తప్పిపోయిన స్వరం
తప్పిపోయిన స్వరం
కోకిల గానంలో తప్పని శృతి
పిచ్చుకల కిచకిచల్లో మారని గొంతులు
లేక దూడ అంబా పిలుపులో మాధుర్యం
గబ్బిలాలు గొంతులో చీకటి నింపే భయం
పశుపక్ష్యాదుల స్వరాలు తప్పిపోవడం గమనించం
మనుషుల స్వరాల్లోనే ఎన్నెన్ని మార్పులో
సమయం తీరు సందె వార్చినట్లుంటాయి
ఇస్తునమ్మా వాయనం అన్నట్లు మార్పు
స్వరం గాన కోకిల అయినప్పుడు
బాధలు, భావుకత్వం, ప్రేమలు,మాధుర్యాలు అన్నీ
రాగాలు మార్చుకొని, రాగమయమైతే
గూడు కట్టుకుంటాయి హృదయాలలో
అలాంటి స్వరం తప్పిపోయిందని తెలిస్తే
అనుభూతి పొందిన మొకాలు వెలవెలబోతాయి
ఆముదం మొక్కలే మహావృక్షాలైనట్లు
కొన్ని స్వరాల ఫోజులు
చెవుల్లో పెట్టుకునే దూదులకు గిరాకీ
అవి తప్పిపోయినా, తన్నుకు చచ్చినా
చిరుగాలికి లేచిపోయే దుమ్ములా పట్టించుకోరెవరు
కుదురుగా ఉన్న ఇంట్లో ఒక్క స్వరం తప్పిపోయినా
పిల్లాన్ని కోల్పోయిన తల్లిదండ్రులవుతారంతా
బావురుమని బాధను వెల్ల గక్కుతారంతా
శరీరం నుంచి స్వరం తప్పిపోతే
సైగలే దిక్కు దివానం
గాన గంధర్వులు, పాటతో జీవించేవాళ్లు
స్వరాన్ని మేలిముత్యంగా చేసుకోవడానికి
అదుపులో పెట్టుకొని నాలుకను
గొంతును మార్చుకుంటారు మేలిమి బంగారంగా
.
