సరికొత్త ఊపిరి
సరికొత్త ఊపిరి
మాసిన బట్టలను మల్లెపువ్వులు చేయడం
ఎండిన మొద్దును దర్వాజా గానో, కిటికీగానో
మరో పరికరంగానో తీర్చిదిద్దడం
రాతిని రసరమ్య శిల్పంగా చెక్కడం
మట్టిని బువ్వ కుండల్లా మార్చడం
ఇనుమును కాల్చి నాగేటి కర్రుగా చేయడం
పని ఏదైతేనేం కొత్త ఊపిరి పోయడంలో ఉంటుంది శ్రమ
మార్పు భవిష్యత్తుకు వెలుగు రేఖ
గర్భం దాల్చడం ఆనందం కావచ్చు
ప్రాణం పంచివ్వడంలో అపరిమిత ప్రేమ
జన్మనివ్వడంలో భరించే బాధలన్నీ
జీవులందించే కొత్త ఊపిరి
కొత్త ఊపిర్లకు శ్వాసనివ్వడం ప్రకృతి ధర్మం
విత్తు వృక్షంగా మారడం
వర్షం నదిగా ప్రవహించడం
సూర్య రశ్మి పత్రహరితాన్ని సృజించడం
ప్రాణవాయువై గాలి నిలవడం
ఏవైనా సరికొత్త ఊపిర్లను స్వాగతించేవే
కొన ఊపిరిలోనైనా కొత్త ఊపిరి కోసం ఆశ పడ్తాం
వెంటిలేటర్ పై పెట్టైనా పెంచాలనుకుంటాం జీవితం
యమధర్మరాజుతో కొట్లాడిన సావిత్రిలా
చివరి అంచు వరకు పోరాటం చేస్తాం
మనం తీసుకునే ప్రతి శ్వాస కొత్త ఊపిరే
ప్రాణాంతక కాదు ప్రాణవాయువు కావాలి
అందరికీ, అన్నింటికీ అన్నివేళల