పండుగ
పండుగ
తనచుట్టూ నే'తిరుగుతు..ఉండటమే పండుగ..!
ఎదలోపలి మల్లెతీగ..నవ్వటమే పండుగ..!
నడుస్తున్న చదరంగం..నాటకమే అంతా..
చెలిమువ్వల మౌనముగా..మిగలటమే పండుగ..!
కరుణగాక గొప్పనిధియె..లేదన్నది సత్యము..
అమృతమేఘ వర్షిణితో..ఆడటమే పండుగ..!
గాయపడిన వేణువులా..చూశావా మనసును..
చెలియప్రణయ గీతికగా..పొంగటమే పండుగ..!
చెలివలపుల దీపావళి..నిత్యమేను లోపల..
మైమరపున తేలిపోక..బ్రతకటమే పండుగ..!
క్రొత్తదనం కావాలను..ఆరాటం దేనికి..
ప్రతి క్షణం సరికొత్తగ..పుట్టటమే పండుగ..!
పాఠాలను నేర్పాలని..తలచడే మన్మధుడు..
అంతరంగ వాహినితో..సాగటమే పండుగ..!

