వైరాగ్యం
వైరాగ్యం
వైరాగ్యం పుట్టుకొచ్చే కుటిరం
వైధవ్యాన్ని నెలకొల్పే నిలయం
వైతరణి పయణానికి ఇక్కడే శ్రీకారం
వైవిధ్యమైన ఆచారాల
అంతిమ సంస్కార స్థావరం
అంకం ఆఖరిదైనా ఇక్కడా
చెల్లించాలి సుంకం
కొరివి పెట్టే కొడుకు లేక
మట్టి కొట్టే మనిషి లేక
పిండాకూటిని కూడా కలిసి పెట్టలేక
అస్తులు,ఆస్తుల లెక్కలు తేలక
మెడపట్లతో మెలి పెట్టే చోటు
ఆఖరికి ఆచోటు కూడా లేక సమాధులపై
సమాధులు వెలుస్తున్న సమాధుల సమాహారం
కాలే శవాలు, బూడిద కుప్పలు,
పగిలిన శిలా ఫలకాలు, పాలరాతి సమాధులు
కులమతాల వారిగానే విరాజిల్లే వాటిక
రియల్ ఎస్టేట్ దందాలో రాత్రికి రాత్రే
ఆక్రమణకు గురవుతున్న శ్మశాన ఆవాసం
ఆకలి ఖననమయ్యే దహనవాటిక
శరీరాల శాశ్వత నిద్రపేటిక
అన్ని బంధాలకు ఆఖరి వేదిక
కడవాడికి వాడికి కాడు,వల్లకాడుగా
మధ్యతరగతి వాడికి శ్మశానంగా
ఉన్నత వర్గాలకు మహాప్రస్థానంగా
వీరులకు శూరులకు మరుభూమిగా
తారతమ్యాలతోటే విరాజిల్లే శవవనం
ప్రతివారి రాకకోసం ఎదురు చూసే ధర్మభూమి
ప్రతినిత్యం రోదనలు ఘోషించే రుద్రభూమి
అనాధ శవాలనైనా ఆదరించే శవాలయం
ఇదే శివుడు నడయాడే శివాలయం
