గాలి మేడలు
గాలి మేడలు
ఊహలన్ని నిదురలో
మరచిపోవడం అన్నీ మెలకువలో
కలల సౌధాలు ఆకాశంలో
కాలు కదపరు ఇలలో
మాటల కోతలు నలుగురిలో
చేత గాని తనం మదిలో
సుఖాల కోసం ఆరాటం
నోట్ల కట్టలకై ఆయాసం
రెక్కలు ముక్కలు కూటి కోసం
అయినా
గాలిమేడలు నిత్యం
లక్ష్యమెరుగని జీవితం
ఎవరో వస్తారని,
చేయందిస్తారని
ఆశా వలయం లో అనునిత్యం
తెడ్డు లేని పడవ ప్రయాణం
అలల ధాటికి ఎటు పోతున్నామో తెలియని వైనం
ఆశల నిచ్చెన పై కూర్చుని,
సాగరమంతా తిరిగేస్తాం,
సాగర గర్భాన్ని వెతికేస్తాం,
వజ్ర వైడూర్యాలను బయట
కు తీసేస్తాం
నవరత్న,మణి మకుటం తో సింహాసనం పై కూర్చుంటాం
కలలో గాలిమేడల రాజ్యంలో
కుంటుపడిన ఆలోచనలతో
తీరమెరుగని పయనంలో
గాలి మాటలకి పొంగి పోతాం
కపట బుద్ధికి లొంగిపోతాం
నిస్తేజంగా మిగిలిపోతాం
కళ్ళు తెరచినా...యదార్థం
మనసుతో చూసినా... కారుణ్యం
భక్తితో కొలచినా...సంతసం
గాలిమేడల ఆలోచనలు వదలినా... జీవితం
లక్ష్యానికి గురిపెట్టినా...విజయం
నిజ జీవితాన అలుపు ఎరుగక
పరుగు మొదలు పెట్టినా...
కలల సౌధాలు నిజమై,
పూబాటతో పలుకుతాయి...ఆహ్వానం...
సాదర ఆహ్వానం...