సాధువర్తన
సాధువర్తన
ధర్మ వర్తన సత్యంబు దాన గుణము
సహన శౌచము క్షమయును శాంతి దయయు
వినయ శీలత్వముల్ మదిఁ బెంచుకొనుచు
మెలుగు చున్నట్టి మనిషికి మేలు కలుగు.
గౌరవించుచు పెద్దలన్ గలిసి మెలిసి
ప్రేమమీరగ పిల్లలన్ పెంచుచుండి
పొరుగు వారితో సఖ్యత పొసగుచుండి
జీవితంబును గడుపగా చేరుసుఖము.
మదపు భావనల్ మనసును మాయచేయు
లోభగుణ మున్నమనిషిని కూలద్రోయు
కామముల వెంట పరుగిడ కాలిపోయి
జీవితంబున కష్టాలు చీడవోలె
పట్టుకొన్నచో వదలవు భవిత లేదు.
చక్కనైనట్టి చిరునవ్వు సంపదగును
భాషణంబున సరళత బంధువగును
సహజగుణము లిట్టివికల సజ్జనుండు
పుణ్యముల నిచ్చు కీర్తిని పొంద గలడు./
------------------------------
