చంద్రమోహనుడు
చంద్రమోహనుడు
తేటగీతి.
*చంద్రమోహనుడు*
చంద్రమోహనుడను మేటి చలన చిత్ర
నటుడు సీమవీడి దివికి నడిచిపోవ
నతని కౌశలముఁ బొగడి యాదరమున
దిగులుతో నివాళి నిడిరి తెలుగువారు.//
మంచి నటుడిగా సీమలో మసలినాడు
పోరు నెరుగని సౌమ్యుడీ పుణ్యశీలి
పొట్టివాడట!జూపి తాన్ గట్టినటన
పెద్ద నటుల నోడించుచు పేరుపొందె.//
నాయికామణులకు నేర్ప నటనయందు
మెళకువలు నాటి తారలు తళుకు మనిరి
పిన్న పాత్రలఁ నటియించి పెరిగి పెరిగి
విక్రమించిన నటుడాయె వివిధగతుల.//
విశ్వనాధుని చిత్రాల పెన్నిధి యన
తెలుగు సీమకు కీర్తిని తెచ్చిపెట్టి
నొదిగి యుండెడి శాంతుడై నోర్పుతోడ
పెద్ద తనమును జూపెడి ప్రేమమూర్తి.//
పాత్ర యేదైన కానిండు వాసిగాను
జేసి చూపించు చంద్రుడీ స్థిరమతుండు
శాశ్వతంబుగా నిల్చునీ సజ్జనుండు
ప్రజల మదిలోన: వానికి వందనములు.//
