జీవితం
జీవితం
నగ్నంగా ఆకారం తిరుగుతుంది సమాజంలో
ఆదిమానవుడి ఆనవాళ్లను గుర్తుచేస్తూ
నూలు పోగుల దారం నిప్పులా కాలిపోతే
మతిస్థిమితం తప్పి మనిషికి వస్త్రము భారమై నిలిచే...
ఏ వ్యాధులు తెలియని నిర్భాగ్యపు జీవితం
చెత్త కుప్పలపై సేదతీరుతున్న వైనం
మురికి పట్టిన ఆహారం పరమాన్నమై రుచిస్తుంటే
ఈగలు ముసిరిన దేహం సందేహాలు లేవనెత్తుతుంది...
రాత్రి పగలు తేడా తెలియని నడకల వ్యాయామం
తనలో తాను వేదాంతం వాదించుకుంటూ
అరుపులు కేకల మాటల సవ్వడులా లావణ్యం
ఎవ్వరికి చెప్పెనో ఆత్మ ధర్మపు ప్రబోధ విలాసం...
నిండైన సొగసైన తనువుల రూపం
మాలిన్యపు సొగసుతో అలంకారమై ప్రకాశించే
కాల పరీక్షలో గతి తప్పిన
మనసు విచ్చిన్నమై
కొత్త లోకంలో విహరించే పాత స్వప్నమై తిరిగే...
తనువుల పై మానసిక దాడి జరుగుతుంటే
తెలియని అయోమయం కన్నీటి వీడ్కోలు
కామపు మృగాలకు దొరుకుతున్న విగతజీవులు
కండ్లున్న సమాజం చీకట్లో చూస్తూ నిలబడిపోయింది..
అడగడానికి ఎవరున్నారు అనాధలా నడుస్తుంటే
ఛీత్కారపు మాటలతో శిక్షలు విధిస్తుంటే
గమ్యం లేని బ్రతుకులో కోటి ప్రశ్నలు ఉదయిస్తుంటే
సూర్యునికి ఏం తెలుస్తుంది పొద్దు గడిస్తే పోయే వాడికి..
అనాధ శవంలా ఆవిరైపోయే తనువులు
కన్నీటి చుక్కలు రుచి చూడక దేహం కలిసే భూమిలో
కొందరు పిచ్చినిరి మానసిక రోగిగా తేల్చిరి
జీవన యాత్రలో వింత జీవిగా శరీరాన్ని వదిలి పోయేను..