హోళీ మొగ్గలు
హోళీ మొగ్గలు


హరివిల్లు వర్ణాలన్నీ హస్తంలో చిక్కించుకుని
ప్రియమారా ఎదుటివారికి పూసే హోళీపండుగ !
రంగునీళ్లతో రమ్యంగా తడిసిన ఆనందం!!
స్నేహగీతం రంగులద్దుకుని పాడుతున్నట్టు
అనుబంధం పెంచే ప్రతీవర్ణం ఆకర్షణపూరితమే!
ఒళ్లంతా అలుముకున్న రంగులు జీవచైతన్యం!!
పూలు పండ్లు కూరగాయలతో సహజసిద్ధంగానే
రంగులతయారీ కూడా ఒక వృత్తివిద్య!
కళాత్మక దృష్టితో పరిశీలిస్తే హోళీ అద్భుతమే!!
వసంతకాలం ఆగమనానికి స్వాగతిస్తున్నట్టు
చిలుకుతున్న రంగులకలలై వీధుల్లో సందడి!
ప్రేమైక జీవితం నవరసాలలో వర్ణచిత్రం!!
ఊరూరా ఒక సౌభ్రాతృత్వ వాతావరణంతో
వయసుమరిచిన కేరింతలు మనోహర దృశ్యాలు!
సంకుచితబుద్ధిని పారద్రోలే జాతీయపండుగ కామునిపున్నమి!!
బృందావన సంచారం అలవోకగా చేయిస్తూనే
రాధామాధవ రాసలీలా తరంగిణి హోళీ!
ఇతిహాసాల సౌందర్యం భారతీయపర్వాల పరంపర!!