నాన్న టపాసులు కావాలి
నాన్న టపాసులు కావాలి
నాన్న టపాసులు కావాలి!
నాన్న టపాసులు కావాలి!
పొద్దుపొడిసి
పొద్దుగూకింది
ఇప్పటికిది
ఆకాశంలో రాత్రిమొలిచిన చుక్కలన్ని సార్లు
నాబిడ్డ నా గదవపట్టుకుని
బుజ్జగించింది
ఆ బుజ్జగింపులో మా నాయిన తప్పకుండ
కొనిపెడతాడనే అపారమైన నమ్మకం
నా బిడ్డ కళ్ళల్లో దీపావళి దీపమై
వెలుగుతుంది
ఆ వెలుగుని అలాగే నా కళ్ళలో నింపుకుని
జేబులో ఉన్న రొండువందల రూపాయలు
సరిచేసుకుని
నా బిడ్డ కళ్ళు ఏ నమ్మకం తో వెలుగుతున్నాయో
ఆ వెలుగుల్ని రెండింతలు
చేసాను!
టపాసుల సంచి తనకందించి!
రెన్నెల్ల నుంచి పైసల్లేవని
ఉట్టికాళ్ళతోనే తిరుగుతున్నావ్
ఇయ్యాల పైసలచ్చినాయి
కొనుక్కుంటానంటివి కొన్నావా
నా ఇంటిది లోపటినుంచి అరుస్తుంది!
నా బిడ్డ కాలుస్తున్న తారాజువ్వ
వెలుగులో నా ముఖం నా బిడ్డముఖం
వెలిగిపోతున్నాయ్
నా ఇంటి దాని మాటలు
ఆ వెలుగులో మసకబరిపోయాయి
