పాహి!పాహి!
పాహి!పాహి!
సీసము :1.
రామ రామ యనుచు రసనంబు పల్కగ
పాపపు జన్మంబు పండి పోవు
పాదంబు పట్టుచో భాగ్యంబు కల్గగా
భావి జీవిత మెల్ల వర్థిలునట
కమనీయమౌ గాథ గానంబు చేయుచో
కామితమీడేరు కరువు తీరు
శిరమును వంచుచు శరణము కోరినన్
వరములు గుప్పించు వరదుడెపుడు
తేటగీతి /
పవలు రేయియు తల్చిన భయము బాపి
వేల్పుటావుగ చరియించి వెనుక ముందు
శ్రీరఘువరుండు తోడుగా సిద్దులిడగ
మోక్ష మిచ్చెడి వేల్పును మ్రొక్కుకొందు.
సీసము :2
ధర్మాత్ము డైనట్టి దయగల రాముని
పాదంబు పట్టి నే పాహి యందు
వైదేహి పతియైన వారిజ నేత్రుని
వందనంబనుచు నే ప్రస్తుతింతు
స్నేహధర్మము నిల్పి చెలికాని కాపాడి
బలము జూపిన వాని కొలుతు నెప్డు
లంకపై దండెత్తి రావణు కూల్చిన
దానవారికి నేను దాసి నందు
జనుల బ్రోవగ ధరణిపై జన్మ నొంది
కానలందున తిరిగుచు మానితముగ
నడిచి యున్నట్టి రాముని నమ్మి మదిని
మ్రొక్కు కొందును భక్తిగా ముక్తి కొఱకు.
