చిదిమినబాల్యం
చిదిమినబాల్యం
చిదిమిన బాల్యం.(పద్య కవిత )
----------------------------
తల్లి తండ్రులు లేరని తల్లడిల్లి
చిన్నపిల్లలనాథలై చితికి పోవ
కరుణ చూపెడి వారేరి? కరువు కదర!
మఱచి పోయిరి బాల్యపు మమత లకట!
పలకరించగా రారమ్మ!బంధుగణము.
గంజి దొరకని దినమున కంట నీరు
కడుపు నింపగా నొడిచేరు కలత నిదుర
కమిలి పోయినదేహమ్ము కాల గతిని
రాటుదేలెను బరువైన రాళ్లు మోసి
కూలి పనులకు మళ్లగా క్రుంగి పోయె.
చదువు సంధ్యలు లేకున్న జగతి యందు
మంచి చెడ్డలన్ జెప్పెడి మనిషి లేక
సంఘ విద్రోహు లైరిట చావుకన్న
హీన గతిలోన పిల్లలు హేయమైన
జీవితంబును గడుపంగ చేవతగ్గి
భావి భారత మీవిధి బ్రతుకు నీడ్వ
పట్టదేలనో మనదేశ ప్రజలకెపుడు.
సాటి మనిషికి తోడుగా సాగుచుండి
మమతపంచి యనాథల మంచికోరి
వసతి చూపించి వారిని బాగు చేసి
చదువు సంధ్యలు చెప్పించి చక్కదిద్ది
బ్రతుకు నిలిపిన చాలును భవిత మిగులు.
---------------------------
