మధ్యతరగతి వాడి బ్రతుకు
మధ్యతరగతి వాడి బ్రతుకు
గొప్పలెన్నో చెప్పావు,
అప్పులెన్నో చేశావు,
తిప్పల తాళ్ళతో
పక్షిలా ఎగరలేక
ఉక్కిరి బిక్కిరి అవుతున్నావా
మధ్యతరగతి మానవ,
విలాసాల మాయలో
వినోదాల జోరులో
విందుచేయు తలపుకు
బ్రతుకుకు అశ్రువును కానుక చేస్తావా,
రెక్కాడని(పనిదొరకని) రోజులతో పస్థులుంటావా,
మారవయ్యా ఇకనైనా
బాధ్యతలనెరిగి సాగవయ్యా ఇపుడైనా.
ఆశలచెట్టుకు కొత్తచిగురులు చూడవోయ్
నిరాశవీడి జాగ్రత్తల బలంతో
బంధనాలు త్రేoచుకోవోయ్,
విలాసాలు వెతుకులాడు మదికి తాళ్ళను బిగించవోయ్,
ప్రతీ శ్వాసలోనూ అనుభవం చెప్పిన పాఠం వినవోయ్,
మోయలేని ఖర్చులతో
శూన్యంవైపు పయనిస్తే
వల్లకాటి రహదారి కనిపించేనోయ్.
వేడుకల వెర్రిలో మేలిమిబంగారు వన్నెలు వుండవోయి,
అదుపు పొదుపు మదుపు
సుఖ శాంతుల మంగళరూపులోయ్,
భవితను ఊరించే కాలాన్ని
విజ్ఞతతో
తెలుసుకు సాగాలోయ్,
వేటగాడి వలలో చిక్కిన పిట్టలా
యాతనల రాగం వీడి
ఆనంద విహారం చేయాలోయ్.
