నేను
నేను
ఊరుచేరి చేరగానె..రాగమైతి నేను..!
యేటిగట్టు తోటకొమ్మ..గీతమైతి నేను..!
తడియారని జ్ఞాపకాల..కోవెల కద ఊరు..
రాములోరి గుడిగంటల..నాదమైతి నేను..!
పెద్దబాలశిక్ష లోన..లేని విషయ మేది..
ఈతబరిక ఝళిపిస్తే..మాయమైతి నేను..!
పెరటి గంగరేగు తీపి..యాపిలేల ఇచ్చు..
సంకురాత్రి గొబ్బెమ్మకు..పద్యమైతి నేను..!
పొలంగట్టు మీద లేగ..గెంతువెంట పరుగు..
ఈనిన వరిచేను పాల..హాసమైతి నేను..!
అవ్వచేతి గోరుముద్ద..రుచి మరిచేదెలా..
చెప్పరాని ఆవునెయ్యి..జ్ఞానమైతి నేను..!