ప్రియా సఖా
ప్రియా సఖా
జ్ఞాపకాల జాతరనిక..మోయలేను ప్రియసఖా..!
క్షణమైనా నిరీక్షణగ..నిలువలేను ప్రియసఖా..!
తిరుగులేని పరుగే మరి..బహుమతిగా తోడైనది..
ఎంత వద్దు అనుకున్నా..ఆగలేను ప్రియసఖా..!
ఈ విరహపు తీపి బరువు..చెప్పనెలా మాటలలో..
ఎవరి ఎదుట ఓ పాటగ..పాడలేను ప్రియసఖా..!
జాతకమే మార్చినావు..పారిజాత వనము చేర్చి..
పరిమళించు రేయి జతను..వీడలేను ప్రియసఖా..!
మరువంతో పనే లేని..మత్తులోన ముంచేస్తివి..
నీ సన్నిధి లోని హాయి..మరువలేను ప్రియసఖా..!
నిదుర తోటి గొడవపడక..చేరు పడక కుదిర్చితివి..
ఎఱుకనుంచు చితి విలువే..కట్టలేను ప్రియసఖా..!
