మిథునం
మిథునం
నేను, నీవు కలిస్తేనే మనం, మన జీవనం
మన కలయికతోనే జీవితమంతా మధురం
జీవితమంటేనే నలుపు, తెలుపుల సంగమం
సుఖ దుఃఖాలు, వెలుగు నీడల మిశ్రమం
నేను, నీవు ఏం కాస్త దూరమైన క్షణాలు
జ్ఞాపకాల ఊసులతో నెమరేసిన గడియలు
అహం, అహంభావంతో ఆత్మ ఘోషలు
వెలుగు, అంధకారంలో వెంటాడే ధ్యాసలు
నీడ లేకపోతే వెలుతురుకు విలువేది
సుఖం దుఃఖాన్ని మరిపించిన రోజు ఏది
దుఃఖమే సుఖానికి అర్థం, పరమార్థం
ప్రశ్నకు జవాబులు లేకుంటే ప్రశ్నార్థకం
మనిషికి జీవితమంటే కాదు ఏకత్వం
వైవిధ్యమైన భిన్నత్వంతో పరిపూర్ణత్వం
నిత్యం విరుద్ధాల యుద్ధం కూడా కాదు
ఏదో ఒకదానిలో ఒదిగే అస్తిత్వ సమతుల్యం
మిథునం రెండు కాదు, ద్వంద్వం కాదు
ఒకటిగా కనిపించే రెండు సత్యాలు
ప్రశ్న, ప్రతి ప్రశ్నల మధ్య జీవిత సత్యం
నమ్మకం, అపనమ్మకాలతో ఊగే భావం
ఓ అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి
ఆలోచనలే దిశలయ్యే యాత్రా గమనం
సత్యంతో అబద్ధం, అబద్ధంతో సత్యం కాదు
సత్యం మరో సత్యంతో చేసే సంభాషణం
విరుద్ధాలైనా పూరకాల సంగమ స్వభావం
ఎన్నో ధారలైన వాన మారేటి ఒకే ప్రవాహం
నడిచి, నడిచి ఒకే నదిగా కలిసే చైతన్యం
మిథునం అంటే ద్వంద్వమేల, సమతుల్యత !
