఖచ్చితంగా ఆదరణ ఇచ్చేది అమ్మ...

పసిపాపకు పట్టెడు పాలకోసం...

పవిట పరచే పడుపు పనికైనా...

పవిత్రంగా పతనమయ్యే సుశీలవతి అమ్మ...

వెర్రిబాగులదని లోకమంతా ముద్రవేసినా...

మహాజ్ఞానులను కని పెంచే ఆదిగురువు అమ్మ...

అతివకు ఆలంబనమైన అపురూప అందాన్ని...

అమ్మతనం కోసం త్యాగమిచ్చే విశ్వసుందరి అమ్మ...

దేవుళ్ళకైనా అమ్మ గర్భాలయమేగా జన్మస్థానం...

విధివంచితయై పిల్లల కడుపునింపేందుకు కుదవ దక్కక..

కుదేలైపోక., కోకజార్చి కన్యత్వాన్ని అమ్ముకోక..

కాలే కడుపులు నింపేందుకు దారిలేక యాచిస్తోంది..

సాటి మగువలే కొవ్వెక్కి కన్నావా అంటూ..

వారి కొవ్వెక్కిన నాలుకలకు పనిచెప్తున్నా..

అడ్డదారులు మరిమరి కవ్విస్తున్నా తప్పుచేయక..

వెక్కిరిస్తున్న సమాజాన్ని క్షమిస్తున్న కోవెలలో దేవత..

అమ్మ ఆరంభం..., అమ్మ అనంతం...

అమ్మ అపురూపం.., అమ్మ అద్వితీయం..

అమ్మ అమృతం..., అమ్మ అజరామరం...

సృష్టిలోని వేదభాషలన్నీ ఏకమైనా...

అమ్మ ప్రేమ ఎప్పటికీ అనిర్వచనీయమే...!

అంతటి నిస్వార్థ త్యాగాల అమ్మతనం..

ముసలి సత్రాల కుక్కిమంచాన...

వృద్దాశ్రమ చీకటి గోడల నడుమ...

పేగుతెంచి రక్తం పంచుకు పుట్టిన బిడ్డల...

చిరుప్రేమ నోచక ...బంధీ అయ్యింది..

ఒంటరిగా.. అనాధలా...మౌనంగా..!

అమ్మ మౌనం...ఈ సిగ్గులేని సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తూనే ఉంటుంది..

ఐనా బాధలేదు,భయంలేదు అమ్మకు..

ఎందుకంటే.. అమ్మ ఓ వీరనారి...

అమ్మ.. జీవితం గెలిచిన, గెలిపించిన ఓ మహా యోధురాలు...!!


మిరప.మహేష్ (తరంగం)

జగ్గంపేట,

ఆం. ప్ర.వైద్య ఆరోగ్య శాఖ.,

9948039026.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational