వేటు
వేటు
నీ కోసం కళ్ళు కాయలు గాచేలా ఎదురు చూసాను
తిరగని తీర్ధం లేదు
మొక్కని రాయి లేదు
వేడుకోని డాక్టర్ లేడు
అర్ధించని దేవుడు లేడు
నోచని నోము లేదు
చేయని పూజలు లేవు
నోముల పంటగా , కన్నుల పండుగగా
నా కడుపు పండితే
నిన్నూహిస్తూ బొమ్మలు వేసాను
కబుర్లు చెప్పాను
నీ కొరకు ఎండకన్నే ఎరగని నేను
అష్టకష్టాలు పడ్డాను
కడుపులో కాలితో తంతే
మురిపెంగా ముద్దుపెట్టుకున్నాను
అడ్డం తిరిగిన బిడ్డ
నీ ప్రాణానికే ముప్పు అని డాక్టర్లు అన్నా
నాకు నా బిడ్డే ముఖ్యమంటూ
నరక యాతన అయినా
కడుపు కోత (సిజేరియన్)కు సిద్ధపడ్డాను
నా పాలు తాగుతున్న
నీకు కష్టం కలుగుతుందని
నాకిష్టమైనవన్నీ తినడం మానేసాను
బోసి నవ్వులతో, చిన్నారి కాళ్ళతో
గుండెలపై తంతుంటే
పాదాలు ఎక్కడ కందాయోనని ముద్దాడాను
తడబడే అడుగులతో కిందబడితే
దేబ్బతగిలిందని ఉక్రోషంగా నేలతల్లిని కోప్పడ్డాను
పదోతరగతికే ఆరిందాలా మాట్లాడితే
నీ అల్లరికి మురిశాను
పై చదువుకై తప్పక వీడి పోతున్నపుడు
భరించలేకపోయాను
తాత్కాలిక ఎడబాటుకే కదిలి
నిరంతర నీ ధ్యాసలో నను నేను మరిచాను
తిరిగి వచ్చిన నిన్ను చూసి
ఇక నా బిడ్డను నా నుండెవరూ
వేరు చేయరని గర్వపడ్డాను
కాని..ముప్పై వసంతాల కన్న పేగు బంధాన్ని
మూడు ముళ్ళతో మూడునెలల్లో
కొనగోటితో తెంపేసి
నేనే భారమంటూ వేరుబడ టాన్ని
భరించలేకపోయాను
భయానక స్వప్నమైనా బావుండుననుకున్నాను
కాని భయంకరమైన వాస్తవమని తెలుసుకున్నాను
ఇక మళ్ళీ ఎన్నటికీ విడిపోమనుకున్న
నా గర్వానికి ఆశనిపాతంలా
తగిలిన వేటు
నన్ను జీవచ్చవాన్ని, ప్రాణమున్న శిలనే చేసింది
**************