జగద్గురువు
జగద్గురువు
*జగద్గురువు*
(తేటగీతి మాలిక.)
ద్రవిడ శిశువుగ జన్మించి ధరణి యందు
వేద ధర్మమున్ నిల్పిన విశ్వగురువు
బ్రహ్మ మొక్కటే యని ముక్తి పథము జూపి
యాది శంకరుల్ నడిచెదా హంసవోలె.
అపర శంకర తేజమై యావహించి
మూఢ మతుల నోడించుచు ముసురు కొనిన
బలురకంబుల పాషండ పద్ధతులను
గూల్చి వేసిన ఘన జగద్గురువు యతడు.
జీవ పరమాత్మ భేదమున్ జింత చేసి
బోధ జేసె నద్వైతము
బుణ్యమూర్తి.
బ్రహ్మ సూత్రముల్, స్తోత్రముల్ పలుకు చుండి
భాష్యముల్ విశద పరిచి వ్రాసినాడు.
పంచదేవతారాధన పాదుకొనగ
శాస్త్రగ్రంథముల్ రచియించి సమధికముగ
ప్రజల మదిని మార్చినయట్టి పండితుండు.
నాల్గు పీఠముల్ వేదపు నాల్గు భాగ
ములయి భారత కీర్తికి వెలుగు వోలె
నిలిపి సిద్ధాంత బోధనల్ నెరుప ధర్మ
మార్గమున్ జూపె దరియించ మనుజ తతికి.
శంకరుల్ జూపి నట్టియా సాధుగతిని
పట్టి నడిచిన ప్రజలకు భవములుడుగు
శిరసు వంచుచు మ్రొక్కుచు స్థిరముగాను
మదిని నిల్పియా చార్యుని మహిమ తెలిసి
ప్రణతి జేయుచు ప్రజలెప్డు వరల వలయు.//
