దీపావళి పర్వము
దీపావళి పర్వము


*దీపావళి పర్వము*
కరుణ కల్గిన పద్మిని కలిమినొసగి
వరము లెన్నియో కురిపించు పంకజాక్షి
ప్రభవమొందె నీదినమున పండుగనుచు
వేడ్కమీరగ జరుపంగ వీధివీధి
దీపముల్ పెట్టి మురిసిరి దేశజనులు.
సత్యభామతో గూడిన శార్గ్యపాణి
నరకుడను రాక్షసాధమున్ దఱిమి తఱిమి
సంహరించిన దినమని సకల జనులు
పర్వదినమును జరిపిరి వసుధ యందు.
తల్లి లక్ష్మికి మ్రొక్కుచు తన్మయముగ
తీపి పొంగళ్ళు పెట్టుచు దీవెనలను
పొందగోరుచు వచ్చిరి పుణ్యమైన
పర్వదినమున లోకులు భక్తి మీర.
దివ్యమైనట్టి దీపముల్ తీర్చిదిద్ది
గడప గడపలో పెట్టుచు కలియదిరిగి
బంధుమిత్రులన్ ప్రేమతో పలకరించి
పర్వదినమును జరిపిరి ప్రజలు నేడు.
మిన్నునంటిన కాంతులు చెన్నుమీర
కలిమి నిండిన గృహముల కళలు మెఱయ
పిల్ల పాపలన్ దీవించి పెద్దలిపుడు
సంతసంబును పొందిరి సమధికముగ.//