నీ మది
నీ మది
చేయే వీడని చెలుడను నేనని తెలిసిన చాలును..!
నీమది లోయల వెన్నెలసుధగా నిండిన చాలును..!
వెచ్చని కలలకు రూపం ఇచ్చేపనియే మధురం..
ఆశలమేడను కాచే రెక్కలు మొలిచిన చాలును..!
తీరం చేరని అలలను మోసే సంద్రం హృదిలో..
తీరని విరహపు గదికే సాక్షిగ నిలిపిన చాలును..!
భారం నీపై మోపే ముచ్చట నచ్చదు నేస్తం..
తప్పులు వెదికే గొడవకు సెలవే ఇచ్చిన చాలును..!
పాటకు చూపులు పల్లవి చేసిన నెచ్చెలి నీవే..
నీశుభ హాసం హంసధ్వనిగా పొంగిన చాలును..!
బంగరు పున్నమివేళలు ఎపుడూ నీ జతలోనే..
నీపద దాసుని చేసే తలపులు పండిన చాలును..!